అభిమానం.. ఆకాశమంత 

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి ప్రజల్లో అమితాదరణ 

 

కిలోమీటర్ల కొద్దీ వెన్నంటి వస్తున్న వీరాభిమానులు 

జిల్లాలు దాటి ఎండా, వాన లెక్క చేయకుండా ప్రయాణం 

పగలూ, రాత్రి తేడా లేకుండా వేచిచూస్తున్న అవ్వాతాతలు 

చిందులు వేస్తూ ఉత్సాహపరుస్తున్న యువత 

వేలాది బైకులతో భారీ ర్యాలీలు 

గజమాలల పరిమాణం దాటి క్రేన్లు వాడాల్సిన పరిస్థితి 

టన్నుల కొద్దీ పూలతో సీఎంకు భారీ దండలు, గజమాలలు

భారీ కటౌట్లు, ఫ్లెక్సీలు, బాణ సంచాలతో అఖండ స్వాగతాలు 

మేమంతా సిద్ధం బస్సు యాత్రలో అడుగడుగునా అపురూప దృశ్యాలు 

 

ఈ చిత్రంలో ఒంటిమీద వైఎస్సార్‌సీపీ రంగు దుస్తులు.. బైక్‌ మొత్తం వైఎస్సార్‌సీపీ జెండాలతో కనిపిస్తున్న ఈ వ్యక్తి పేరు.. రామిరెడ్డి అమరనాథ్‌ రెడ్డి. మండుటెండలో కాలికి చెప్పులు కూడా లేకుండా వైఎస్సార్‌సీపీ జెండా రంగులతో ఉన్న హెల్మెట్‌ పెట్టుకుని, మోటార్‌ సైకిల్‌కు మైక్‌ను కట్టుకుని, వైఎస్సార్‌సీపీ ప్రచార గీతాలను వినిపిస్తూ వేల కిలోమీటర్లు ‘మేమంతా సిద్ధం’ బస్సుయాత్రతో పాటు ప్రయాణిస్తున్నాడు. ఎందుకిదంతా అంటే.. జగనన్న అంటే ప్రాణమని తెలిపాడు. ఆయన కోసం విశాఖ ఫార్మా కంపెనీలో రూ.40 వేలు జీతం వచ్చే ఉద్యోగాన్ని వదిలిపెట్టానన్నాడు. అంతేకాకుండా ఏడాదిన్నర పాపతోపాటు కుటుంబానికి దూరమైనా సంతోషంగా జగనన్న వెంట నడుస్తున్నానని చెబుతున్నాడు. జగన్‌ మళ్లీ సీఎం అయ్యేంత వరకూ తాను కాలికి చెప్పులు ధరించనని దీక్ష పూనానని అంటున్నాడు. తన వాహనాన్నే ప్రచార రథంగా మార్చి దానికి రెండు వైపులా ‘బలవంతుడికి.. బలహీనుడికి జరిగే యుద్ధం’ అనే వ్యాఖ్యతో ఉన్న స్టిక్కర్‌ను అతికించుకుని తిరుగుతున్నాడు. అమరనాథ్‌ రెడ్డి 2014, 2019 ఎన్నికల్లోనూ, ఇటీవల జరిగిన సిద్ధం సభల్లోనూ ఇదేవిధంగా పాల్గొని ప్రచారంలో తన వంతు పాత్ర పోషించాడు. తన జీవితం జగనన్నకే అంకితమని, ఇడుపులపాయ నుంచి ఇచ్ఛాపురం వరకూ బస్సుయాత్రలో తన బైక్‌ యాత్ర కూడా కొనసాగుతుందని అభిమానాన్ని చాటుకున్నాడు.  

 

 ఇలా ఒక్క అమరనాథ్‌ రెడ్డి మాత్రమే కాదు.. ‘మేమంతా సిద్ధం’ అంటూ రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన బస్సుయాత్రలో ఇలాంటి వారు అడుగడుగునా కనిపిస్తున్నారు. ప్రజలు ఒక వ్యక్తిని మనస్ఫూర్తిగా అభిమానిస్తే.. గుండెల్లో గుడికట్టేస్తారనడానికి నిదర్శనంగా నిలుస్తున్నారు. గుంటూరు జిల్లా పాత మంగళగిరికి చెందిన పండ్ల వ్యాపారి శ్రీనివాసరావు తన ద్విచక్ర వాహనంపై భార్య, కుమార్తెను ఎక్కించుకుని, ఆ బైక్‌ మొత్తం వైఎస్సార్‌సీపీ జెండాలను కట్టుకుని బస్సుయాత్రలో పాల్గొన్నారు. మరి కొందరు కార్లతో యాత్ర ప్రారంభం నుంచి చివరి వరకూ వచ్చేలా ఏర్పాట్లు చేసుకున్నారు.

