తూర్పుగోదావరిలో ర్యాలీలతో నీరాజనం

 
కాకినాడ: కుట్రలు, కుతంత్రాలతో జననేత జగన్‌మోహన్‌రెడ్డిని జైలుకు పంపించామని సంబరపడుతున్న అధికార, విపక్షాలను జిల్లా ప్రజలు తరచు వెక్కిరిస్తూనే ఉన్నారు. ఆయనను కటకటాల వెనక్కి నెడితే వైయస్ఆర్ కాంగ్రెస్ బలహీనపడుతుందనుకున్న వారి లెక్క తప్పిందని చాటుతూనే ఉన్నారు. తూర్పుగోదావరి జిల్లాలో ఏమూల ఏ కార్యక్రమం చేపట్టినా వస్తున్న జనస్పందనే ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది. పోలీసు కేసులకు సైతం వెరవకుండా పార్టీ కార్యక్రమాలకు స్వచ్ఛందంగా జనం, అభిమానులు తరలివస్తున్నారు. జగన్ జైలు నుంచి విడుదలవ్వాలని కోరుకుంటూ జిల్లాలోని వివిధ నియోజకవర్గాల్లో స్వచ్ఛందంగా నిర్వహిస్తున్న కార్యక్రమాలు, అధికార, విపక్ష పార్టీలను వీడి వైయస్ఆర్ కాంగ్రెస్ గూటికి చేరుతున్న వారి తీరు జగన్‌పై గురి, పార్టీపై ఆదరణ దినదినాభివృద్ధి చెందుతున్న వాస్తవాన్ని స్పష్టం చేస్తున్నాయి. వైయస్ఆర్ సీపీ యువజన విభాగం అధ్యక్షుడు అనంత ఉదయభాస్కర్ ఆధ్వర్యంలో మెట్ట ప్రాంతంలో చేపట్టిన మోటార్‌ సైకిల్ ర్యాలీకి అనూహ్య స్పందన లభించింది. జిల్లా నలుమూలల నుంచి పార్టీ అభిమానులు, కార్యకర్తలు, నాయకులు పెద్ద ఎత్తున మోటార్‌సైకిళ్లతో స్వచ్ఛందంగా తరలివచ్చి బైక్‌ ర్యాలీని హోరెత్తించారు. 
తొలుత కిర్లంపూడి మండలం సోమవరం వెంకటేశ్వరస్వామి ఆలయంలో పార్టీ యువజనవిభాగం అధ్యక్షుడు ఉదయభాస్కర్, పార్టీ నేతలు, అభిమానులు, కార్యకర్తలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం జాతీయరహదారిపై ఎర్రవరం-ఏలేరు వంతెన వద్ద ర్యాలీని పార్టీ కన్వీనర్ కుడుపూడి చిట్టబ్బాయి జెండా ఊపి ప్రారంభించారు. జగన్ విడుదలవ్వాలంటూ పార్టీ సీజీసీ సభ్యుడు జ్యోతుల ఇచ్చిన పిలుపునకు అభిమానులు, కార్యకర్తలు గొంతు కలుపుతూ ‘జై జగన్, జైజై జగన్, జైలు నుంచి జగన్ విడుదలవ్వాలి’ అంటూ చేసిన నినాదాలతో జాతీయరహదారి మారుమోగింది. ర్యాలీ సోమవరం నుంచి అన్నవరం వరకు సుమారు 40 కిలోమీటర్ల మేర రెండు గంటలు సాగింది.  జాతీయ రహదారిపై వాహనాలపై వెళుతున్న వారు కూడా కత్తిపూడి, ఎర్రవరం, తేటగుంట వద్ద ఎదురేగి ర్యాలీలో ఉన్న నేతలకు సంఘీభావం తెలియచేయడం కనిపించింది. 
గ్రామగ్రామానా హారతులు
ర్యాలీ ఆద్యంతం గ్రామాల ప్రజలు, మహిళలు నేతలకు హారతులు పడుతూ స్వాగతం పలికి అభిమానాన్ని చాటుకున్నారు. ర్యాలీలో భాగంగా ప్రత్తిపాడు పంచాయతీ వద్ద మహానేత  రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కత్తిపూడిలో నెల్లిపూడి మాజీ సర్పంచ్, జిల్లా కాంగ్రెస్ కార్యదర్శి పిర్ల నాగేశ్వరరావును సీజీసీ సభ్యుడు నెహ్రూ, మాజీ ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావు పార్టీ కండువా కప్పి పార్టీలో చేర్చుకున్నారు. ర్యాలీ అన్నవరం చేరుకున్నాక నాయకులు, కార్యకర్తలు, అభిమానులు మోకాళ్లపై నిలబడి ‘జగన్ విడుదలయ్యేలా కరుణించు స్వామీ!’ అంటూ అన్నవరం సత్యదేవునికి మొక్కుకున్నారు.
