కల్తీ నెపాన్ని రైతులపై నెట్టడం దారుణం

హైదరాబాద్, నవంబర్ 13: హెరిటేజ్ పాలల్లో కల్తీ నెపాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు  రైతులపై నెట్టడం దారుణమని వైఎస్సార్సీపీ శాసనసభాపక్షం కో-ఆర్డినేటర్ గడికోట శ్రీకాంత్ రెడ్డి ధ్వజమెత్తారు. రైతులు తమ గేదెల నుంచి అమృతాన్ని హెరిటేజ్ సంస్థకు అప్పగిస్తే ప్యాకింగ్ సందర్భంగా వాటిలో విషం కలిస్తే అందుకు బాధ్యత రైతులదవుతుందా? అని ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

శ్రీకాంత్ రెడ్డి గురువారం పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. హెరిటేజ్ పాలల్లో విష పదార్థాలున్నాయని చెబితే తమకు గేదెలు లేవని రైతుల నుంచే పాలను సేకరిస్తున్నామని చెప్పడంలో అర్థమేమిటని ప్రశ్నించారు. విష పదార్థాలున్నాయని ఎవరైనా చెబితే హెరిటేజ్ పాలల్లో అలాంటివి లేవని నాణ్యతా పరీక్షలు నిర్వహించి సర్టిఫికెట్ పొంది ప్రజలకు చెప్పాలే గాని, ఆ నెపాన్ని రైతులపై తోసివేయకూడదని ఆన్నారు. చంద్రబాబుకు తన వైఫల్యాలను ఇతరులపై నెట్టడం అలవాటేనని విమర్శించారు. 'పాల్మాలిన్' అనే పదార్థం హెరిటేజ్ పాలల్లో ఉన్నందువల్లే నిషేదిస్తున్నట్లు కేరళ ప్రభుత్వం తన గెజిట్ లో ప్రకటించిందని వెల్లడిస్తూ దాని ప్రతిని విలేకరులకు చూపించారు. హెరిటేజ్ పాలల్లో కేన్సర్ కారకాలు లేనే లేవని చెప్పడం కన్నా థర్డ్ పార్టీ నిపుణులతో వాటిని పరీక్షింపజేసి, ఆ పాలు ఆరోగ్యరీత్యా సురక్షితమైనవేనని ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు.

మార్కెట్ లో అన్ని రకాల ఆహారపదార్థాల్లోను విపరీతంగా కల్తీ జరుగుతుందని, దీనివల్ల ప్రజల ఆరోగ్యానికి తీరని హాని కలుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. కల్తీ, విషపూరిత ఆహార పదార్థాలు తీసుకోవడంవల్ల నరాల బలహీనత, కేన్సర్ వంటి రోగాలు వస్తాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో తమ పార్టీ అధికార ప్రతినిధి హెరిటేజ్ పాలల్లో విషపదార్థాలున్నాయని కేరళ ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ ప్రస్తావిస్తూ ప్రకటన చేస్తే ఆయనపై పరువు నష్టం దావా వేశారని గుర్తుచేశారు. తెలంగాణ అసెంబ్లీలో కూడా హెరిటేజ్ పాలల్లో కల్తీ ఉందనే చర్చ వచ్చిందని చెప్పారు. ప్రజల ఆరోగ్యం కన్నా తన కుమారుడి వ్యాపారం బాగుంటే చాలని చంద్రబాబు భావిస్తున్నారని విమర్శించారు.

సింగపూర్, మలేసియాల సందర్శనకు వెళుతున్న చంద్రబాబు ఆయా దేశాల్లో ఆహార పదార్థాల్లో కల్తీ జరిగితే ఎలాంటి శిక్షలు విధిస్తారో కూడా తెలుసుకుంటే మంచిదని సూచించారు. ఒక్క హెరిటేజ్ సంస్థవే కాదు, మార్కెట్ లో ఉన్న అన్ని రకాల బ్రాండ్ల ఆహార పదార్థాలపైనా ఇదే విధమైన తనిఖీ నిర్వహించి వాటిలో ఎలాంటి కల్తీ లేదని, విషపూరితాలు లేవని సర్టిఫికెట్లు ఇవ్వాలని సూచించారు. తాము ఎవరిమీదనో బురదజల్లే ఉద్దేశ్యంతోనో, రాజకీయ లబ్ది కోసమో ఈ అంశాలు చెప్పడం లేదని ఒక ప్రధాన ప్రతిపక్షంగా ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ విషయాలు చెబుతున్నామని ఆయన తెలిపారు.

తాజా వీడియోలు

Back to Top