పశ్చిమగోదావరి: ఏలూరు ఘటనపై ప్రభుత్వం వెంటనే స్పందించిందని, ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి తక్షణమే స్పందించి స్వయంగా బాధితులును పరామర్శించారని మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు పేర్కొన్నారు. బాధితులకు మెరుగైన చికిత్సను అందించాలని సీఎం అధికారులను ఆదేశించారని తెలిపారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు బాధ్యత లేకుండా ప్రవర్తిస్తున్నారని, ప్రతి విషయాన్ని రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గత టీడీపీ ప్రభుత్వం హయాంలో గుంటూరు జిల్లాలో నీరు కలుషితం అయితే చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏమి చేశారని ఆయన ప్రశ్నించారు. నిత్యం రాజకీయాలు చేయడం చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్ కి మంచిది కాదని హితవు పలికారు. విపత్కర పరిస్థితుల్లో పార్టీలకు అతీతంగా ప్రభుత్వానికి సహకరించకుండా.. బురద చల్లుతున్నారని మంత్రి దుయ్యబట్టారు. ఏలూరు ఘటనపై సీఎం వైయస్ జగన్ ఢిల్లీ నుండి ఎయిమ్స్, పూణే నుంచి వైద్య బృందాలను రప్పించారని, నిపుణులు వచ్చి బాధితుల నుండి శాంపిల్స్ సేకరించారన్నారు. త్వరలో రిపోర్ట్స్ కూడా వస్తాయని మంత్రి శ్రీరంగనాథ రాజు పేర్కొన్నారు.