సురేఖ నోట కాంగ్రెస్, టిడిపి మాట: అంబటి

గుంటూరు, 30 జూలై 2013:

టిడిపి, కాంగ్రెస్‌ నాయకుల మాట కొండా సురేఖ నోట నుంచి రావడం తమను బాధించిందని వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు వ్యాఖ్యానించారు. తెలంగాణ మీద వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ సరైన విధానం తీసుకోలేదనో లేదా తీసుకున్న విధానాన్ని వెనక్కి తీసుకున్నారనో కొండా సురేఖ తాను పార్టీ నుంచి బయటికి వెళ్ళిపోవడానికి ప్రధాన కారణమని ప్రకటించారన్నారు. లక్ష కోట్ల సంపాదించడమే శ్రీ జగన్మోహన్‌రెడ్డి ధ్యేయం అనే మాట కొండా సురేఖ మాట కాదన్నారు. అది చంద్రబాబు మాట, అది సోనియాగాంధీ మాట అన్నారు. చంద్రబాబు, సోనియాగాంధీ మాట కొండా సురేఖ నోటి వెంట రావడం చాలా బాధాకరం అన్నారు. అంతే కాకుండా ఆమె కొన్ని వ్యక్తిగతమైన విషయాలు కూడా మాట్లాడారని అంబటి గుర్తుచేశారు. గుంటూరులోని పార్టీ కార్యాలయంలో మంగళవారం మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు ఆయన ఇలా బదులిచ్చారు.

కొండా సురేఖ అంటే తమకు అమితమైన గౌరవం అని అంబటి రాంబాబు అన్నారు. వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ ఆవిర్భావం నుంచీ పార్టీలో ఉన్న మహిళా నాయకురాలు ఆమె అన్నారు. కానీ నిన్న ఆమె మాట్లాడిన మాటలు చాలా బాధ కలిగించాయన్నారు. రాజకీయాలంటేనే సుదీర్ఘమైన ప్రయాణం అన్నారు. ఒక్కరోజుతో అయిపోయేది కాదన్నారు. శ్రీ జగన్మోహన్‌రెడ్డి జైలులో ఉన్నారని, శ్రీమతి విజయమ్మ, శ్రీమతి షర్మిల బయట తిరుగుతున్న సమయంలో సురేఖ కూడా వారితో కలిసి పార్టీ అభివృద్ధికి కృషి చేయాలని కోరుకుంటాం తప్ప బయటికి వెళ్ళాలని ఎలా అనుకుంటాం అన్నారు.

తెలంగాణకు అన్యాయం జరుగుతుందని మాత్రమే కొండా దంపతులు పార్టీ నుంచి బయటికి వెళ్ళి ఉంటే.. కొంత మేరకు బాగానే ఉందనుకోవచ్చని అంబటి వ్యాఖ్యానించారు. కానీ చాలా ఘోరంగా కాంగ్రెస్, టిడిపి వాయిస్‌ వారి నోటి వెంట వినిపించడం బాధ కలిగించిందన్నారు. అయినా ఆమె మీద తమకు అమితమైన గౌరవం ఉంది కనుక ఏ విధమైన వ్యాఖ్యలూ చేయడానికి తాము సిద్ధంగా లేమన్నారు. ఇప్పటికైనా వాస్తవాలు తెలుసుకుని సక్రమంగా ఉంటే మంచిదని తాము భావిస్తున్నామన్నారు.

కొండా సురేఖ కొత్త వ్యాఖ్యలేవీ చేయలేదని ఒక మీడియా ప్రతినిధి ప్రశ్నకు అంబటి బదులిచ్చారు. ఇప్పుడు ఆమె చేసిన వ్యాఖ్యలనే ఇంతకు ముందు చంద్రబాబు చేశారని, కాంగ్రెస్‌ పార్టీ వాళ్ళు చేసినవే అన్నారు. ఆ వ్యాఖ్యలకు తాము ఇంతకు ముందే సమాధానం చెప్పామన్నారు. తెలంగాణ గురించి సురేఖ మాట్లాడి ఉంటే ఆమె తెలంగాణ గురించి బాధపడ్డారనుకునే వారమన్నారు. పార్టీ విధానాన్ని ఆమె సరిగా అర్థం చేసుకోలేకపోయారనుకునే వారమన్నారు. అయినా ఆమె అంటే గౌరవం ఉంది కాబట్టి స్పందించదలచుకోలేదన్నారు. సురేఖ ఇప్పుడు చేసిన వ్యాఖ్యలకు గతంలో ఆమే సమాధానాలు చెప్పిన సందర్భాన్ని అంబటి గుర్తుచేశారు. ఆమె చెప్పిన సమాధానాలనే ఒకసారి నెమరు వేసుకుంటే అర్థమవుతుందన్నారు.

కొండా సురేఖ మంత్రి పదవిని వదులుకున్నారని, ఎమ్మెల్యే పదవిని రాజీనామా చేసి పోటీ చేసి ఓటమి పాలయ్యారని, ఆమె భర్త మురళి శ్రీ జగన్మోహన్‌రెడ్డి వెంట నడుస్తున్నారు కాబట్టి ఎమ్మెల్సీ పదవి నుంచి తొలగించారన్నారు. కేవలం శ్రీ జగన్మోహన్‌రెడ్డి వెంట నడవడం వల్లనే కొండా దంపతులు మూడు ప్రధానమైన పదవులు కోల్పోయారని అంబటి అన్నారు. నష్టపోయిన మాట వాస్తవమని అంబటి ఒక మీడియా ప్రతినిధి ప్రశ్నకు బదులిచ్చారు. అయితే వెంటనే బేరీజు వేసుకుంటే లాభాలు వస్తాయా? అని ఆయన ప్రశ్నించారు. పార్టీ అధికారంలో లేదు.. వారికి సీటు తిరస్కరిస్తే కదా.. సమయం వచ్చినప్పుడు వారి తప్పకుండా ప్రత్యేకమైన గౌరవం ఇస్తామని ఇంతకు ముందే శ్రీ జగన్మోహన్‌రెడ్డి చెప్పినట్లుగా వారి నోటి వెంటే తాను విన్నానన్నారు.

ఇప్పుడు కొండా దంపతులు బయటికి వెళ్శిపోవడానికి అది సమస్య కాదని అంబటి వ్యాఖ్యానించారు. తెలంగాణ మీద వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ తన స్టాండ్‌ను మార్చుకున్నదనేగా ఆమె వెళ్ళిపోయారన్నారు. వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ కోసం వారు కష్టపడ్డారని, నష్టపోయారని అన్నారు. ఇందులో ఏ విధమైన సందేహమూ లేదన్నారు. అందుకే ఆమె మీద తాము దురుసుగా ఏ విధమైన వ్యాఖ్య చేయబోమన్నారు. ఆ విజ్ఞత తమకు ఉందన్నారు. పార్టీ నుంచి బయటికి వెళ్ళిపోతూ చేసిన వ్యాఖ్యలపై ఇతరుల మాదిరిగా తాము స్పందించబోమన్నారు. అంతే గాని సమాధానం చెప్పడ చేతకాక మాత్రం కాదన్నారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top