<br/>ఆంధ్రప్రదేశ్ లో ఏమూల ఏ ఘోరం జరిగినా దాన్ని ప్రతిపక్ష పార్టీకి, ఆ పార్టీ అధినేతకు అంటగట్టాలని ముందే ప్రయత్నం చేస్తుంది టిడిపి ప్రభుత్వం. స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబే ఈ విషయంలో ముందు వరసలో ఉంటారు. నిన్నిటి కిడారి, సోమలను మావోలు హత్యలచేసినప్పుడు కూడా చంద్రబాబు ఇచ్చిన స్టేట్మెంట్ ఇదే. ఈ దాడిలో ప్రతిపక్షాల పాత్ర ఉన్నట్టుగా ఆయనకు అనిపించిందట. గతంలోనూ బాబుగారు తుని సంఘటనకు కూడా ప్రతిపక్ష పార్టీనే కారణమంటూ తేల్చేసారు. ఇంటిలిజన్స్, పోలీసులు, దర్యాప్తు సంస్థలు, ప్రత్యక్ష సాక్షులు ఇలా ఎవ్వరి ప్రమేయం లేకుండా బాబుగారే కొన్ని ఘటనలకు కొందర్ని బాధ్యులను చేసిపారేస్తారు. తుని రైలు సంఘటనకు రాయలసీమ నుంచి వచ్చిన రౌడీలే కారణం అని, అదంతా ప్రతిపక్ష పార్టీ చేయించిందని ప్రచారం చేయబోయారు. పోలీసు యంత్రంగాం, దర్యాప్తు తర్వాత నిజాలను నిర్థారించిన తర్వాత బాబు ఆరోపణలన్నీ ఆవాస్తవాలే అని రుజువైంది. ఇప్పుడు అరకు ఎమ్మెల్యేల హత్యోదంతం కూడా మావోల పని అని అధికార వర్గాలు తేల్చాయి. అంతేకాదు అందుకు కారణం కూడా ఎమ్మెల్యేల అనుచరులు, వారికి దగ్గరి వాళ్లు అందించిన సమాచారమే అని బైటపడింది. మాజీ ఎమ్మెల్యే సోమను, కొని తెచ్చుకున్న ఎమ్మెల్యే కిడారిని కలిసి పనిచేసుకోమని పైనుంచి తాఖీదులందాయని ఆ పార్టీ నేతలే చెబుతున్నారు. అందులో పంపకాలు, ఒప్పందాలు ఎన్నో జరిగాయన్నది బహిరంగ సత్యమే. బాక్సైట్ తవ్వకాల గురించే మావోలు ఆరా తీసారన్న వాస్తవాలను ఆ నాయకుల డ్రైవర్లు, గన్ మెన్లు పత్రికలకు, ఛానెళ్లుకు ఎప్పుడో బైటపెట్టేశారు. అయినా సరే చంద్రబాబు మాత్రం పట్టపగలే నిజాలపై ముసుగేసి చీకటి చేయాలని ప్రయత్నిస్తూనే ఉన్నారు. అసలు ప్రభుత్వం, ఎమ్మెల్యేలు చేస్తున్న బాక్సైట్ తవ్వకాల గురించి మావోలు ఈ హత్యలు చేయలేదని, వారి ఉనికిని చాటుకోవడానికే చేసారంటూ ప్రజలను వ్యర్థంగా నమ్మించే ప్రయత్నం చేస్తున్నాడు. కానీ వాస్తవాలు అరకు లోయను దాటి రాష్ట్రమంతా ప్రతిధ్వనిస్తున్నాయి. బాబు బాక్సైట్ దాహానికే ఎమ్మెల్యేలు బలయ్యారన్నది స్పష్టం అవుతూనే ఉంది. దర్యాప్తులోనూ నేతల అనుచరులే వారి సమాచారం మావోలకు సహకరించారని తెలుస్తోంది. ప్రతిపక్షంపై ప్రతిదీ నెట్టేసి వికటాట్టహాసం చేసే చంద్రబాబుకు కిడారి, సోమల హత్యానివేదిక కంగు తినిపించింది. అరకు ఘటనకు బాధ్యులు, బాధ్యత అంతా టిడిపి వైపే వేళ్లు చూపిస్తుండటంతో అవమానభారంతో బాబుతో సహా తెలుగు తమ్ముల్ల ముఖాలన్నీ పచ్చబడుతున్నాయి.