'అగ్రిగోల్డ్’ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా: వైఎస్ జగన్‌

విజయనగరం: అగ్రిగోల్డ్ బాధితుల సమస్య పరిష్కరించడానికి కృషి చేస్తానని వైఎస్‌ఆర్ సీపీ అధినేత, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి హామీ ఇచ్చారు. జిల్లా పరిషత్ గెస్ట్ హౌస్ వద్ద మంగళవారం అగ్రిగోల్డ్ బాధితులు, ఏజెంట్లు జగన్‌మోహన్ రెడ్డిని క లిసి తమ సమస్యలు విన్నవించారు. ఎమ్మెల్సీ కోలగట్ల వీరభద్రస్వామి కుమార్తె వివాహానికి హాజరైన జగన్‌మోహన్ రెడ్డి వధూవరులను ఆశీర్వదించిన అనంతరం జిల్లా పరిషత్ గెస్ట్‌హౌస్‌కు చేరుకునేందుకు బయలుదేరారు. ఆయన కారు గేటు వద్దకు రాగానే బాధితులు ఆయనకు సమస్యలు చెప్పడం ఆరంభించారు.
 
దీంతో ఆయన కారు దిగి సమస్యలను విన్నారు. కష్టపడి సంపాదించిన సొమ్ములు డిపాజిట్ చేస్తే ఇప్పుడు ఇలా జరుగుతోందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే తమకు ఆత్మహత్యలే శరణ్యమని అన్నారు. సుమారు ఇరవై నిమిషాల పాటు వారి సమస్యలను జగన్‌మోహన్ రెడ్డి విన్నారు. సమస్య పరిష్కారానికి తన వంతుగా గట్టిగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఆయనతో పాటు పార్టీ ఉత్తరాంధ్ర జిల్లాల సమన్వయకర్త సుజయ్‌కృష్ణరంగారావు, బెల్లాన చంద్రశేఖర్, విశాఖపట్నం జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్‌నాథ్, విశాఖ టౌన్ అధ్యక్షుడు వంశీకృష్ణయాదవ్ తదితరులు ఉన్నారు.
Back to Top