తాడేపల్లి: రైతులు ధాన్యం కల్లాల్లో ఉన్నా కొనుగోలు చేయని కూటమి ప్రభుత్వ తీరుపై వైయస్ఆర్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడేపల్లి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ... రైతులకు కనీసం గనీ బ్యాగులు కూడా ఏర్పాటు చేయలేని అసమర్థ ప్రభుత్వమని మండిపడ్డారు. ధాన్యం సేకరణలో మిల్లర్లు, దళారులే ఇష్టారాజ్యంగా మారిందని.. రూ.1777 మద్ధతు ధర ప్రకటించినా.. తేమ పేరుతో రూ.1300 మించి చెల్లించడం లేదని తేల్చి చెప్పారు. రైతులకు ఇంత అన్యాయం జరుగుతున్నా పౌరసరఫరాలశాఖ అధికారులు, మంత్రి ఏం చేస్తున్నారని నిలదీశారు. గత సీజన్ లో కనీసం యూరియా కూడా అందించలేని ప్రభుత్వం.. మరలా రైతులు ఎరువులు కోసం క్యూలైన్లో పడిగాపులు పడుతున్నా.. పట్టించుకోకపోవడం పై తీవ్రంగా మండిపడ్డారు. తక్షణమే రైతులకు గనీ బ్యాగులిచ్చి, ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ఇంకా ఏమన్నారంటే... ● రైతులను కొత్త వరవడిలో మోసం చేస్తున్న కూటమి ప్రభుత్వం.. ధాన్యం సేకరణలో కూటమి ప్రభుత్వం రైతులను రోజూ ఒక కొత్తవరవడిలో మోసం చేస్తోంది. పంట విత్తుకున్నప్పటికీ నుంచి ఒక రకంగా ఇబ్బందిపెడితే... ఇవాళ ధాన్యం సేకరణలో ప్రభుత్వ తీరుతో తీవ్రంగా నష్టపోతున్నాడు. ఒకవైపు ప్రభుత్వ ఉదాసీనత, మరోవైపు దళారులు, మిల్లర్ల మోసంతో ధాన్యం రైతు పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది. కృష్ణా జిల్లాలో గడిచిన రెండురోజులగా రూ.1300 కే కొని రైతులను దారుణంగా మోసం చేస్తున్నారు. ధాన్యం మద్ధతు ధర రూ.1777 ఉంటే... సేకరణలో అంతే మొత్తానికి బిల్లు జనరేట్ చేస్తూ.. రైతులకు మాత్రం బస్తాకు రూ.1300 ఇస్తున్నారు. వంద బస్తాల అమ్మిన రైతు రూ.50 వేలు నష్టపోతున్నాడు. ఈ రూ.50 వేలు ఎవరి జేబులోకి పోతున్నాయి? రైస్ మిల్లరు మోసం చేస్తున్నాడా? దళారులు మోసం చేస్తున్నారా? స్ధానికి ఎమ్మెల్యే మోసం చేస్తున్నాడా? కూటమి నాయకులు మోసం చేస్తున్నారా? పౌరసరఫరాలశాఖ అధికారులు చివరి గింజ వరకు ధాన్యం కొంటామని ప్రకటనలు చేస్తూనే... తెరవెనుక రైతును మోసం చేస్తున్నారు. ● వైయస్.జగన్ హయాంలో సాగు స్వర్ణయుగం... వైయస్.