ఎంపీల రాజీనామాలకు అడుసుమిల్లి డిమాండ్

హైదరాబాద్ 01 ఆగస్టు 2013: 

ప్రస్తుతం జరిగిన రాష్ట్ర విభజన సోనియా గాంధీ ఆధ్వర్యంలో సాగిన విదేశీ కుట్రని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత అడుసుమిల్లి జయప్రకాశ్ మండిపడ్డారు. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయంలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణ బిల్లు పెట్టకుండా ఉండాలంటే అందరూ రాజీనామా చేయాలని ఆయన పిలుపునిచ్చారు. రాజీనామాలు చేస్తే యూపీఏ ప్రభుత్వం పడిపోతుందనీ, ఎన్నికలొస్తే తెలంగాణ బిల్లు ఎలా నెగ్గుతుందో చూస్తామని తెలిపారు. టీడీపీని ముక్కలు చేసిన చంద్రబాబు ఇప్పుడు రాష్ట్రాన్ని ముక్కలు చేయడానికి తన అనుభవాన్ని ఉపయోగించారని ఆయన ధ్వజమెత్తారు. ఆంధ్రులందరూ కలిసి ఉండాలనేది వందేళ్ళ ఉద్యమమని చెప్పారు. బాపట్లలో ఇటీవలే ఆంధ్ర మహాసభ వందేళ్ళ పండుగను కూడా నిర్వహించిన విషయాన్ని అడుసుమిల్లి గుర్తుచేశారు. పత్రికలలో 60 ఏళ్ళు అని వచ్చిన విషయాన్ని ఖండిస్తున్నానన్నారు. ఒక తల్లి పాలు తాగిన పిల్లల కంటే ఒకే భాష మాట్లాడే ప్రజల మధ్య ఆత్మీయత ఎక్కువని మ్యాక్సు ముల్లర్ వ్యాఖ్యానించిన విషయాన్ని అడుసుమిల్లి ఈ సందర్భంగా గుర్తుచేశారు. దానిని దూరం చేశారన్నారు. తెలుగు ప్రజలు సమైక్యంగా ఉండాలన్న ఆశయం ఎన్టీరామారావుదన్నారు. రెండు కాకపోతే నాలుగు రాష్ట్రాల్లో తెలుగు వారు ఉండాల్సి వస్తుందనీ, విభజనంటూ ప్రారంభమైతే ఇది తప్పదనీ చెప్పారు. ఉత్తరాంధ్ర, గ్రేటర్ రాయలసీమ డిమాండ్లు వినిపిస్తున్న అంశాన్నిఆయన గుర్తుచేశారు. ప్రస్తుత పరిణామం దేశ విచ్చిన్నానికి కారణమవుతోందన్న ఆందోళనను ఆయన వ్యక్తంచేశారు. ఇదో విదేశీ కుట్రన్నారు. సోనియా ఇందులో ప్రధాన పాత్రని ఆరోపించారు. ఈ కుట్రలో బీజేపీ, టీడీపీ కూడా చేతులు కలిపాయన్నారు. ప్రస్తుత నిర్ణయం వల్ల దేశం ఏరకంగా అట్టుడుకుతోందో గ్రహించాలని కోరారు. దేశ సరిహద్దుల్లో కూడా ఇలాంటి విభజన డిమాండ్లు వినిపించడం జాతికి ప్రమాదమన్నారు. మొదలైతే దీనికి అంతులేదన్నారు. దేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి సోనియా గాంధీ చేసిన కుట్ర ఇదని తీవ్రంగా ఆరోపించారు. సీమాంధ్ర నేతలకు చీము, నెత్తురూ ఉంటే వెంటనే రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణ బిల్లును ఓడిస్తామని వారు పోసుకోలు కబుర్లు చెబుతున్నారని విమర్శించారు. బిల్లు పెట్టకుండా ఉండాలంటే రాజీనామాలు చేయాల్సిందేనని అడుసుమిల్లి స్పష్టంచేశారు. 17మంది ఎంపీలూ రాజీనామా చేస్తే ప్రభుత్వం పడిపోతుందనీ, అప్పుడు బిల్లు సమస్య లేదు... సోనియా సమస్య లేదనీ పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో సోనియా గాంధీకి తెలుగు ప్రజలు ఎలా బుద్ధి చెబుతారో చూపిస్తామన్నారు. రాష్ట్ర విభజనపై సుప్రీం కోర్టులో సవాలు చేసే అంశంపై పెద్ద లాయర్లతో సంప్రతిస్తున్నానని తెలిపారు.

Back to Top