రాజ్యాంగాన్ని కాలరాస్తున్న ఏపీ సర్కార్‌

  • వైయస్‌ఆర్‌సీపీ కార్యాలయంలో రాజ్యాంగ ఆమోద దినోత్సవం
  • అంబేడ్కర్‌ చిత్రపటానికి వైయస్‌ఆర్‌సీపీ నేతల నివాళి
  • రాజ్యాంగ విలువలకు తిలోదకాలు ఇస్తున్న అధికార పార్టీ
  • ఫిరాయింపులతో రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తున్న చంద్రబాబు
  • బాబు తీరుపై వైయస్సార్సీపీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు మేరుగు నాగార్జున ఫైర్
హెదరాబాద్‌: ఆంధ్ర ప్రదేశ్‌ ప్రభుత్వం భారత రాజ్యాంగాన్ని కాలరాస్తుందని వైయస్‌ఆర్‌సీపీ ఎస్సీ విభాగం అధ్యక్షులు మేరుగు నాగార్జున మండిపడ్డారు. హైదరాబాద్‌లోని వైయస్‌ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో శనివారం రాజ్యాంగ ఆమోద దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ చిత్రపటానికి వైయస్‌ఆర్‌సీపీ సీనియర్‌ నేతలు బొత్స సత్యనారాయణ, భూమన కరుణాకర్‌రెడ్డి, మేరుగు నాగార్జున, తదితరులు పూలమాల వేసి నివాళులర్పించారు. మేరుగు నాగార్జున మాట్లాడుతూ.. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తరువాత రాజ్యంగం అవసరమని భావించారన్నారు. దేశ భవిష్యత్తు, సమాజంలో ఉన్న అన్ని వర్గాలు, కులాలు, మతాలు, ప్రాంతాలు సమానంగా ఉండేవిధంగా, పరిపాలన రాజ్యాంగానికి లోబడి నడుచుకునే విధంగా, రాజ్యంగ విలువలు పరిరక్షించించి, దేశం కకావికలం కాకుండా కాపాడేందుకు నాడు అంబేడ్కర్‌ రాజ్యాంగాన్ని రచించారని తెలిపారు. అయితే దేశంలో రాజ్యాంగ విలువలకు అధికార పార్టీలు తిలోదకాలు ఇస్తున్నాయిని మండిపడ్డారు. 

ప్రధానంగా ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలో ఉన్న టీడీపీ ప్రభుత్వం రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తుందని మేరుగ నాగార్జున ధ్వజమెత్తారు. రాజ్యాంగానికి లోబడి ఎన్నికల్లో గెలిచిన శాసన సభ్యులను అధికార పార్టీ నేతలు ప్రలోభాలకు గురి చేసి చేర్చుకుంటున్నారని, అలాంటి వారిపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్నికల్లో ఓడిపోయిన శాసన సభ్యులకు ప్రత్యేక జీవోలు విడుదల చేసి అభివృద్ధి నిధులు కేటాయిస్తూ ప్రజాధనాన్ని దోచుకుంటున్నారని విమర్శించారు. గెలిచిన ఎమ్మెల్యేలు, జెడ్పీటీసీలను ప్రభుత్వం పట్టించుకునే పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రే స్వయంగా కులాలను ప్రస్తావిస్తూ..‘‘దళిత కులంలో ఎవరైనా పుడతారా’’ అంటూ ఎద్దేవా చేశారన్నారు. మురికివాడల్లో పుడితే మురికి ఆలోచనలు వస్తాయన్న బాబు పరిస్థితి చూస్తే ఈ రాష్ట్రంలో రాజ్యాంగం అపహాస్యమవుతుందనిపిస్తోందన్నారు.

 ప్రత్యేకంగా ఏ సామాజిక వర్గం కోసం అంబేద్కర్‌ రాజ్యాంగాన్ని రాశారో వాటికున్న చట్టాలను కూడా బాబు నీరుగార్చుతున్నారని తెలిపారు. ప్రభుత్వాలు ఆ చట్టాలను చుట్టాలుగా మార్చుకుంటున్నాయని ధ్వజమెత్తారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసును స్వయాన సీఎం నీరు గారుస్తూ.... ఏపీలో  రాజ్యాంగాన్ని కాలరాస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజ్యాంగాన్ని రక్షించుకోవాల్సిన అవసరం ఉందని మేరుగు నాగార్జున అన్నారు. నాడు దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి రాజ్యాంగ విలువలు కాపాడుతూ ముందుకు తీసుకెళ్లారని గుర్తు చేశారు. రాజ్యాంగానికి లోబడి పాలన సాగితేనే రాష్ట్రానికి భవిష్యత్‌ ఉంటుందని, ఆ కోణంలో పయనించాలని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నిరంతరం రాజ్యాంగానికి లోబడి, రాజ్యాంగ విలువలు కాపాడుతుందని చెప్పారు. వైయస్‌ఆర్‌సీపీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి ఎల్లవేళల రాజ్యాంగాన్ని పరిరక్షించడమే ధ్యేయంగా ముందుకు వెళ్తున్నారని మేరుగ పేర్కొన్నారు.

గుంటూరులో..
రాజ్యాంగ ఆమోద దినోత్సవాన్ని గుంటూరు నగరంలోని పార్టీ కార్యాలయంలో ఎస్సీ సెల్‌ జిల్లా అధ్యక్షుడు బండారు సాయిబాబా ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా అంబేడ్కర్‌ చిత్రపటానికి పలువురు నేతలు పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో వైయస్‌ఆర్‌సీపీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు డైమాండ్‌ బాబు, జెడ్పీటీసీ కోటేశ్వరరావు, సేవాదళ్‌ అధ్యక్షులు సయ్యద్‌మాబు, ఎంపీటీసీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.


 
Back to Top