వలసల జోరు
కోనసీమ కేంద్రం అమలాపురంలో గురువారం రాత్రి పార్టీ కన్వీనర్ కుడుపూడి చిట్టబ్బాయి సమక్షంలో కాంగ్రెస్, టీడీపీల నుంచి పలువురు యువ నేతలు పార్టీలో చేరారు. వివిధ శాఖల్లో పలు హోదాల్లో పని చేసి రిటైరైన ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పార్టీలో చేరడం వివిధ వర్గాల్లో పార్టీకి పెరుగుతున్న ఆదరణను స్పష్టం చేస్తోంది.
జిల్లాలో కాంగ్రెస్ నాయకత్వంపై వ్యతిరేకతతో ఆ పార్టీ నుంచి ఇటీవల వైయస్ఆర్ సీపీకి వలసలు పెరుగుతున్నాయి. ఒకప్పుడు టీడీపీకి కంచుకోటగా నిలిచిన తుని, మండపేట నియోజకవర్గాలు మొదలు అనపర్తి, కాకినాడ సిటీ, ముమ్మిడివరం, పి.గన్నవరం, రాజోలు వరకు, ఇటు రాజమండ్రి నుంచి రంపచోడవరం వరకు దాదాపు అన్ని నియోజకవర్గాల్లో వైయస్ఆర్ సీపీలోకి పెరుగుతున్న వలసలు పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతున్నాయి.
అన్నవరంలో తలనీలాల సమర్పణ
అన్నవరం: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు  జగన్‌కు న్యాయం జరగాలని కోరుతూ కాకినాడకు చెందిన 30 మంది కాలినడకన గురువారం ఉదయం అన్నవరం చేరుకొని సత్యదేవునికి తలనీలాలు సమర్పించారు. వీరికి పార్టీ జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యుడు గుబ్బల వెంకట శ్రీనివాస కుమార్ నాయకత్వం వహించారు. తాము బుధవారం ఉదయం కాకినాడలో పాదయాత్ర ప్రారంభించినట్టు వారు తెలిపారు. పార్టీ చేనేత విభాగం జిల్లా కన్వీనర్ పంపన రామకృష్ణ మాట్లాడుతూ జగన్‌ను కేసులలో అక్రమంగా ఇరికించారన్నారు. న్యాయమే చివరకు గెలుస్తుందని అన్నారు. పాదయాత్ర చేసిన వారిలో లింగం రవి, నర్సిరెడ్డి రాజా, గెద్దాడ వెంకటరమణ, పలివెల శ్రీను, వాసంశెట్టి శివ, వాసంశెట్టి వీరబాబు, అల్లంపల్లి ప్రసాద్, వాసు, వానపల్లి శ్రీనివాస్, కుడుపూడి రవికుమార్, ఎన్ భద్రి, పంపన యర్రంప్రసాద్, పి. బెనర్జీరాజు తదితరులు ఉన్నారు.
వైఎస్ హయాంలోనే అభివృద్ధి: గురునాథరెడ్డి
చిలమత్తూరు: మహానేత వైయస్ హయాంలోనే హిందూపురం నియోజకవర్గంలో అభివృద్ధి జరిగిందని అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే గురునాథరెడ్డి అన్నారు. ఎన్నో ఏళ్లుగా హిందూపురంలో టీడీపీ తరఫున ఎమ్మెల్యేలు గెలుస్తున్నా ‘పురం’ ప్రజల తాగునీటి సమస్యను మాత్రం తీర్చలేకపోయారన్నారు. మహానేత ఇచ్చిన మాట ప్రకారం రూ.650 కోట్లను మంజూరు చేసి పీఏబీఆర్ నుంచి తాగునీరు అందించారన్నారు. గురువారం ఎమ్మెల్యే బెంగళూరుకు వెళుతూ కొడికొండ చెక్‌పోస్టులో వైయస్‌ఆర్‌సీపీ మండల సేవాదళ్ కన్వీనర్ సదాశివరెడ్డి స్వగృహంలో విలేకరులతో మాట్లాడారు. హిందూపురం పరిసర ప్రాంతాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేసిన ఘనత వైయస్‌దేనని గురునాథరెడ్డి అన్నారు. అధికార కాంగ్రెస్‌తో కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్న చంద్రబాబును ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు. కేవలం ప్రజలను మభ్యపెట్టేందుకే ‘వస్తున్నా మీకోసం’ అంటూ పాదయాత్ర నాటకమాడుతున్నారని విమర్శించారు.  ప్రజల్లో వైయస్ జగన్‌మోహన్‌రెడ్డిపై అపార నమ్మకముందని, దాని వల్లే ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులు ఘన విజయం సాధించారన్నారు. రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా వైయస్‌ఆర్‌సీపీ విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. అధికార పార్టీ నాయకుల ఒత్తిళ్లకు తలొగ్గి వైయస్‌ఆర్‌సీపీ నాయకులపై రెవెన్యూ, పోలీస్ అధికారులు కక్షసాధింపు చర్యలకు పాల్పడుతూ అక్రమ కేసులు బనాయిస్తున్నారని ఆరోపించారు.

Back to Top