హైదరాబాద్, 4 అక్టోబర్ 2012: అధికార కాంగ్రెస్‌తో జగన్ పార్టీ కుమ్మక్కైందన్న టీడీపీ అధినేత చంద్రబాబు వ్యాఖ్యలపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తింది. అడుగడుగునా ఫిక్సింగ్ రాజకీయాలకు పాల్పడిన బాబుకు అలా మాట్లాడే నైతిక హక్కు లేదని ఆ పార్టీ అధికార ప్రతినిధి జనక్‌ప్రసాద్ గురువారం ఉదయం సాక్షి హెడ్లైన్ షో చర్చలో మండిపడ్డారు.
గ్యాస్ సిలిండర్ల ధర పెంచితే, సిలిండర్లను తక్కువ చేస్తే చంద్రబాబు మాట్లాడలేదని, ఎఫ్‌డిఐలపై ఆయన ఒక్కరోజు నోరెత్తలేదేమని జనక్ ప్రసాద్ నిప్పులు చెరిగారు. ఇన్ని రకాలుగా ప్రభుత్వానికి వత్తాసు పలుకుతున్న బాబు తీరు మ్యాచ్ ఫిక్సింగ్ కాక మరేమిటని నిలదీశారు. మమతా బెనర్జీ అవిశ్వాసం పెడతానంటే... ఆమె పెట్టదని చంద్రబాబు చెబుతారని, ఒక వేళ మమత అవిశ్వాసం పెట్టినా ములాయం సింగ్ యాదవ్ ఆమెకు మద్దతివ్వరని ఆయనే చెబుతారని, అంటే కాంగ్రెస్ పార్టీ పట్ల ఎంత ప్రగాఢమైన భక్తితో చంద్రబాబు ఉన్నారో అర్థం అవుతోందన్నారు.
ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో రాష్ట్రంలో అధికారంలోకి రాబోయేది జగనే అనే అభిప్రాయం మెజార్టీ ప్రజల్లో ఉందని సీనియర్ జర్నలిస్టు కృష్ణారావు అభిప్రాయపడ్డారు. అధికారం రుచి మరిగి ఉన్న చంద్రబాబు మాటలను ప్రజలు ఎంత వరకు నమ్ముతారో చూడాలని ఆయన వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని దింపేసి తనకు అధికారం ఇవ్వమని చంద్రబాబు ఓటర్లను నేరుగానే అడుగుతున్నారన్నారు. తనకు అధికారం వస్తే ఇది చేస్తా, అది చేస్తా అని చెబుతున్నారన్నారు. కాంగ్రెస్, టిడిపి పరిపాలనను చూసిన ప్రజలు కొత్తగా వచ్చిన జగన్‌కు ఓ అవకాశం ఇచ్చి చూద్దామన్న ఆలోచనలో ఉన్నారన్నారు.
అవినీతి సామ్రాట్ అని జాతీయ మీడియా గుర్తించిన చంద్రబాబు యాత్ర అధికార దాహ యాత్ర తప్ప మరొకటి కాదని టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు అభిప్రాయపడ్డాయి. ఘోరంగా ఎండలు కాస్తున్న సమయంలో మహానేత వైయస్ రాజశేఖరరెడ్డి పాదయాత్ర చేశారని, ఒకానొక సందర్భంలో ఆయన ప్రాణాలకు కూడా హాని కలిగే పరిస్థితి వచ్చిందని పిసిసి కార్యదర్శి కృష్ణకుమార్ గౌడ్ పేర్కొన్నారు. చంద్రబాబు పాదయాత్రను చక్కగా వర్షాలు కురుస్తున్న సమయంలో ప్రారంభించారని, మరో పక్కన ఏసి బస్సులు ఏర్పాటు చేసుకున్నారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు జీవితాంతమూ నటిస్తూనే ఉన్నారని ఆరోపించారు. ఆరు కిలోమీటర్లు నడిచినంతమాత్రానే కాళ్ళు నొస్తున్నాయని చంద్రబాబు చెప్పారన్నారు. అదే వైయస్ అయితే ఏనాడూ తాను బాధపడుతున్నట్లు ఎవరికీ చెప్పలేదన్న విషయాన్ని గుర్తుచేశారు. పెద్ద అవినీతిపరుడైన చంద్రబాబు గాంధీ పుట్టిన రోజున పాదయాత్ర చేయడం మన దౌర్భాగ్యమని కృష్ణకుమార్‌గౌడ్ వ్యాఖ్యానించారు.
చంద్రబాబు నాయుడు అహం నుంచి బయటపడలేదని టిఆర్‌ఎస్ నాయకుడు చెరుకు సుధాకర్ అన్నారు. పాదయాత్ర చేయడమంటే ప్రజల నుంచి నేర్చుకునే పద్ధతిలో చేయాలన్నారు. పాదయాత్ర చేసే వారు సందేశాత్మకంగా ప్రజల నుంచి నేర్చుకోవడానికి వెళ్ళాలన్నారు. నన్ను నేను శిక్షించుకుంటున్నా, నాకు నేను శిలువ వేసుకుంటున్నా అని చంద్రబాబు చెప్పడంలో అర్థం లేదని ఆయన అన్నారు.