అగ్నిగుండంలా మారిన ఆంధ్రప్రదేశ్

న్యూఢిల్లీ, 27 ఆగస్టు 2013: స్పష్టమైన నిర్ణయం జరగక ముందు ఆంధ్రప్రదేశ్‌ అగ్నిగుండంలా మారిందని వైయస్‌ఆర్ కాంగ్రె‌స్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు‌ శ్రీమతి వైయస్ విజయమ్మ ‌ఆవేదన వ్యక్తంచేశారు. శ్రీమతి విజయమ్మ నేతృత్వంలో పార్టీ ప్రతినిధుల బృందం మంగళవారంనాడు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలిసింది. అనంతరం శ్రీమతి విజయమ్మ విజయ్‌చౌక్‌లో ‌మీడియాతో మాట్లాడారు.‌ కాంగ్రెస్‌ పార్టీ అడ్డగోలుగా తీసుకున్న రాష్ట్ర విభజన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ వైయస్‌ఆర్ కాంగ్రె‌స్ పార్టీ ఈ సందర్భంగా రాష్ట్రపతికి ఫిర్యాదు చేసింది. సిడబ్ల్యుసి నిర్ణయం వల్లే రాష్ట్రంలో ప్రస్తుత దుస్థితి తలెత్తిందని శ్రీమతి విజయమ్మ ఆరోపించారు. రాష్ట్రాన్ని విభజించే సమయంలో కాంగ్రెస్ పార్టీ సమన్యాయం పాటించలేదన్నారు. ఇలా సమన్యాయం చేయనప్పుడు రాష్ట్రాన్ని ముక్కలు చేసే అధికారం ఆ పార్టీకి ఎవరు ఇచ్చారని ‌ఆమె ప్రశ్నించారు. ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని శ్రీమతి విజయమ్మ రాష్ట్రపతిని కోరారు.

సిడబ్ల్యుసి గాని, యుపిఎ గాని నిర్ణయమే ప్రభుత్వ నిర్ణయంగా వస్తుందంటున్న ఈ తరుణంలో తమ పార్టీ బృందం చాలా ఆందోళనగా ఢిల్లీ వచ్చి ప్రధాని, రాష్ట్రపతిని కలుసుకున్నామని శ్రీమతి విజయమ్మ తెలిపారు. ఈ నిర్ణయం అన్యాయం అని కొన్ని కొట్ల మంది ప్రజలు రోడ్ల మీదికి వచ్చి నిరసన తెలుపుతున్నారని ఆమె అన్నారు. రాష్ట్ర సచివాలయం, ఎల్ఐసి ఆఫీసులో, విద్యుత్‌ సౌధలో, నీటిపారుదల శాఖ లాంటి ప్రభుత్వ కార్యాలయాలలో భయానక వాతావరణం నెలకొన్నదన్నారు. ఇప్పటి వరకూ అన్నదమ్ముల్లా కలిసి మెలిసి విధులు నిర్వర్తించిన తెలుగువారు రెండుగా చీలిపోయి వేర్వేరుగా ఆందోళనలు చేసే దుస్థితి దాపురించిందని ఆవేదన వ్యక్తం చేశారు. వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్‌ జగన్మోహన్‌రెడ్డికి భయపడే రాష్ట్రాన్ని ముక్కలు చేయాలని చూస్తున్నారని శ్రీమతి విజయమ్మ ఆరోపించారు.

దివంగత మహానేత డాక్టర్‌ వైయస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో కాంగ్రెస్‌ పార్టీ 2004, 2009 సంవత్సరాల్లో అధికారంలోకి వచ్చిందన్నారు. 2009లో 33 మంది కాంగ్రెస్‌ ఎంపిలను గెలిపించి పంపించిన ఆంధ్రప్రదేశ్‌ను ముక్కలు చేస్తారా అని బాధ కలిగించిందని విజయమ్మ అన్నారు. తెలుగు ప్రజల మధ్య కాంగ్రెస్‌ పార్టీ విద్వేషాలు నింపిందని దుయ్యబట్టారు. రాష్ట్ర విభజన నిర్ణయం ఇంకా పూర్తి కాక ముందే ఇరు ప్రాంతాల ప్రజుల కొట్లాడుకునే పరిస్థితి వచ్చిందని విచారం వ్యక్తంచేశారు. రాష్ట్ర విభజన ఏ ప్రాతిపదికన చేశారని శ్రీమతి విజయమ్మ నిలదీశారు.

గతంలో ఆంధ్రప్రదేశ్, కర్నాటక, కేరళ, తమిళనాడు నాలుగు భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడ్డాయని శ్రీమతి విజయమ్మ గుర్తుచేశారు. ఇప్పుడు ఒక్క ఆంధ్రప్రదేశ్‌ను మాత్రమే ఎందుకు విడగొట్టాలనుకుంటున్నారో అర్థం కాని పరిస్థితి అన్నారు. ఆంధ్రప్రదేశ్‌ సమస్యలపై వేసిన ఆంటోని కమిటీలో రాష్ట్రానికి ప్రాతినిధ్య లేని విషయాన్ని ఆమె ప్రస్తావించారు. ఆంధ్రప్రదేశ్‌ భావాలు చెప్పేందుకు ఆ కమిటీలో ఒక్కరు కూడా లేకపోవడం దారుణం అని, సోనియాగాంధీకి రాష్ట్ర ప్రజల మనోభావాలు ఎలా తెలుస్తాయని అన్నారు. ఒక్క‌ శ్రీ జగన్ కోసమే చరిత్రను మార్చేస్తున్నారని విచారం వ్యక్తంచేశారు.

