అరాచక ప్రభుత్వం

  • టీడీపీ అధికారంలోకి వచ్చాక జిల్లాలో హత్యలు పెరిగిపోయాయి
  • మంత్రులు, ఎమ్మెల్యేలు పోలీసు అధికారులపై దౌర్జన్యాలకు పాల్పడుతున్నారు
  • ఇసుకమాఫియాను ప్రోత్సహిస్తూ ప్రజాధనం కొల్లగొడుతున్నారు
  • అన్యాయాలను ఎదురిస్తున్న వైయస్సార్సీపీ నేతలపై దాడులకు తెగబడుతున్నారు
  • అక్రమ కేసులు, అరెస్ట్ లు, హత్యలతో దారుణమైన పాలన సాగిస్తున్నారు
  • ప్రభుత్వంపై  వైయస్సార్సీపీ ఎమ్మెల్సీ ఆళ్ల నాని ధ్వజం
పశ్చిమగోదావరిః టీడీపీ అధికారంలోకి వచ్చాక పశ్చిమగోదావరి జిల్లాలో హత్యలు పెరిగిపోయాయని వైయస్సార్సీపీ ఎమ్మెల్సీ ఆళ్ల నాని అన్నారు. మంత్రులు, టీడీపీ ఎమ్మెల్యేలు జిల్లాలో అరాచకం సృష్టిస్తున్నారని ఆళ్ల నాని మండిపడ్డారు. ఎస్సై, ఏఎస్సైలపై టీడీపీ ఎమ్మెల్యేలు దౌర్జన్యం చేసినా ముఖ్యమంత్రి కనీసం స్పందించకపోవడం బాధాకరమన్నారు. తణుకు నియోజకవర్గంలో టీడీపీ ఎమ్మెల్యే రాధాకృష్ణ రెండ్రోజులుగా పోలీసు అధికారులపై దౌర్జన్యం చేశాక కూడ జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు స్పందించిన తీరు రాష్ట్ర ప్రజలు నిర్ఘాంత పోయేలా చేసిందన్నారు. ఎస్సై స్థాయి అధికారిణి  రాధాకృష్ణ తన కార్యాలయానికి పిలిపించి కింద కూర్చోబెట్టి... మా అనుచరులపై కేసులు పెడతారా అంటూ పరుష పదజాలంతో దుర్భషలాడుతూ బెదిరించి, 8 గంటల పాటు తన కార్యాలయంలోనే నిర్బంధించిన సంఘటన నివ్వెరపర్చిందన్నారు. 

ఇసుకమాఫియాను ప్రోత్సహిస్తూ, ప్రజాధనాన్ని కొల్లగొడుతూ టీడీపీ ఎమ్మెల్యేలు పరకాల ప్రభాకర్, శేషారావు అధికారులపై దౌర్జన్యాలు కొనసాగిస్తున్నా, రాధాకృష్ణ ఎస్సైని నిర్బంధించినా చంద్రబాబు ఎటువంటి చర్యలు తీసుకోలేదంటేనే రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఎంతవరకు అమలవుతుందో అర్థమవుతోందన్నారు. పశ్చిమగోదావరి జిల్లాలో టీడీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు చట్టాన్ని చేతుల్లోకి తీసుకొని ఏవిధంగా అరాచకాలు చేస్తున్నారో ప్రజలు గమనించాలన్నారు.  జిల్లాకు వచ్చిన ముఖ్యమంత్రి  వాళ్లను మందలించి పోలీసులకు ఆత్మస్థైర్యాన్ని ఇవ్వాల్సింది పోయి....మీ ప్రాంతంలో అరాచకాలు కొనసాగించండని నిర్లజ్జగా, నిస్సిగ్గుగా వాళ్లను ప్రోత్సహించడం సిగ్గుచేటన్నారు. ఇదేనా బాబు మీ 40 ఏళ్ల అనుభవం అని నాని ధ్వజమెత్తారు. బాబును నమ్మి 15 సీట్లు ఇస్తే...జిల్లాలో ప్రజాసంపదను కొల్లగొడుతూ ఏవిధంగా దౌర్జన్యాలు చేస్తున్నారో చూసి ప్రజలు అసహ్యించుకుంటున్నారని అన్నారు. 

టీడీపీ ఎమ్మెల్యేలు గన్ మెన్ లను ప్రభుత్వానికి సరెండర్ చేసి నిస్సిగ్గుగా వ్యవహరించారని నాని నిప్పులు చెరిగారు. జిల్లాకు ప్రాజెక్ట్ తీసుకొచ్చేందుకు కలిసికట్టుగా ఏనాడైనా మీ ముఖ్యమంత్రిని అడిగారా అని నిలదీశారు.  పితాని సత్యనారాయణ, శేషారావు, జవహర్, మాణిక్యాలరావులు ఏనాడైనా జిల్లా సమస్యలపై మాట్లాడారా...? అని ప్రశ్నించారు. పోలవరంలో అవకతవకలు, పట్టిసీమలోని అవకతవకలపై కాగ్ ప్రభుత్వాన్ని కూడ తప్పుబట్టిన విషయాన్ని నాని గుర్తు చేశారు. ఇంత దారుణంగా రాష్ట్రంలో పాలన జరుగుతోందని అన్నారు.  
అన్యాయాలను ఎదురిస్తున్న వైయస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలపై  రాష్ట్రంలో ఏవిధంగా దాడులు జరుగుతున్నాయో ప్రజలు గమనించాలన్నారు. పత్తికొండలో నారాయణరెడ్డిని ఎంత దారుణంగా హత్య చేశారో చూశాం. గిరిజనులకు జరుగుతున్న అన్యాయాన్ని నిలదీయడానికి వైయస్సార్సీపీ నేత బాలరాజు వెళితే ఆయనపై కేసులు పెట్టి ఏవిధంగా నిర్బంధించారో చూశాం. కొట్టు సత్యనారాయణ ఆయన ఇంటిసమీపంలో జరుగుతున్న గొడవను నివారించడానికి వెళితే మంత్రి ప్రోద్బలంతో పోలీసులు ఏకపక్షంగా వ్యవహరించి ఏవిధంగా అరెస్ట్ చేశారో చూశాం.  పోలీసులు, అధికారులు ప్రభుత్వానికి లొంగి తొత్తులుగా వ్యవహరిచడం వల్లే ఈరోజు మీ వరకు వచ్చిందన్న సంగతి తెలుసుకోవాలన్నారు. అధికారానికి దాసోహమనకుండా, టీడీపీ నేతలకు తొత్తులుగా ఉండకుండా ప్రజలకు న్యాయం చేసేవిధంగా నిష్పక్షపాతంగా వ్యవహరించాలన్నారు. ఈ సంఘటనతోనైనా కళ్లు తెరవాలని పోలీసులకు హితబోధ చేశారు. 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top