జగన్ సీఎంగా ఉన్నప్పుడు... ప్రతి గ్రామంలోనూ రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేసి అక్కడ తీసుకున్న తేమ శాతాన్నే ఫైనల్ తీసుకుని రైతులకు పంటకు ధర నిర్ణయించే పరిస్థితి ఉండేది. కానీ కూటమి ప్రభుత్వంలో ఆర్బీకేలతో పనిలేదు. కస్టోడియన్ ఆఫీసర్ పేరుతో ఏర్పాటు చేసిన వ్యక్తి అందుబాటులో ఉండడం లేదు. తేమ శాతాన్ని రైస్ మిల్లరూ, దళారో నిర్ణయించే దుస్థితి దాపురించింది. గతంలో ఆర్బీకేల వద్ద తగిన లారీలు ఏర్పాటు చేసి.. ధాన్యాన్ని తరలించేవారు. ఇప్పుడు కొన్ని గ్రామాల్లో రవాణా సౌకర్యం లేక... 45 లారీల వరకు ధాన్యం ఉండిపోయిన పరిస్థితి కనిపిస్తోంది. చివరకు రవాణా విషయంలోనూ రైతులను మోసం చేస్తున్నారు. వైయస్.జగన్ హయాంలో రవాణాకు షెడ్యూల్ తీసుకుని ఆ మేరకు కోత కు అనుమతిలిచ్చేవారు. నేటు గన్నీ బ్యాగులు అందించే పరిస్థితి లేకుండా పోయింది. దీంతో పంటను ఇంకా రోడ్ల మీదే రైతులు వదిలేయాల్సిన దుస్థితి నెలకొంది. టీడీపీ నేతలే ఆర్బీకేల వద్ద కూర్చుని.. ఏ ధాన్యం ఎప్పుడు తీసుకెళ్లాలో చెబుతుంటే... కూటమి ప్రభుత్వానికి ఓటేసిన పాపానికి రైతులు ఇంట్లో కూర్చుని ఏడుస్తున్న పరిస్థితి నెలకొంది. ● చంద్రబాబు రైతు ద్రోహి... ధాన్యం సేకరణలో ఎందుకు ప్రభుత్వం ఫెయిలైందని ప్రశ్నిస్తే... దానికి సమాధానం చెప్పకుండా... బియ్యం ఎవరూ తినడం లేదు, వచ్చే ఏడాది మనం ధాన్యం కొనలేమని ముఖ్యమంత్రి స్ధాయిలో ఉన్న వ్యక్తి ఎలా మాట్లాడతారు? యూరియా వాడితే కేన్సర్ వస్తుందని.. పండించవద్దని ఎలా చెబుతారు? మీరిచ్చిన విత్తనాలే రైతులు పండిస్తున్నప్పుడు ఈ రకంగా ఎలా మాట్లాడతారు? వారిని మానసికంగా కృంగదీస్తూ వారిని ఆత్మహత్యలకు పాల్పడేలా పురికొల్పుతున్నారు. చంద్రబాబునాయుడు ఎన్నికల ముందు రైతుల ధాన్యం కొనలేమని ఎందుకు చెప్పలేదు? ఆ రోజు రైతులకు ఏం చెప్పారు? రైతును రాజును చేస్తామని చెప్పిన మీరు ఇవాళ రైస్ మిల్లర్లను రాజను చేస్తున్నారు. రైతులంటే మీరు అలుసు. గతంలో దివంగత నేత వైయస్సార్ ఉచిత విద్యుత్ ఇస్తామంటే.. కరెంటు తీగల మీద బట్టలు ఆరేసుకోవాలని చెప్పిన మీ మాటలు మరలా గుర్తుకు వస్తున్నాయి. అందుకే మిమ్నల్ని ప్రజలు పదేళ్లు అధికారానికి దూరం పెట్టారు. మరలా మీరు రైతులను మోసం చేసే కార్యక్రమంలో కొత్త పుంతలు తొక్కుతున్నారు. ● కూటమి పాలనలో - అడుగడుగునా రైతుకు అన్యాయం.. రైతు మూడు విధాలుగా మోసపోయారు. తుపాను ప్రభావంతో 10-15 బస్తాలు దిగుబడి తగ్గపోగా.. రూ.15వేల వరకు వ్యయం పెరిగింది. మరోవైపు ప్రభుత్వం రైతులను డైవర్షన్ చేయడానికి మేము సర్వే చేసిన భూములలో ధాన్యం కొనుగోలు చేయమని చెప్పి వారినిమరింత కుంగదీశారు. ఇన్ పుట్ సబ్సిడీ ఇస్తే రైతులకు పెరిగిన అదనపు వ్యయానికి ఉపయోగపడుతుందన్న ధ్యాస కూడా