<strong>9న గుంటూరులో వంచనపై గర్జన</strong><strong>దీక్ష వివరాలు వెల్లడించిన పార్టీ నేతలు రావి వెంకటరమణ, లేళ్ల అప్పిరెడ్డి</strong>గుంటూరు: వంచనపై గర్జన దీక్షను విజయవంతం చేసి బీజేపీ, టీడీపీ ప్రభుత్వాలకు కనువిప్పు కలిగించాలని వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు రావి వెంకటరమణ, లేళ్ల అప్పిరెడ్డిలు పిలుపునిచ్చారు. గుంటూరు జిల్లా ఇన్నర్ రింగ్‌రోడ్డు వేదికగా ఈ నెల 9వ తేదీన వైయస్‌ఆర్ సీపీ వంచనపై గర్జన కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఈ మేరకు దీక్షకు సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి. గుంటూరు జిల్లా పార్టీ కార్యాలయంలో వారు మీడియాతో మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేసిన అన్యాయానికి వ్యతిరేకంగా వైయస్‌ఆర్ సీపీ పోరాడుతుందన్నారు. హోదా సాధించే వరకు విశ్రమించేది లేదన్నారు. నాలుగేళ్లుగా ప్రత్యేక హోదా కోసం వైయస్‌ఆర్ సీపీ అధినేత వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి అనేక పోరాటాలు చేశారని గుర్తు చేశారు. వంచనపై గర్జన పేరిట ఇప్పటికే విశాఖ, నెల్లూరు, అనంతపురం జిల్లాల్లో దీక్షలు పూర్తయ్యాయని, గుంటూరులో 9వ తేదీన జరగనుందని చెప్పారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు దీక్ష కొనసాగుతుందని, పార్టీ ముఖ్యనేతలు, ఎమ్మెల్యేలు, అసెంబ్లీ, పార్లమెంట్ నియోజకవర్గాల సమన్వయకర్తలు, మాజీ ఎంపీలు పాల్గొంటారని వివరించారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, నిరుద్యోగులకు ఉద్యోగాలు రావాలని, వైయస్ జగన్ హోదా కోసం పోరాడుతున్నారన్నారు. రాష్ట్రం బాగుపడాలని కోరుకునే ప్రతి ఒక్కరూ దీక్షలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.