రోజుల తరబడి, జిల్లాలు దాటి, ఎండా, వాన లెక్క చేయకుండా, వ్యయప్రయాసలను పట్టించుకోకుండా వేలాది కిలోమీటర్ల మేర సీఎం జగన్‌ వెంట ప్రయాణం చేస్తున్నారు. మరోవైపు జననేత తమ ప్రాంతానికి వస్తున్నారని తెలియడం ఆలస్యం.. బస్సుయాత్ర వెళ్లే రహదారికి తమ గ్రామం దూరంగా ఉన్నాసరే అవ్వాతాతలు, అక్కచెల్లెమ్మలు, చిన్నారులు, యువత ప్రతికూల వాతావరణంలోనూ కిలోమీటర్ల కొద్దీ నడిచి వచ్చి జగన్‌కు అఖండ స్వాగతం పలుకుతున్నారు. పసిపిల్లలతో పాటు వచ్చిన తల్లులు, బాలింతలు ఇలా ఒకరేమిటి గంటల తరబడి జగన్‌ను చూసేందుకు నిరీక్షిస్తున్నారు. పగలూరాత్రి తేడా లేకుండా వీధుల్లో పోటెత్తుతున్నారు.  

మమా మాస్‌..  
ఇక యువత అయితే వారి ఉత్సాహం మామూలుగా లేదు. ఓ మాస్‌ హీరోకు ఉన్న దానికంటే వంద రెట్లు ఫాలోయింగ్‌ సీఎం వైఎస్‌ జగన్‌కు ఉందని యువత ఆనందం చూస్తుంటే తెలుస్తోంది. బస్సు యాత్ర మొత్తం ప్రతి చోటా వైఎస్సార్‌సీపీ ప్రచార గీతాలకు ఒళ్లుమరచి యువత ఆనంద తాండవం చేస్తోంది. సినిమా పరంగా తాము ఎవరి ఫ్యాన్‌ అయినప్పటికీ..రాజకీయాల్లో జగన్‌ తమ రియల్‌ హీరో అంటూ బైక్‌ల మీద తమ అభిమాన హీరో ఫొటోతో పాటు సీఎం జగన్‌ ఫొటో స్టిక్కర్లను అతికించుకోవడం విశేషం.

స్థానిక నాయకుల్లోనూ బస్సుయాత్ర నూతన ఉత్తేజాన్ని కలిగిస్తోంది. ఎక్కడికక్కడ సీఎం వైఎస్‌ జగన్‌కు సంప్రదాయం ఉట్టిపడేలా కోలాటాలు, స్టిక్‌ వాకర్స్‌ను ఏర్పాటు చేసి భారీ గజమాలలతో ఘన స్వాగతం పలుకుతున్నారు. ఈ గజమాలలు సాధారణ పరిమాణం దాటి ఉండటంతో వాటిని క్రేన్లతో మోయాల్సి వస్తోంది. సీఎం జగన్‌ బస్సు యాత్ర వెంట వేలాది బైకులతో భారీ ర్యాలీలు చేస్తూ యువత, కార్యకర్తలు, స్థానిక నేతలు సందడి చేస్తున్నారు. 

కొండంత ఆనందం.. 
పల్లెలు, పట్టణాలు అనే తేడా లేకుండా ప్రజలు సీఎం వైఎస్‌ జగన్‌కు అఖండ స్వాగతాలు పలుకుతున్నారు. హారతులు ఇచ్చి దిష్టి తీయడంతోపాటు పూలతో దండలు, పూలాభిషేకాలు చేస్తున్నారు. ప్రతి కూడలిలో జగన్‌ భారీ కటౌట్లు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తూ అభిమానాన్ని చాటుకుంటున్నారు. జగన్‌ తమ గ్రామానికి, వీధికి రాగానే బాణాసంచా కాల్చి ఆనందం వ్యక్తం చేస్తున్నారు. చిన్నారులు, బాలికలు సైతం జగన్‌ మామే మళ్లీ సీఎం కావాలంటూ జెండాలు చేతబట్టి నినదిస్తున్నారు. సీఎం జగన్‌ బస్సు ఆపి తమను పలకరిస్తుంటే ప్రజలు భావోద్వేగానికి గురవుతున్నారు.

ఆయనతో ఫొటో దిగి కొండంత ఆనందాన్ని మూటగట్టుకుంటున్నారు. అన్నా నీ కోసం మా ప్రాణం ఇస్తామంటూ సీఎం వైఎస్‌ జగన్‌కు భరోసా ఇస్తున్నారు. ఆనక ఆ ఫొటోలను తమ వారందరికీ పంపుతున్నారు. అంతేకాకుండా ఫేస్‌బుక్, ఇన్‌స్ట్రాగామ్, ఎక్స్, వాట్సాప్‌ వంటి సోషల్‌ మీడియా మాధ్యమాల్లో షేర్‌ చేస్తున్నారు. కటిక చీకటిని.. జోరున కురిసే వర్షాన్ని..మండుతున్న ఎండను కూడా లెక్కచేయకుండా తమ అభిమాన నేతకు జననీరాజనం పలుకుతున్న ఇలాంటి అపురూప దృశ్యాలు సీఎం జగన్‌ను ప్రజలు ఎంతగా ఆరాధిస్తున్నారో చెప్పడానికి నిలువెత్తు నిదర్శనాలని రాజకీయ విశ్లేషకులు చెబుతుండటం విశేషం.  

Back to Top