నాయుడూ నాయుడూ రాసుకుంటే..!

నాయుడూ నాయుడూ  రాసుకుంటే..!
----------------------------
పట్టువదలని విక్రమార్కుడు ఉస్సూరు మంటూ  వచ్చాడు.
విక్రమార్కుని అల్లంత దూరం నుంచి చూడగానే  బేతాళుడు నవ్వాపుకోలేకపోయాడు.
ఏంటి విక్రమార్కా   అలా నల్లబొగ్గైపోయావు. ఏంటి అంత నీరసంగా ఉస్సూరు మంటూ వస్తున్నావు. ఏమైందేంటి? అని ఆరా తీశాడు.
దానికి విక్రమార్కుడు గట్టిగా ఊపిరి తీసుకుని..ఏం చెప్పమంటావు బేతాళా  ఎండలు ఎలా ఉన్నాయనుకున్నావు? ఒంట్లోని నీరంతా ఆవిరైపోయినట్లు..నీరసం కమ్మేసిందయ్యా బాబూ అని చెప్పి తనతో పాటు తెచ్చుకున్న నీళ్ల సీసా ఎత్తి గడ గడ నాలుగు గుక్కలు తాగి సేదతీరాడు.

బేతాళుడు మరో సారి నవ్వేసి సర్లే కానీ మరి కథ మొదలు పెడతాని జాగ్రత్తగా విని ఆ తర్వాత నేనడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పు   అంటూ కథ మొదలు పెట్టాడు.
"విక్రమార్కా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర విభజన సమయంలో  ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని కాంగ్రెస్ అంది. పదేళ్ల పాటు ప్రత్యేక హోదా కావాలని బిజెపి నేత వెంకయ్యనాయుడు గట్టిగా డిమాండ్ చేశారు. అబ్బే పదేళ్లు ఎక్కడ సరిపోతుంది?  కనీసం పదిహేనేళ్లయినా ప్రత్యేక హోదా కావలసిందే అని టిడిపి నేత చంద్రబాబు నాయుడు అన్నారు. ఏపీలో టిడిపి బిజెపి కలిసి ఎన్నికల పొత్తు పెట్టుకుని పోటీ చేశాయి.తమని గెలిపిస్తే కేంద్రం నుంచి ప్రత్యేక హోదా తెస్తామని చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు.కేంద్రంనుంచి ఏపీకి కావలసినవన్నీ తెస్తానని వెంకయ్య నాయుడు హామీ ఇచ్చారు. ఇద్దరు నాయుళ్ల మాటలూ నమ్మి తెలుగు ప్రజలు వారిని గెలిపించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ ఏపీకి ప్రత్యేక హోదా సాధించి తీరతామని వెంకయ్యనాయుడు అన్నారు. బిజెపి ప్రత్యేక హోదా ఇస్తుందని చంద్రబాబు నాయుడూ భరోసా వ్యక్తం చేశారు. రెండేళ్లుగా ప్రత్యేక హోదా గురించి ఈ ఇద్దరు నాయుళ్లూ   జనానికి అరచేతిలో స్వర్గం చూపిస్తూనే  వచ్చారు. ఇపుడు కేంద్రప్రభుత్వంలోని ఓ మంత్రి పార్లమెంటు సాక్షిగానే ఏపీకి ఏది కావాలంటే అది చేస్తున్నాం కదా..ఇక ప్రత్యేక హోదా ఎందుకయ్యా? అని  ప్రశ్నించి బాంబు పేల్చారు.

