పాలకులు గెలిచారు..ప్రజలు ఓడారు

పట్టువదలని విక్రమార్కుడు మొలలో ఉన్న కత్తిని తీసి చేతిలో పట్టుకుని యథాలాపంగా నడవసాగాడు.
నడుస్తూనే ఏదో ఆలోచిస్తున్నాడు.
అలా ఆలోచనలో పడిపోయి చెట్టుదాకా వచ్చిన సంగతిని కూడా గమనించలేదు.
శవంలోని బేతాళుడు విక్రమార్కుని కేసి చూసి..
"ఏంటి విక్రమార్కా ఎప్పుడూ లేనిది  అంత పరధ్యానంగా ఉన్నావేంటి? ఏం ఆలోచిస్తున్నావు?" అని అడిగాడు.
బేతాళుడి స్వరంతో  స్పృహలోకి వచ్చిన విక్రమార్కుడు
"ఏం లేదు బేతాళా మనుషుల్లో బొత్తిగా మానవత్వం మాయమైపోతోంది.అది తలచుకుంటేనే ఒక పక్క బాధేస్తోంది..మరో పక్క ఈ లోకం ఏమైపోతుందా అని భయమూ వేస్తోంది" అన్నాడు.
"అంతగా  ఆందోళన చెందాల్సిన ఘటన ఏం జరిగిందో చెప్పు" అన్నాడు బేతాళుడు.
"ఏం లేదు బేతాళా ఈ మధ్య నువ్వూ టీవీలు చూస్తున్నావుగా...ఇంద్రాణి ముఖర్జియా కేసు తలచుకుంటేనే ఒళ్లు గగుర్పొడుస్తోంది. ఒక ఆడది. ముగ్గురు మొగుళ్లు. కన్న బిడ్డనే హతమార్చే కర్కశత్వం.కూతుర్నే చెల్లెలిగా పరిచయం చేసే మాయ. షీనా బోరా హత్య కేసు చుట్టూరా ఇంద్రాణి ఎత్తులు ఆమె  వేసిన జిత్తులు చూస్తే వెన్నులోంచి చలి పుడుతోంది బేతాళా.ఇపుడు మా లోకంలో అందరూ ఈ కేసు గురించే మాట్లాడుకుంటున్నారు. నేనూ అదే ఆలోచిస్తూ పరధ్యానంలో వచ్చేశాను.సరేలే ఇక ఆలస్యం ఎందుకు కథ చెప్పేశేయ్ "
అన్నాడు.
బేతాళుడు కథ చెప్పడం మొదలు పెట్టాడు.

"విక్రమార్కా...ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొత్త రాజధాని కోసం కొన్ని నెలలుగా భూములు సమీకరిస్తున్నారు. కొద్ది రోజుల క్రితం భూసేకరణ కోసం కొన్ని గ్రామాల రైతులకు నోటీసులు కూడా జారీ చేశాడు. దాంతో  రైతులు లబో దిబో మన్నారు. మూడు పంటలు పండే తమ భూముల జోలికి రావద్దని వాళ్లంతా మొర పెట్టుకున్నారు. కాళ్లా వేళ్లా పడ్డారు. అయినా మంత్రులు కనికరించలేదు. భూములు సేకరించి తీరతామని స్పష్టం చేశారు.మర్యాదగా భూములు ఇవ్వకపోతే బలవంతంగా గుంజుకుంటామని బెదిరించారు.ఈ తరుణంలోనే ప్రధాన ప్రతిపక్షమైన వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ తో పాటు కమ్యూనిస్టు పార్టీలు..మేథాపట్కర్ వంటి సామాజిక వేత్తలు..ప్రజాసంఘాలు  రైతులకు అండగా నిలిచాయి.
విపక్షాలు ఎంతగా మొత్తుకున్నా భూసేకరణ ