శ్రీమతి వైయస్ విజయమ్మ గారు

Designation: 
గౌరవ అధ్యక్షులు
Location: 
పులివెందుల

ప్రతి పురుషుడి విజయం వెనుక ఓ మహిళ ఉంటుంది. ఇది వైయస్ విజయమ్మ విషయంలో అక్షర సత్యం. మృదు భాషి. నిగర్వి అయిన విజయమ్మ డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డికి అన్ని విధాల అనుకూలంగా మసలుకునేవారు. కోట్లాది తెలుగు ప్రజలు ఆరాధ్య దైవంగా భావించిన వైఎస్ విజయం వెనుక ఆమె మద్దతు ఎంతో ఉంది. క్షణం తీరిక లేని కార్యక్రమాలతో పోరాట యోధుడిలా గడిపే వైయస్­కు తన శాంత చిత్తంతో ఆమె ఎంతో స్ఫూర్తినిచ్చారు.

చెదరని చిరునవ్వుకు ఆమె చిరునామా. రాజశేఖరరెడ్డి రాజకీయ కార్యక్రమాలలో తీరిక లేకుండా ఉంటే విజయమ్మ ఇంటి వ్యవహారాలు సమర్థంగా నిర్వహించేవారు. శ్రద్ధగా అన్ని అంశాలనూ చక్కబెట్టుకుంటూ ఆయనకు ఆలంబనగా నిలిచారు. 2000 సంవత్సరంలో అధికారంలో ఉన్న తెలుగు దేశం పార్టీ విద్యుత్తు చార్జీలను పెంచడాన్ని నిరసిస్తూ వైఎస్ఆర్, ఇతర ఎమ్మెల్యేలు నిరాహార దీక్షకు దిగినపుడు విజయమ్మ వారికి సంఘీభావంగా ఇంటిలో ఆహారం తీసుకోకుండా గడిపిన విషయం చాలామందికి తెలీదు.

ఆతిథేయ పాత్ర పోషణలో ఆమె ఎంతో పరిణతి కనబరిచారు. పులివెందులలోని తమ ఇంటికి వివిధ కారణాలతో విచ్చేసే సందర్శకులను చక్కగా ఆదరించేవారు. పార్టీ కార్యక్రమాలలో వైఎస్ఆర్ తలమునకలై ఉన్నప్పుడు ఇంటికి వచ్చే అతిథులను తల్లిలా ప్రేమగా చూసేవారు.ప్రతి పాదయాత్ర కార్యక్రమానికి ముందు ఆమె వైఎస్ఆర్­ నుదుట తిలకం దిద్దడం ఆచారంగా మార్చుకున్నారు.

వైఎస్ఆర్ కన్నుమూత నేపథ్యంలో చోటుచేసుకున్న పరిణామాలు ఆమె జీవితంలో కఠిన పరిస్థితులను ఆవిష్కరించాయి. కాంగ్రెస్ కోసం జీవితాన్ని ధారవోసిన వైఎస్ఆర్ జ్ఙాపకాలను చెరిపివేయడానికీ, ఆయన సాధించిన ఘనతను కాంగ్రెస్ తనదిగా చేసుకోవడానికీ ప్రయత్నించినపుడు విజయమ్మ రంగంలోకి దిగారు. స్వయంగా ఢిల్లీ వెళ్ళారు. సోనియా గాంధీని కలిశారు. వైఎస్ జగన్­ను ఓదార్పు యాత్రకు వెళ్ళనివ్వాలని విజ్ఙప్తి చేశారు. వైఎస్ మరణానంతరం ఆ బాధను భరించలేక ప్రాణాలొదిలిన వారి కుటుంబాలను ఓదార్చడాన్ని జగన్ తన బాధ్యతగా భావించారనీ, ప్రజలు ఆయనను తమ రక్షకుడిగా భావిస్తున్నారనీ ఆమె సోనియాకు విన్నవించారు.

తన మాటలు చెవిటివాని ముందు శంఖం ఊదినట్లయ్యిందని గ్రహించిన విజయమ్మకు ఇది తమకు సమరానికి సన్నద్ధం కావాల్సిన సమయమనే విషయం అవగతమైంది. వైఎస్ఆర్ సన్నిహితులు, అనుచరులకు భవిష్యత్తు అగమ్యగోచరంగా కనిపించింది. ప్రజా జీవితంలో ఏమాత్రం అనుభవం లేని విజయమ్మ తన వాణిని ఏ విధంగా వినిపించగలరోననే వారి అనుమానాలు ఆమె ప్రసంగాలతో పటాపంచలయ్యాయి. ఆమె మాటలలో తన మనసును ఆవిష్కరించారు. పులివెందుల ఉప­ఎన్నికలో ఆమె విజయంతో మహోన్నతమైన నాయకత్వం వెల్లడయ్యింది. వైఎస్ సాధించిన ఓట్ల ఆధిక్యతను సైతం ఆమె అధిగమించారు. అప్పటినుంచి ప్రజా సమస్యలను, రైతు కష్టాలనూ తీర్చేందుకు ఆమె ముందున్నారు. ప్రస్తుతం ఆమె పులివెందులకే కాక వైయస్­ఆర్ సీపీకి కూడా మూల స్తంభంలా నిలిచారు.

Back to Top