ప్రభుత్వానికి లేకుండా పోయింది. ఇ-క్రాప్ చేస్తే కౌలురైతు ధాన్యం అమ్ముకునే పరిస్థితి ఉండేది. అలా చేయకపోవడం వల్ల కౌలురైతు ధాన్యాన్ని రూ.1100, రూ.1200 కే అమ్ముకోవాల్సిన దుస్థితి వచ్చింది. ఆలస్యంగా నాట్లు వేసిన రైతులు పంట తుపానులో ఎఫెక్ట్ కాలేదు. ఆ పంటను కూడా రూ.1000, రూ.1100 కే అడుగుతుండడం మరింత దౌర్భాగ్యం. రైస్ మిల్లర్లే ధర నిర్ణయించి, రైతు భవిష్యత్తును నిర్ణయించే స్థాయికి వచ్చారంటే.. పౌరసరఫరాల శాఖ అధికార్లకు, మంత్రికి ఏం అజమాయిషీ ఉందని ప్రశ్నిస్తున్నాం? రైతుల నుంచి ధాన్యం కొనడం లేదని చెబితే.. కొనుగోలు చేసిన ధాన్యానికి 24 గంటల్లో డబ్బులిస్తామని చెబుతారే తప్ప.. ధాన్యం కొనుగోలు గురించి మాత్రం మాట్లాడరు. వైయస్.జగన్ హయాంలో ధాన్యం తుపాను వల్ల తడిస్తే.. రైస్ మిల్లర్లను పిలిచి మంచి ధాన్యాన్ని కొనుగోలు చేసినట్లే ఈ ధాన్యానికి కూడా ఒక ధరనిర్ణయించి కొనుగోలు చేయాలని చెప్పాం. మీరు మాత్రం మంచి ధాన్యాన్నే కొనుగోలు చేయడం లేదు. ఇ-క్రాప్ లేదు, ఇన్ పుట్ సబ్సిడీ ఇవ్వలేదు, ప్రభుత్వం వైపు నుంచి ఇన్సూరెన్స్ కట్టకుండా వదిలేసిన మీరా వైయస్.జగన్ ప్రభుత్వం గురించి విమర్శించేది. గతంలో యూరియా కొరతతో రాష్ట్ర వ్యాప్తంగా రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. తాజాగా మరలా యూరియా కోసం రైతులు బారులు తీరి క్యూలైన్లో నిల్చుంటున్న పరిస్థితి కనిపిస్తోంది మీకు నిజంగా రైతుల పట్ల చిత్తశుద్ధి ఉంటే... గతంలో ఎలాగూ ఆ సమస్యను పరిష్కరించలేదు.. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని అయినా యూరియా కొరత లేకుండా చూడలేకపోయారు. మీకా రైతుల పట్ల చిత్తశుద్ధి ఉంది? సకాలంలో యూరియా అందించలేరు. పంట సాగుచేసినప్పుడు, అమ్ముకొనేటప్పుడు ఎప్పుడూ రైతులను ఆదుకోలేరు. ఇ-క్రాప్ చేయరు. ఇన్సూరెన్స్ లేదు. ఇన్ పుట్ సబ్సిడీ కూడా అందించకుండా అన్నదాతలను పూర్తిగా అన్యాయం చేశారు. వ్యవసాయాన్ని పండగలా చేసిన ఘనత వైయస్.జగన్ ది అయితే... సాగుతో పాటు అన్ని వ్యవస్థలను పూర్తిగా కుప్పకూల్చిన ప్రభుత్వం మీది. ఇప్పటికైనా ప్రభుత్వం దళారుల పాత్ర తగ్గించి... రైతులకు మద్ధతు ధర అందించి ధాన్యం కొనుగోలు చేయాలి. గనీ బ్యాగులు లేక పది, పదిహేను రోజుల నుంచి ధాన్యాన్ని రోడ్లమీదే ఆరబోసుకున్న రైతులకు వెంటనే గోనె సంచులు అందించాలని... కుంటిసాకులు చెప్పి తప్పించుకునే కార్యక్రమం చేస్తే... ఆందోళన తప్పదని కైలే అనిల్ కుమార్ హెచ్చరించారు.