అపోలో ఆస్పత్రిలో చేరిన షర్మిల

హైదరాబాద్‌, 17 డిసెంబర్‌ 2012: మోకాలి గాయంతో బాధ పడుతున్న శ్రీమతి షర్మిల జూబ్లీహిల్సు అపోలో ఆస్పత్రిలో చేరారు. మరో ప్రజాప్రస్థానం పాదయాత్రలో భాగంగా మూడు రోజుల క్రితం రంగారెడ్డి జిల్లా బిఎన్‌ రెడ్డి నగర్‌ సభలో ప్రసంగించి వేదిక నుంచి కిందికి దిగుతుండగా శ్రీమతి షర్మిల కుడి మోకాలికి గాయం అయింది. ఆ గాయం తీవ్రం కావడంతో శ్రీమతి షర్మిల మోకాకి కీ హోల్‌ ఆపరేషన్‌ చేయాలని ప్రముఖ వైద్యుడు డాక్టర్‌ సోమశేఖర్‌రెడ్డి సోమవారం సలహా ఇచ్చారు. ఆపరేషన్‌ తరువాత ఆమె కనీసం మూడు వారాలు విశ్రాంతి తీసుకోవాల్సి ఉంటుందని ఆయన సూచించారు. శ్రీమతి షర్మిల మోకాలికి తగిలిన గాయం తీవ్రమైనదని ఎంఆర్‌ఐ స్కాన్‌లో తెలిసిందని చెప్పారు. అందుకే ఆపరేషన్‌ చేయాల్సిన ఆవశ్యకత ఏర్పడిందని ఆయన వివరించారు.

శ్రీమతి షర్మిల మోకాలికి ఆపరేషన్‌ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని డాక్టర్‌ సోమశేఖర్‌రెడ్డి తెలిపారు. శ్రీమతి షర్మిల మోకాలిలో రెండు రకాల గాయాలున్నట్లు ఎంఆర్‌ఐ స్కాన్‌లో వెల్లడైందని ఆయన వెల్లడించారు. ఆపరేషన్‌ తరువాత ఆమె కాలికి సిమెంట్‌ కట్టు వేయాల్సి ఉంటుందని చెప్పారు. మూడు వారాల అనంతరం ఆ సిమెంట్‌ కట్టును తొలగిస్తామని వివరించారు. ఆ తరువాత పరీక్షించి పరిస్థితిని అంచనా వేస్తామని అన్నారు.

ప్రజల కష్టాలు పట్టించుకోకుండా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్న కాంగ్రెస్‌ ప్రభుత్వం, దానితో క్విడ్‌ ప్రొ కో చేసుకున్న టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడి తీరుకు నిరసనగా వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత శ్రీ వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి తరఫున ఆయన సోదరి శ్రీమతి షర్మిల మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర చేస్తున్నారు. ప్రస్తుతం శ్రీమతి షర్మిల పాదయాత్ర రంగారెడ్డి జిల్లాలో కొనసాగుతోంది. అయితే, గత శుక్రవారంనాడు బిఎన్‌ రెడ్డి నగర్‌ వద్ద అభిమానులను, పార్టీ శ్రేణులు, స్థానికులను ఉద్దేశించి ప్రసంగించి, వేదిక దిగుతుండగా శ్రీమతి షర్మిల కుడి మోకాలికి గాయం అయింది. దీనితో శనివారం నుంచి పాదయాత్రకు విరామం ఇచ్చారు. అక్టోబర్‌ 18న వైయస్‌ఆర్‌ జిల్లా ఇడుపులపాయలోని మహానేత డాక్టర్‌ వైయస్‌ ఆర్‌ ఘాట్‌ నుంచి శ్రీమతి షర్మిల మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర ప్రారంభించారు. అక్కడి నుంచి ఆమె వైయస్‌ఆర్‌ జిల్లా, అనంతపురం, కర్నూలు, మహబూబ్‌నగర్‌లో పాదయాత్ర పూర్తిచేసి రంగారెడ్డి జిల్లాలో కొనసాగిస్తున్నారు. పాదయాత్రకు బ్రేక్‌ పడే సమయానికి శ్రీమతి షర్మిల మొత్తం 24 నియోజకవర్గాల్లో 57 రోజుల పాదయాత్రలో 822 కిలోమీటర్లు నడిచారు.

గాయం తగిలినప్పటికీ శ్రీమతి షర్మిల నొప్పిని భరిస్తూనే మరో నాలుగు కిలోమీటర్లు నడిచారని, ఆ కారణంగా ఆమె గాయం మరింత ఎక్కువై ఉంటుందని రంగారెడ్డి జిల్లా కన్వీనర్‌ జనార్ధన్‌రెడ్డి అన్నారు. శ్రీమతి షర్మిల గాయం నుంచి త్వరగా కోలుకోవాలని పార్టీ నాయకులు, అభిమానులు, పార్టీ శ్రేణులు ఆకాంక్షిస్తున్నారు.
Back to Top