వలస కార్మికుల కోసం నగరాల్లో అద్దె ఇళ్ళ సముదాయాలు

రాజ్యసభలో ఎంపీ వి.విజయసాయి రెడ్డి ప్రశ్నకు మంత్రి జవాబు

న్యూఢిల్లీ : వలస కార్మికులు, అల్పాదాయ వర్గాలు, నిరుపేదల కోసం కేంద్ర ప్రభుత్వం అద్దె ఇళ్ళ సముదాయాలు నిర్మించే పథకాన్ని ప్రారంభించినట్లు గృహ నిర్మాణ శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి బుధవారం రాజ్యసభలో వెల్లడించారు. వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు వి.విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి జవాబిస్తూ కార్మికులతోపాటు వీధుల్లో విక్రయాలు జరిపేవారు, రిక్షా కార్మికులు, సేవ రంగంలో పని చేసే కార్మికులు, పారిశ్రామిక కార్మికులు, మార్కెట్లు, వాణిజ్య సంస్థల్లు, విద్యా, ఆరోగ్య, హోటల్ రంగాలలో పని చేస్తున్న వారంతా ఈ పథకం కింద లబ్ది పొందుతారని చెప్పారు.
అద్దె ఇళ్ళ సముదాయాల్లో నివసించే కార్మికులకు వాటిని నిర్వహించే యజమానులకు మధ్య కొన్ని నియమ నిబంధనలకు లోబడి ఒప్పందం చేసుకోవలసి ఉంటుందని మంత్రి తెలిపారు. అద్దె గృహ సముదాయలలో వాటి నిర్వహణ బాధ్యతలు చూసే ఏజెన్సీ షరతుల మేరకు వసతి అలాట్‌మెంట్‌ జరుగుతుంది. అద్దె గృహ సముదాయాలు నిర్మించే కంపెనీ స్థానిక పరిశ్రమలు, సర్వీసు ప్రొవైడర్లు, ఇతర సంస్థలతో ఒప్పందం చేసుకోవలసిందిగా ప్రభుత్వం సూచించినట్లు చెప్పారు. దీని వలన అద్దె వసూళ్ళలో అవరోధాలు నివారించే అవకాశం ఉంది.

ఉపాధి కోసం పట్టణాలకు వలస వచ్చేకార్మికులు కోసం చౌకగా అద్దె వసతి కల్పించే ఉద్దేశంతో ప్రారంభించిన ఈ పథకాన్ని రెండు మోడళ్ళుగా చేపట్టనున్నారు. మొదటిది...జేఎన్‌యూఆర్‌ఎం, రాజీవ్‌ ఆవాస్‌ యోజన పథకాల కింద ప్రభుత్వ నిధులతో నిర్మించి సిద్ధంగా ఉన్న నివాసాలను 25 ఏళ్ళపాటు అద్దె గృహ సముదాయాల కింద మార్చడం. సొంతంగా భూమి కలిగి ఉండి వాటిలో గృహ సముదాయాలు నిర్మించి, నిర్వహించడానికి ఆసక్తి కలిగిన ప్రభుత్వ, ప్రైవేట్‌ సంస్థల నుంచి దరఖాస్తులు ఆహ్వానించడం రెండో మోడల్ అని మంత్రి తెలిపారు. రెండో మోడల్‌ గృహ సముదాయాల నిర్మాణానికి ప్రధాన మంత్రి ఆవాస్‌ యోజన్‌ - అర్బన్‌ పథకం కింద నిధులను సమకూర్చనున్నట్లు మంత్రి తెలిపారు.

 

ఎంఆర్‌వో సేవల కోసం నూతన విధానం

 దేశంలో పెద్ద ఎత్తున విమాన మరమ్మతులను చేపట్టేందుకు వీలుగా ఈ ఏడాది ఫిబ్రవరిలో ఎయిర్‌పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (ఏఏఐ) నూతన విధానాన్ని ఆవిష్కరించినట్లు రాజ్యసభలో బుధవారం వైయ‌స్ఆర్ సీపీ పార్ల‌మెంట‌రీ నేత‌  వి.విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు బదులిస్తూ పౌర విమానయాన శాఖ మంత్రి హర్దీప్‌ సింగ్‌ పురి వెల్లడించారు. ఇప్పటి వరకు దేశంలో విమానాల మెయింటెనెన్స్‌, రిపేర్స్‌, ఓవర్‌హాలింగ్‌ (ఎంఆర్‌వో) సేవలు అరకొరగా మాత్రమే ఉండటానికి కారణాలను ఆయన వివరించారు. ఎంఆర్‌వో సేవలపై వసూలు చేసే  అత్యధిక జీఎస్టీ, దేశంలో అంతర్జాతీయ ఆమోదం పొందిన మెయింటెన్స్‌ సౌకర్యాలు  లేమి, విమానాలు లీజు అగ్రిమెంట్లలో ఉండే నిబంధనలు వంటి  కారణాల వలన దేశంలో ఎంఆర్‌వో సేవలు విస్తృతికి అవరోధంగా నిలిచాయని  ఆయన చెప్పారు. ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని గత ఏడాది ఏప్రిల్‌ నుంచి ఎంఆర్‌వో సేవలపై విధిస్తున్నజీఎస్టీని హేతుబద్దం చేయడం జరిగింది. ఏఏఐ ప్రవేశపెట్టిన నూతన ఎంఆర్‌వో విధానంతో రెండేళ్ళ ఈ రంగం పుంజుకుంటుందని ఆయన చెప్పారు. దేశంలో పౌర, సైనిక విమానాల మరమ్మతుల కోసం ఎంఆర్‌వో సేవలను ప్రవేశపెట్టేందుకు హెచ్‌ఏఎల్-ఎయిర్‌ ఇండియా ఇంజనీరింగ్‌ సర్వీసెస్‌ సంయుక్తంగా పని చేయబోతున్నాయి. ఈ మేరకు వాటి మధ్య గత ఫిబ్రవరిలో ఎంవోయూ కుదిరినట్లు మంత్రి తెలిపారు.
అలాగే దేశంలో ఎంఆర్‌వో సేవలను విస్తృతపరిచేందుకు ఎయిర్‌బస్‌, బోయింగ్‌ సంయుక్తంగా జిఎంఆర్‌, ఎయిర్‌ వర్క్స్‌ సంస్థలతో ఒప్పందం కుదుర్చుకున్నాయని చెప్పారు. ఎయిర్‌ ఇండియా ఇంజనీరింగ్‌ సర్వీసెస్‌తో కలిసి ప్రాట్‌ అండ్‌ విట్నే సంస్థ విమాన ఇంజన్‌ మరమ్మతుల సేవలను ప్రారంభించింది. అలాగే నానో ఏవియేషన్‌ సంస్థ చెన్నైలో తొలిసారిగా బోయింగ్‌ 777 విమానాన్ని పూర్తిగా విచ్ఛిన్నం చేసి విడి భాగాలను ఎగుమతి చేసినట్లు ఆయన వివరించారు.
 

Back to Top