రాజన్న పథకాలకు జగనన్న జీవం పోస్తారు

‌జగ్గయ్యపేట (కృష్ణాజిల్లా), 20 ఏప్రిల్‌ 2013: రాజన్న రాజ్యంలో జగనన్న ముఖ్యమంత్రి అయ్యాక మహానేత డాక్టర్ వై‌యస్‌ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన ప్రతి సంక్షేమ పథకానికి జీవం పోస్తారని‌ వైయస్‌ఆర్ కాంగ్రె‌స్ పార్టీ అ‌ధినేత శ్రీ వైయస్ జగ‌న్మోహన్‌రెడ్డి సోదరి శ్రీమతి షర్మిల ప్రజలకు భరోసా ఇచ్చారు. ప్రజా సమస్య‌లను పట్టించుకోని కాంగ్రెస్ ప్రభుత్వం వైఖరికి, దాని కొమ్ముకాస్తున్న చంద్రబాబు నాయుడు వైఖరికి నిరసనగా శ్రీమతి షర్మిల చేపట్టిన మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర శుక్రవారం కృష్ణా జిల్లా జగ్గయ్యపేట నియోజకవర్గంలో కొనసాగింది. పెనుగంచిప్రోలు మండలం గుమ్మడిదుర్రులో మహానేత వైయస్‌ఆర్ విగ్రహాన్ని‌ శ్రీమతి షర్మిల ఆవిష్కరించారు. అదే వేదిక మీద నుంచి కొద్దిసేపు మాట్లాడారు. అంతకు ముందు మరో ప్రజాప్రస్థానం పాదయాత్రలో తనతో పాటు కదం తొక్కిన మహిళలతో ఆమె మాట్లాడారు.

వైఎస్సార్ రెక్కల కష్టం మీద అధికారంలోకి వచ్చిన ఈ ప్రభుత్వం ఆయన ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను తుంగలో తొక్కిందని ఆవేదన వ్యక్తంచేశారు. కిరణ్‌ కుమార్‌ రెడ్డి ప్రభుత్వం పక్కా ఇళ్ల పథకాన్ని పాడెక్కించిందని దుయ్యబట్టారు. ఆరోగ్యశ్రీ కార్డును చెత్తబుట్టలో వేయాలని ఆసుపత్రి యాజమాన్యాలు అంటున్నాయని నిన్న ఓ తాత బాధపడ్డాడన్నారు. మరోవైపు ఈ ముఖ్యమంత్రి ఏమో వడ్డీ లేని రుణాలు ఇస్తున్నామంటూ కోట్లు ఖర్చుచేసి గొప్పగా ప్రచారం చేసుకుంటున్నారు. కానీ పల్లెల్లో ఏ మహిళను అడిగినా రుణాలే అందటం లేదని చెబుతున్నారు. ఈ ముఖ్యమంత్రి వడ్డీలేని రుణాలు ఎవరికి ఇస్తున్నట్టు..? అమ్మా... అక్కా.. సమయం వచ్చినప్పుడు ఈ కాంగ్రెస్, ‌టిడిపిలకు బుద్ధి చెప్పి జగనన్నను ఆశీర్వదించిన రోజున రాజన్న రాజ్యం మళ్లీ వస్తుందన్నారు.

ధరల స్థిరీకరణ కోసం రూ. 3 వేల కోట్లతో నిధి :
జగనన్న ముఖ్యమంత్రి అయ్యాక రైతులు, మహిళలకు వడ్డీ లేని రుణాలిస్తారని శ్రీమతి షర్మిల తెలిపారు. పంటకు మద్దతు ధర లభించేటట్టు, అవసరమైతే ప్రభుత్వమే పంట కొనుగోలు చేసేలా రూ.3 వేల కోట్లతో ఒక స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేస్తారని చెప్పారు. ప్రతి రైతు అప్పుల ఊబిలోంచి బయటికి వచ్చి బాగుపడేటట్టు చేస్తారన్నారు. విద్యార్థుల కోసం మళ్లీ ఫీజు రీయింబర్సుమెంట్, పేదల కోసం ఆరోగ్యశ్రీ నిలబెడతా‌రని హామీ ఇచ్చారు. వృద్ధులకు రూ.700 పింఛన్ అందుతుం‌దన్నారు. వికలాంగుల పింఛన్ రూ.1,000 అవుతుందని తెలిపారు.

అక్కాచెల్లెళ్ళ తమ పిల్లలను చదివించేలా ప్రోత్సహించేందుకు ఇద్దరు పిల్లలకు పదో తరగతి వరకు నెలనెలా ఒక్కొక్కరికి రూ.500 చొప్పున అమ్మ అకౌంట్లోనే డబ్బులు జమచేస్తారని భరోసా ఇచ్చారు. ఇంటర్ చదివితే రూ.700, డిగ్రీ చదివితే రూ.1,000 అమ్మ ఖాతాలోనే ‌వేస్తారన్నారు. అంతకంటే పెద్ద చదువులు చదివే వారికి ఫీజు రీయింబర్సుమెంట్ పథకం ఎలాగూ ఉండనే ఉం‌దన్నారు. రాష్ట్రంలో గుడిసెలు లేకుండా ప్రతి నిరుపేదకు పక్కా ఇల్లు కట్టిస్తారన్నారు. పేదలు కూడా మళ్లీ ధీమాగా కార్పొరేట్‌ ఆసుపత్రులకు వెళ్లి ఆరోగ్యశ్రీ పథకం కింద వైద్యం చేయించుకునే రోజులు వస్తాయన్నారు. మహానేత వైయస్‌ఆర్‌ హామీ ఇచ్చినట్టు ప్రతి పేద కుటుంబానికి నెలకు 30 కిలోల బియ్యం ఇస్తారు. ఆ రోజు వచ్చేంత వరకు మీరందరూ జగనన్నను ఆశీర్వదించాలని, వైయస్‌ఆర్‌ కాంగ్రెస్ పార్టీని బలపరచాలని శ్రీమతి షర్మిల విజ్ఞప్తి చేశారు.

కాగా, శనివారం 125వ రోజు మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర కృష్ణా జిల్లా జగ్గయ్యపేట నియోజకవర్గం జొన్నలగడ్డ నుంచి ప్రారంభమైంది. అక్కడి నుంచి గుమ్మడిదుర్రు మీదుగా అనిగండ్లపాడు శివారు వరకు పాదయాత్ర కొనసాగింది. జొన్నలగడ్డలో శ్రీమతి షర్మిలను వైయస్‌ఆర్ కాంగ్రె‌స్‌ పార్టీ గౌరవ అధ్యక్షురాలు శ్రీమతి వైయస్ విజయమ్మ కలిశారు. రాత్రి 7.30 గంటలకు అనిగండ్లపాడు శివారులో ఏర్పాటు చేసిన బస కేంద్రానికి‌ శ్రీమతి షర్మిల చేరుకున్నారు.

శ్రీరామ నవమి పర్వదినాన్ని పురస్కరించుకుని పార్టీ కార్యకర్తలు, అభిమానుల కోరిక మేరకు ఉదయం పాదయాత్రను రద్దు చేసినట్లు పార్టీ కార్యక్రమాల కో ఆర్డినేటర్ తలశిల రఘురాం తెలిపారు. మధ్యాహ్నం నుంచి యాత్ర ప్రారంభమైంది. శుక్రవారం మొత్తం 8.6 కిలోమీటర్లు నడిచారు. ఇప్పటివరకు మొత్తం 1688.6 కి‌లోమీటరల్ యాత్ర పూర్తయింది.
Back to Top