మహానేత వైయస్‌కు రాష్ట్ర వ్యాప్తంగా శ్రద్ధాంజలి

హైదరాబాద్‌, 2 సెప్టెంబర్ 2012 : దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైయస్‌ రాజశేఖరరెడ్డి వర్థంతి కార్యక్రమాలు ఆదివారంనాడు రాష్ట్రవ్యాప్తంగా జరిగాయి. వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు వైయస్‌ఆర్‌ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా పలు చోట్ల వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకులు, కార్యకర్తలు రక్తదాన శిబిరాలు నిర్వహించారు. ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి, మందులు అందజేశారు. పేదలకు అన్నదానం చేశారు.

ఇడుపులపాయలోని వైయస్‌ఆర్‌ ఘాట్‌లో ఉన్న ఆయన సమాధి వద్ద వైయస్‌ విజయమ్మ, కుమార్తె షర్మిల, కోడలు భారతి, అల్లుడు బ్రదర్‌ అనిల్‌, వైయస్‌ వివేకానందరెడ్డి, వైయస్‌ మనోహర్‌రెడ్డి, కొండారెడ్డి ఇతర కుటుంబ సభ్యులు, వేలాది మంది అభిమానులు, ప్రజా ప్రతినిధులు శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా వైయస్‌ సమాధి వద్ద కుటుంబ సభ్యులు పెద్దాయన ఆత్మశాంతి కోసం ప్రార్థనలు నిర్వహించారు. మది నిండా మహానేత జ్ఞాపకాలతో వారంతా మౌనంగా రోదించారు. వైయస్‌ సమాధి వద్ద విజయమ్మ దుఃఖాన్ని ఆపుకోలేక కన్నీటి పర్యంతమయ్యారు. మహానేత వైయస్‌ సమాధి ఉన్న ఇడుపులపాయ అభిమానజన కెరటంతో నిండిపోయింది.

వైయస్‌ఆర్‌ వర్ధంతి సంర్భంగా హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లోని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కార్యాలయంలో వైయస్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నాయకులు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కార్యాయంలో రక్తదాన, ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, యువజన విభాగానికి చెందిన నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో మహానేత వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పొందిన విద్యార్ధులు వైయస్‌ఆర్‌ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆళ్ల నాని మాట్లాడుతూ రాష్ట్రంలో వైయస్‌ జగన్మోహన్‌రెడ్డికి పెరుగుతున్న ప్రజాదరణ చూసి ఓర్వలేని కాంగ్రెస్‌ పెద్దలు కక్ష సాధింపు చర్యలకు దిగారన్నారు. కుట్రలతో వైయస్‌ జగన్‌ను అరెస్టు చేయించారన్నారు. వైయస్‌ మరణం తర్వాత మూడేళ్లలో రాష్ట్రం 30 ఏళ్లు వెనక్కి వెళ్లిపోయిందని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. వైయస్‌ ఆశయాలను ప్రతి కార్యకర్తా ముందుకు తీసుకువెళ్లాలని ఎమ్మెల్యే బాలరాజు పిలుపు ఇచ్చారు.

తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో వైయస్‌ఆర్ వర్ధంతి కార్యక్రమాలు జరిగాయి. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు వైయస్‌ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. చివరి క్షణం వరకు పేదల సంక్షేమం కోసం పరితపించిన మహానేత... వైయస్‌ఆర్ అని కొనియాడారు. మహానేత చూపిన బాటలో నడుస్తూ.. ఆయన పథకాలను కొనసాగిస్తామని వారంతా ప్రతిజ్ఞ చేశారు. జిల్లాలోని జగ్గంపేటలో వైయస్‌ఆర్ వర్ధంతి ఘనంగా నిర్వహించారు.  వైయస్‌ఆర్ కాంగ్రెస్‌ పార్టీ కేంద్రపాలక మండలి సభ్యుడు జ్యోతుల నెహ్రూ ఆదివారం స్థానిక మెయిన్‌ రోడ్డులో  వైయస్‌ఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం  వైయస్‌ఆర్ సేవాసమితి ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు.

కాగా పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం టౌన్షిప్‌లోని వైయస్‌ఆర్ కాలనీలో మహానేత వైయస్‌ విగ్రహాన్ని మాజీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్‌ ఆవిష్కరించారు. వైయస్‌ఆర్ సీపీ కేంద్రపాలక మండలి సభ్యుడు కొయ్యే మోషెన్‌ రాజు వైయస్‌ఆర్ వర్ధంతి కార్యక్రమాలను ప్రారంభించారు.

వైయస్‌ఆర్‌ వర్ధంతి సందర్భంగా విజయనగరం జిల్లా పార్వతీపురంలో వైయస్‌ఆర్ విగ్రహానికి ఆ పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యుడు పెన్మత్స సాంబశివరాజు, బొబ్బిలి ఎమ్మెల్యే సుజయకృష్ణ రంగారావు నివాళులు అర్పించారు. అనంతరం రక్తదాన శిబిరం, మెగావైద్య శిబిరం ప్రారంభించారు. కర్నూలు జిల్లా నంద్యాలలో వైయస్‌ఆర్ వర్ధంతి సందర్భంగా ఆళ్లగడ్డ ఎమ్మెల్యే శోభానాగిరెడ్డి ఆదివారం వైద్య శిబిరం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎంపీ ఎస్పీవై రెడ్డి రాజీనామా డ్రామాను ప్రజలు నమ్మరన్నారు.

అనంతపురం జిల్లా రాయదుర్గంలో ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి వైయస్‌ఆర్ వర్ధంతి సందర్భంగా పార్టీ కార్యాలయం వద్ద మహానేత విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. రోగులకు పండ్లు పంపిణీ చేశారు. గుంటూరు జిల్లా సత్తెనపల్లి మండలం కొమరపూడిలో పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు వైయస్‌ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.

Back to Top