నోటికి ఎంత వస్తే అంత మాట్లాడితే ప్రజలు క్షమించరు

వైఎస్సార్ జిల్లాః  చంద్రబాబు కోసం నోరుపారేసుకోవద్దని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమర్ నాథ్ రెడ్డి జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డిపై మండిపడ్డారు.  వ్యక్తిగత స్వార్థంతో పార్టీలు మారి డాంభికాలు పలికితే అవి రివర్స్ అవుతాయని హెచ్చరించారు. దివంగత వైఎస్సార్ చలువతో రాజకీయాల్లో రాణించి, ఇప్పుడు అవకాశవాద రాజకీయాలు చేస్తున్న ఆదినారాయణరెడ్డిని  చూసి జనం అసహ్యించుకుంటున్నారని అమర్ నాథ్ రెడ్డి తెలిపారు. 

వైఎస్సార్ కుటుంబాన్ని విమర్శించే హక్కు ఆదినారాయణరెడ్డికి లేదని అమర్ నాథ్ రెడ్డి అన్నారు. వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహనరెడ్డిని వ్యక్తిగతంగా విమర్శించడం భావ్యం కాదని, జననేత కుటుంబానికి సంబంధించి మాట్లాడిన మాటలు మహిళలందరినీ కించ పరిచే విధంగా ఉన్నాయన్నారు. నీ స్వప్రయోజనం కోసం పార్టీ మారావనే సంగతి ప్రజలందరికీ తెలుసునన్నారు. నైతిక విలువలు లేకుండా దిగజారుడు రాజకీయాలు చేయడం తగదన్నారు. నోటికి ఎంతవస్తే అంత మాట్లాడితే అవి చంద్రబాబుకు నచ్చుతాయేమో కానీ.. ప్రజలు వాటిని క్షమించరనే విషయాన్ని గుర్తుంచుకుంటే మంచిది’ అని ఆదినారాయణరెడ్డికి హితవు పలికారు. 
Back to Top