ఢిల్లీకి చేరుకున్న సీఎం వైయ‌స్ జగన్‌

 న్యూఢిల్లీ: ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి కొద్దిసేప‌టి క్రిత‌మే ఢిల్లీకి చేరుకున్నారు. మంగళవారం మధ్యాహ్నం గన్నవరం విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో బయల్దేరిన ఆయన సాయంత్రం 5 గంటల ప్రాంతంలో దేశ రాజధానిలో అడుగుపెట్టారు. సీఎం వైయ‌స్‌ జగన్‌ ఈరోజు రాత్రి 9 గంటలకు కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాతో భేటీ కానున్నారు. రాష్ట్రంలో వరదలు, తుఫాను నేపథ్యంలో వరద సహాయం చేయాలని కేంద్రాన్ని కోరనున్నారు. పోలవరం ప్రాజెక్టు సవరించిన అంచనాలను ఆమోదించేలా సహకరించాలని అమిత్‌ షాకు విజ్ఞప్తి చేయనున్నారు. వీటితోపాటు రాష్ట్ర పునర్విభజన చట్టంలో అపరిష్కృతంగా ఉన్న సమస్యల పరిష్కారం, రాష్ట్రానికి చెందిన ఇతర అంశాలను అమిత్‌ షా దృష్టికి సీఎం తీసుకెళ్తారని ఆంధ్రప్రదేశ్‌ అధికార వర్గాలు తెలిపాయి. ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌ వెంట ఎంపీలు విజయసాయిరెడ్డి, మిథున్‌రెడ్డి, అవినాష్‌రెడ్డి ఉన్నారు.

Back to Top