కృష్ణాజిల్లా : మచిలీపట్నం నగరపాలక సంస్థ పరిధిలో పారిశుద్ధ్య పరిస్థితులు అధ్వానంగా మారాయని వైయస్ఆర్‌సీపీ మచిలీపట్నం నియోజకవర్గ ఇన్‌చార్జి పేర్ని కిట్టు మండిపడ్డారు. చెత్త సేకరణకు ఉపయోగించే క్లాప్ వాహనాలను వారం రోజులుగా డిపోలకే పరిమితం చేయడంతో నగరంలో చెత్త పేరుకుపోయి ప్రజారోగ్యం ప్రమాదంలో పడుతోందని పేర్కొన్నారు. నిధుల మంజూరు ప్రక్రియను సాకుగా చూపి క్లాప్ వాహనాల సేవలను నిలిపివేయడం వల్ల సుమారు 50 మంది కాంట్రాక్టు కార్మికుల ఉపాధిపై ప్రభావం పడుతోందని తెలిపారు. మంత్రి కొల్లు రవీంద్ర నిర్లక్ష్యంతో బందరు మురికికూపంగా మారుతున్న పరిస్థితి ఏర్పడిందని పేర్కొన్నారు. కష్టపడి పనిచేసే పారిశుద్ధ్య కార్మికులను ఇబ్బందులకు గురిచేయకుండా, వెంటనే క్లాప్ వాహనాలను అందుబాటులోకి తీసుకురావాలని పేర్ని కిట్టు కోరారు. మున్సిపల్ కమిషనర్ తక్షణమే స్పందించి పారిశుద్ధ్య పనులను గాడిలో పెట్టకపోతే ప్రజల తరఫున నిరసనలు చేపడతామని స్పష్టం చేశారు.