వైయస్‌ఆర్‌కు డెట్రాయిట్‌లో నివాళులు

డెట్రాయిట్‌ :‌ దివంగత ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి, మహానేత డాక్డర్ వైయస్‌ రాజశేఖరరెడ్డి తృతీయ వర్ధంతిని పురస్కరించుకుని డెట్రాయిట్‌లో ఆయనకు ప్రవాసాంధ్రులు పుష్పాంజలి ఘటించి నివాళులు అర్పించారు. మిచిగాన్‌ రాష్ట్రంలోని ఫార్మింగ్టన్̤లో సెప్టెంబర్‌ 7వ తేదీన వైయస్‌ఆర్‌ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన వారు దివంగత నేత చిత్రపటం వద్ద జ్యోతి వెలిగించి, పుష్పాంజలి ఘటించారు. అనంతరం ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కొద్దిసేపు మౌనం పాటించారు.

డెట్రాయిట్‌లోని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి మద్దతుగా ఉన్న ప్రవాసాంధ్రులు ఒక్కచోట చేరి తమ ప్రియతమ నాయకుడు వైయస్‌ హయాంలో కొనసాగిన స్వర్ణయుగం స్మృతులను నెమరువేసుకున్నారు. వైయస్‌ రూపొందించి, అమలు చేసిన ప్రజా సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల గురించి గుర్తు చేసుకున్నారు.

లింగాల హరిప్రసాద్‌రెడ్డి, వినోద్‌ కుకునూర్‌, వెంకట్‌ బీరం, సునీల్‌ మండుటి, శివరామ్‌ యార్లగడ్డ, యుగంధర్‌ భూమిరెడ్డి, పురుషోత్తం కూకటి, వినోద్‌ ఆత్మకూరి, శ్రీనివాస్‌ చిత్తలూరి, జగన్‌ కొండా, శ్రీనివాస్‌రెడ్డి పిడపర్తి, రవి కిరణ్‌, నాగేందర్‌ గాలి, విద్యాధర్‌ భూజల, వేణు కాగితాల, శేఖర్‌ పంగారు, శ్రీనివాస్‌ బర్ల, కొండారెడ్డి తొట్టిరెడ్డి, రమణారెడ్డి పటేలు, సుధీర్‌ తదితరులు వైయస్‌ తృతీయ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు.

ప్రజల సంక్షేమం కోసం వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ గడచిన ఏడాది కాలంగా నిర్వహించిన పోరాటాలను ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఆంధ్ర రాష్ట్ర ప్రజలది అని, పేదల అభ్యున్నతి కోసం దివంగత జననేత డాక్టర్‌ వైయస్‌ ప్రారంభించిన అన్ని సంక్షేమ పథకాలను కొనసాగించాలని, ప్రతిష్టాత్మకంగా ఆయన చేపట్టిన చిరస్థాయిగా నిలిచే పథకాలను పూర్తి చేయాలన్న లక్ష్యంతో వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఏర్పాటైందని ఈ సందర్భంగా వక్తలు పేర్కొన్నారు. రాష్ట్రం అభివృద్ధి పథంలో పయనించాలంటే జగన్మోహన్‌రెడ్డికి మద్దతుగా నిలవాల్సిన ఆవశ్యకత ఉందని పలువురు స్థానిక వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకులు, సభ్యులు తెలిపారు. ప్రియతమ నాయకుడు వైయస్‌ ప్రారంభించిన సంక్షేమ పథకాల అమలు కోసం జగన్ అలుపెరుగని పోరాటం‌ చేస్తున్నారని, చైతన్యవంతుడు, యువకుడైన జగన్మోహన్‌రెడ్డికి ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు బాసటగా నిలుస్తారన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. అస్తవ్యస్థంగా మారిన ఆంధ్రప్రదేశ్‌కు వైయస్‌ నాటి స్వర్ణ యుగాన్ని జగన్మోహన్‌రెడ్డి నాయకత్వంలో తీసుకు రాగలరన్న విశ్వాసాన్ని ప్రజలు పెట్టుకున్నారని వారు పేర్కొన్నారు. దివంగత మహానేత పేరు మీద సమీప భవిష్యత్తులో ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించాలన్న ప్రణాళికకు ఈ సందర్భంగా డెట్రాయిట్‌ వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకులు ఒక రూపం ఇచ్చారు.
Back to Top