వరద బీభత్సంపై అసెంబ్లీలో చర్చించాలి!


శివకోడు 6 నవంబర్ 2012 : వరద బీభత్సం నేపథ్యంలో రాష్ట్ర రైతాంగం ఎదుర్కొంటున్నకష్టనష్టాలపై చర్చించేందుకు అసెంబ్లీని సమావేశపరచాలంటూ కోరతామని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైయస్.విజయమ్మ హామీ ఇచ్చారు. శాసనసభలో రైతుల పరిస్థితిపై చర్చిస్తామని ఆమె చెప్పారు. ముంపు ఇంత తీవ్రంగా ఉన్నా ప్రభుత్వంలో స్పందన కరువైందని ఆమె విమర్శించారు. శివకోడులో విజయమ్మ మంగళవారం వరద బాధితులను పరామర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, నష్టపోయిన పంటకు ఎకరానికి 10 వేల నుండి 15 వేల దాకా నష్టపరిహారం ఇప్పించేలా ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని ఆమె భరోసా ఇచ్చారు. కౌలు రైతులను సైతం ఆదుకోవాలన్నారు. కేంద్ర మంత్రి శరద్ పవార్‌ని కూడా (కేంద్రం ద్వారా) సహాయం అందించాలంటూ కోరతామని ఆమె చెప్పారు. చేతనైనంత మేరకు సాయం అందేలా చూస్తామనీ,  లక్షలాది ఎకరాలలో పంట దెబ్బతిని రైతులు కష్టంలో ఉన్నారనీ, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారికి అండగా నిలుస్తుందనీ ధైర్యం విజయమ్మ చెప్పారు.
కృష్ణా, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి జిల్లాలలో విజయమ్మ పర్యటన సాగింది. గన్నవరం, ఉంగుటూరు, నందివాడ మండలాలలో ఆమె పర్యటించారు. అక్కడ పంట పొలాలలో నీట మునిగి కుళ్లిపోయిన వరి దుబ్బులను రైతులు విజయమ్మకు చూపించారు. రైతులు ధైర్యంగా ఉండాలని విజయమ్మ వారికి ధైర్యం చెప్పారు. ఈ ప్రభుత్వానికి విశ్వసనీయత లేదనీ, జగన్ బాబు వస్తాడనీ, బుడమేరు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతాడని ఆమె అన్నారు.
పశ్చిమ గోదావరి 3 లక్షల ఎకరాలలో పంట దెబ్బతిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. తమ్మిలేరు వరదకు మునిగిపోయిన ఏలూరు పట్టణంలోని వైయస్ఆర్ కాలనీని విజయమ్మ సందర్శించారు. దెందులూరు, భీమడోలు, ఉంగటూరు, గణపవరం, నారాయణపురం, నిడమర్రు, ఉండి ప్రాంతాలలో పర్యటిస్తూ విజయమ్మ భీమవరం చేరుకున్నారు. అమలాపురం బండారులంక వీవర్స్ కాలనీలో పర్యటించారు. అక్కడ నీట మునిగిన మగ్గాలను ఆమె చూశారు. వైయస్ఆర్ సీపీ తరఫున దుస్తులను పంపిణీ చేశారు. భారీవర్షాలకు పంట నష్టపోయిన రైతులకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్ని విధాలా అండగా ఉంటుందని ఆ పార్టీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ హామీ ఇచ్చారు.
వైయస్ సీఎంగా ఉన్న సమయంలో గోదావరి డెల్టా ఆధునీకీకరణకు నిధులు మంజూరు చేశారని గుర్తు చేశారు. ఆయన బ్రతికి ఉండగా 20 శాతం పనులు పూర్తయ్యాయని, ఆ తర్వాత ఎక్కడి పనులు అక్కడే నిలిచిపోయాయన్నారు.
విజయమ్మ మంగళవారం ఉదయం పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో ముంపుకు గురైన పంట పొలాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రైతులకు న్యాయం జరిగేవరకూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాడుతుందన్నారు. పంట నష్టపోయిన రైతుకు ఎకరానికి కనీసం రూ.10 వేలు నష్టపరిహారం చెల్లించాలని విజయమ్మ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రైతులతో పాటు కౌలు రైతులకు నష్టపరిహారం ఇవ్వాలన్నారు.
రెండువేల కోట్లతో గోదావరి డెల్టాను ఆధునీకరణ చేయాలని వైఎస్ఆర్ భావించారని, మూడేళ్లుగా పనుల్లో పురోగతి లేదని విజయమ్మ అన్నారు. గోదావరిడెల్టా ఆధునీకరణ పూర్తి కాకపోవటం వల్లే ప్రజలకు కష్టాలు తప్పటం లేదన్నారు. వరద సహాయక చర్యల్లో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆమె విమర్శించారు. బాధితుల్ని ఆదుకోవల్సిన సిఎం ఢిల్లీ వెళ్లి కూర్చున్నారని విజయమ్మ విమర్శించారు. నాలుగు రోజులవుతున్నా ఏ మంత్రి కూడా వచ్చి పరామర్శించలేదని ఆమె నిందించారు. యనమదుర్రులో మోకాలు లోతు నీళ్లలో ఉన్న బాధితులను పరామర్శించినప్పుడు తమను పట్టించుకున్న నాథుడే లేకపోయాడని వారు వాపోయారు. పొయ్యి వెలింగించి రెండు రోజులౌతోందని వారు ఆవేదనగా చెప్పారు. పశ్చిమగోదావరి జిల్లా మోడీ, పేరుపాలెంలోనూ వరద బాధితులను విజయమ్మ పరామర్శించారు. ఎంఎల్ఏ ఆళ్ల నాని తదితరులు విజయమ్మ వెంట ఉన్నారు.
తూర్పు గోదావరి జిల్లా ఏలేరు ఆధునీకరణకు రాజశేఖర రెడ్డిగారు  రూ.152 కోట్లు కేటాయించారని, అయితే ఈ ప్రభుత్వం
మాత్రం నేటికీ పనులు చేపట్టలేదని విజయమ్మ విమర్శించారు. గొల్లప్రోలులో వరద బాధితులను ఆమె
పరామర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ చేనేత కార్మికులకు రూ. 312 కోట్ల రుణాన్ని మాఫీ చేయాలని వైయస్ ఆదేశించిన సంగతి ఆమె గుర్తు
చేశారు. ఆయన మరణం తర్వాత చేనేతల రుణమాఫీని ఈ ప్రభుత్వం
పట్టించుకోలేదన్నారు. జగన్ సీఎం అయితే చేనేత కార్మికుల కష్టాలన్నీ
తొలగిపోతాయని చెప్పారు. గొల్లప్రోలు ముంపుకు గురికాకుండా శాశ్వతపరిష్కారం
చేస్తామని ఆమె హామీ ఇచ్చారు.  షెడ్యూలు ప్రకారం ఆమె సోమవారమే తూర్పు గోదావరి జిల్లాకు రావాల్సి ఉండగా, పశ్చిమగోదావరి జిల్లాలో బాధితులు అడుగడుగునా ఆపి తమ గోడు చెప్పుకోవడంతో పర్యటనలో జాప్యం చోటు చేసుకుంది.

Back to Top