అంటే కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక హోదా ఇవ్వకూడదని డిసైడ్ అయిపోయిందా అన్న అనుమానం వస్తోంది. ఇంతకాలం జనాన్ని నమ్మించిన చంద్రబాబు నాయుడు కానీ..వెంకయ్యనాయుడు కానీ  ఇపుడు  కేంద్ర మంత్రి వ్యాఖ్యను ఖండించడం లేదు. పోనీ తమకుగా తామైనా ప్రత్యేక హోదా తెస్తామని భరోసా ఇవ్వడం లేదు. ఇద్దరూ  ఏమీ తెలీనట్లుగా తమ తమ పనుల్లో బిజీగా ఉన్నారు. అసలు వెంకయ్యనాయుడు..చంద్రబాబు నాయుళ్ల మనసుల్లో ఏముంది? ఏపీకి ప్రత్యేక హోదా వస్తుందనిపిస్తోందా లేదా? ప్రత్యేక హోదా రాదని తెలిసిన తర్వాత కూడా ఇద్దరు నాయుళ్లూ ఎందుకు నోరు మెదపడం లేదు? ఈప్రశ్నలకు సమాధానాలు తెలిసీ కూడా చెప్పకపోయావా నీ తల వెయ్యి చెక్కలైపోతుంది" అని బేతాళుడు అల్టిమేటంతో కథ ముగించాడు.

విక్రమార్కుడు  కర్చీఫ్ తీసుకుని ఓ సారి మొహం తుడుచుకుని  చెప్పడం మొదలు పెట్టాడు.
"బేతాళా నువ్వన్నట్లు చంద్రబాబు నాయుడు..వెంకయ్యనాయుడు ఇద్దరూ కూడా ఎన్నికల్లో ప్రత్యేక హోదా తెస్తామని  ఎక్కడికెళ్తే అక్కడ హామీలు ఇచ్చారు. ఇపుడేమో ప్రత్యేక హోదా రాదని తెలిసీ కూడా ఇద్దరూ ప్రశాంతంగా ఉన్నారు. దానికి కారణం మరేం లేదు. ఎన్నికల్లో జనం ఓట్లు కావాలి. అవి ఊరికే వచ్చి పడవు కదా. అందుకే ప్రత్యేక హోదా హామీ ఇచ్చారు. ఏరు దాటే వరకే కదా తెప్పతో పని. ఏరు దాటేశాక  తెప్పను తగలేసినా నష్టం లేదనేది ఇద్దరు నాయుళ్ల అభిప్రాయం.అందుకే అధికారంలోకి రాగానే వాళ్లిచ్చిన హామీని బుట్టలో పారేశారు. జనం ఆకాంక్షలను గాలికి వదిలేశారు. ఇక ఇపుడు మరో మంత్రే ప్రత్యేక హోదా ఎందుకు? అని అడిగినా ఈ ఇద్దరూ మాట్లాడ్డం లేదేం అని అడుగుతున్నావు. వాళ్లేం మాట్లాడతారు? అసలు చంద్రబాబు నాయుడికి క్షణం తీరిక లేదు. ఎదుటి పార్టీ ఎమ్మెల్యేలకు ఎన్ని కోట్లు ఇవ్వాలి? ఎలా కొనుక్కోవాలి? అన్న వ్యవహారంతోనే చంద్రబాబుకు  తీరిక లేకుండా పోయింది. ఇక వెంకయ్యనాయుడంటావా? ఆయన తెల్లారి లేస్తే చంద్రబాబు నాయుడు ఇంద్రుడంతటి వాడు..చంద్రుడంతటి వాడు అని పొగడ్డమే సరిపోతోంది. ఇక  ప్రత్యేక హోదా గురించి..ఏపీ ప్రజల గురించి ఆలోచించే  తీరిక ఆయనకు ఎక్కడిది? ఇంకోటేంటంటే..ఇప్పటికిప్పుడు ఎన్నికలు పెడితే  జనం తమకి కచ్చితంగా ఓటేయరని ఇద్దరికీ అర్ధమైపోయింది. వచ్చే ఎన్నికల్లో ఎలాగూ గెలవం కాబట్టి.. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలని ఇద్దరూ చూస్తున్నారు. అందుకే జనాన్ని పక్కన పెట్టేసి..వారికిచ్చిన హామీలను తుంగలో తొక్కేసి ఇద్దరు నాయుళ్లూ ఒకళ్ల వీపు ఒకళ్లు గోక్కుంటూ కాలక్షేపం చేస్తున్నారు" అని  విక్రమార్కుడు ముగించాడు.
విక్రమార్కుడి సమాధానంతో సంతృప్తి చెందిన బేతాళుడు అమాంతం విక్రమార్కుడి భుజాలపై నుండి మాయమై తిరిగి చెట్టుకు వేలాడాడు.
Back to Top