ఏపీని మద్యాంధ్రప్రదేశ్ గా మార్చిన బాబు

  • ఎన్నికల హామీలను మరగునపడేసి, దోపిడీకి కొత్త మార్గాలు
  • దిక్కుదివాన లేని గందరగోళ ప్రభుత్వం
  • అధికారంలోకి వచ్చాక చేసిన ఐదు సంతకాలకు వెన్నుపోటు
  • విచ్చలవిడిగా బెల్టుషాపులను విస్తరిస్తున్న ప్రభుత్వం
  • బాబుపై వైయస్సార్సీపీ అధికార ప్రతినిధి పార్థసారధి ధ్వజం
హైదరాబాద్ః చంద్రబాబు ఏపీని మద్యాంధ్రప్రదేశ్ గా మార్చాడని  వైయస్సార్సీపీ అధికార ప్రతినిధి పార్థసారధి మండిపడ్డారు.  2019లో అధికారంలోకి రాలేమన్న నమ్మకంతో... తన కుటుంబసభ్యులు, అనుయాయులు, పార్టీ నేతలకు రాష్ట్ర ఆదాయ వనరులను అప్పజెప్పాలన్న కుతంత్రపు ఆలోచనలతో చంద్రబాబు పనిచేస్తున్నారని పార్థసారధి ధ్వజమెత్తారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను పూర్తిగా మరగునపడేసి, దోపిడీకి కొత్త మార్గాలను అన్వేషిస్తున్నారంటూ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. సాగు, తాగునీటి సమస్యలను పట్టించుకోకుండా మద్యం బార్లు, షాపులను తన వాళ్లకు ఏవిధంగా కట్టబెట్టాలా అని బాబు ఆలోచన చేయడం దుర్మార్గమన్నారు.  బెల్టుషాపులు పూర్తిగా నిర్మూలిస్తానని మొదటి సంతకం చేసిన చంద్రబాబు, దాన్ని గాలికొదిలేశారని పార్థసారధి ఫైర్ అయ్యారు. అధికారంలోకి వచ్చాక పార్టీ క్యాడర్ ని ఏర్పాటు చేసి మరీ బెల్టుషాపులు అప్పగించడం సిగ్గుచేటన్నారు. హైదరాబాద్ లో పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో పార్థసారధి మాట్లాడుతూ...చంద్రబాబు ప్రభుత్వం దిక్కుదివానా లేని గందరగోళ ప్రభుత్వమని దుయ్యబట్టారు. 

ఎన్టీఆర్ సుజల స్రవంతి పేరు మీద రూ.2 లకే  మినరల్ వాటర్ ఇస్తామన్న చంద్రబాబు...ఆయన పెట్టిన సంతకానికి విలువుందని ఆయనైనా భావిస్తే, అది ఎంతమందికిచ్చారో సమాధానం చెప్పాలన్నారు. ముఖ్యమంత్రిగానీ, మంత్రులు గానీ సీజనల్ సమస్యలపై ఏనాడు చర్చించిన పాపాన పోలేదని దుయ్యబట్టారు. ఖరీఫ్ ప్రారంభమైనా ఇంతవరకు ప్రభుత్వం రైతులు, పంటల గురించి ఆలోచన చేయకపోవడం బాధాకరమన్నారు.2030 వరకు రాష్ట్రంలో మద్యం కొరత లేకుండా డిస్టలరీలకు లైసెన్స్ లిచ్చి ముడుపులు పుచ్చుకునే కార్యక్రమం మాత్రం బాగా చేస్తున్నారని విమర్శించారు.  హైవేల పక్కన ఉన్న వైన్ షాపులుడడం వల్ల ప్రమాదాలు జరుగుతుండడంతో, రహదారులకు 220 మీటర్ల దూరంలో ఉండాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసిందన్నారు. కానీ, చంద్రబాబు తన అవసరం, ముడుపుల కోసం చట్టాన్ని, రాజ్యాంగాన్ని, సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ను కూడ ధిక్కరిస్తున్నాడని మండిపడ్డారు. 

చంద్రబాబు అధికారంలోకి వచ్చాక చేసిన ఐదు సంతకాలకు వెన్నుపోటు పొడిచాడని పార్థసారధి ధ్వజమెత్తారు. రైతులకు బ్యాంకు రుణాలు, విత్తనాలకు సంబంధించి ప్రభుత్వం రివ్యూలు చేపట్టకపోవడం  బాధాకరమన్నారు. అగ్రికల్చర్ మినిస్టర్ గా పనిచేసిన మూడేళ్ల తర్వాత గుంటూరులో నకిలీ విత్తనాలున్నాయని మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు చెప్పడం శోచనీయమన్నారు. మీ శాఖ మారిందనే అలా చెబుతున్నారా పుల్లారావు..? అని ప్రశ్నించారు. ఆయన సొంత మనుషులే నకిలీ విత్తనాల మోసాలకు పాల్పడినా, వారిపై ఎక్కడా చర్యలు తీసుకున్న దాఖలాలు లేవన్నారు.  మళ్లీ అధికారం రాదన్న ధీమాతో చంద్రబాబు ప్రభుత్వ, ప్రైవేటు భూములను తనవాళ్లకు ఇష్టమొచ్చినట్టుగా దోచిపెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మీ అరచకాలు, దోపిడీని కట్టిబెట్టి రైతు, ప్రజాసమస్యలపై దృష్టిసారించాలని పార్థసారధి ప్రభుత్వానికి హితవు పలికారు. 

Back to Top