ఏ ఒక్కరికీ అన్యాయం జరగకుండా, ఏ ప్రాంత ప్రజల మనోభావాలు దెబ్బతినకుండా, ఒకవేళ విభజనే అనివార్యమైతే ఒక తండ్రిలా న్యాయంగా చేయాలని తమ పార్టీ ముందు నుంచీ చెబుతోందని శ్రీమతి విజయమ్మ తెలిపారు. అడ్డగోలు విభజన నిర్ణయం జూలై 30న వస్తే అంతకు ఐదు రోజుల ముందుగానే వైయస్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ ‌ఎమ్మెల్యేలు రాజీనామా చేసిన వైనాన్ని ఆమె ప్రస్తావించారు. ఎన్ని నిరసనలు జరుగుతున్నా కేంద్రం పట్టించుకోకపోవడంతో తాను, శ్రీ జగన్మోహన్‌రెడ్డి కూడా రాజీనామాలు చేశామన్నారు.

తెలంగాణ ప్రక్రియ ఆపే ప్రసక్తే లేదని చెబుతున్న దిగ్విజయ్‌ సింగ్.. ఆంటోని కమిటీకి చెప్పుకోమని ఏ విధంగా చెబుతారని శ్రీమతి విజయమ్మ నిలదీశారు. ఈ పరిస్థితుల్లో తాము ప్రధానిని, రాష్ట్రపతిని కలిసి ప్రజెంటేషన్‌ ఇచ్చామన్నారు. సమన్యాయం చేయలేకపోతే రాష్ట్రాన్ని యధాతథంగా ఉంచాలని, న్యాయం చేయకపోతే విభజించే హక్కును కాంగ్రెస్‌ పార్టీ తన చేతుల్లోకి ఎలా తీసుకుంటుందన్నారు.

రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజిస్తే కుప్పం నుంచి శ్రీకాకుళం వరకూ మంచినీరు ఎక్కడ ఉందని ప్రశ్నించారు. రాష్ట్ర కలిసి ఉన్నప్పుడే కర్నాటలోని ఆల్మట్టి, నారాయణపూర్‌ ప్రాజెక్టులు నిండి పొంగి పొర్లితేనే గాని కృష్ణా నది నీళ్ళు కిందికి రాని పరిస్థితి ఉందన్నారు. ఈ పరిస్థితుల్లో మధ్యలో మరో రాష్ట్రం వస్తే నాగార్జునసాగర్, శ్రీశైలం ప్రాజెక్టులకు నీళ్ళు ఎక్కడి నుంచి తెస్తారని ప్రశ్నించారు. పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇస్తామంటున్నారని, దానికి నీళ్ళ ఎక్కడి నుంచి తీసుకువస్తారని నిలదీశారు. కృష్ణా డెల్టాను ఒక వైపున ఉంచితే తప్ప న్యాయం జరగదన్నారు. మిగులు జలాలు ఆధారంగా ఏర్పాటు చేసిన తెలంగాణలోని నెట్టెంపాడు, కల్వకుర్తి, ఎస్ఎల్‌బిసి గాని, సీమాంధ్రలోని హంద్రీ నీవా, తెలుగుగంగ, గాలేరు నగరి, వెలుగొండ ప్రాజెక్టులకు నీళ్ళు ఏ విధంగా చూపిస్తారని ప్రశ్నించారు.

దివంగత మహానేత డాక్టర్‌ వైయస్‌ రాజశేఖరరెడ్డి మూడు ప్రాంతాల్లోనూ జలయజ్ఞాన్ని సమానంగా తీసుకున్నారని శ్రీమతి విజయమ్మ తెలిపారు. ఆయన సంక్షేమ పథకాల ద్వారా అన్ని ప్రాంతాల్లోని ప్రతి ఒక్కరూ లబ్ధి పొందారన్నారు. ప్రాణహిత - చేవెళ్ళ పూర్తయితే తప్ప తెలంగాణ ప్రాంతానికి న్యాయం జరగబోదన్నారు. సీమాంధ్ర నుంచి 80, 90 శాతం పెట్టుబడులు హైదరాబాద్‌లోనే పెట్టారని గుర్తుచేశారు. రాష్ట్రంలోని ఏ మారు మూల పల్లె నుంచి అయినా‌ యువత ఉపాధి కోసం హైదరాబాద్ నగరానికే వస్తున్నారన్నారు. రాష్ట్ర ఆదాయంలో 45 నుంచి 50 శాతం హైదరాబాద్‌ నుంచే వస్తుందన్నారు. హైదరాబాద్‌ను ఒక ప్రాంతానికే అప్పజెపితే ఏమి సమంజసం అని రాష్ట్రపతికి చెప్పామన్నారు. ఆదాయం అంతా ఒక ప్రాంతానికే పోతే సంక్షేమ పథకాలను మిగతా ప్రాంతంలో ఎలా అమలు చేయగలరని ప్రశ్నించారు.‌ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీకి పార్టీ ప్రతినిధి బృందం వినతిపత్రాన్ని సమర్పించింది.

తాజా వీడియోలు

Back to Top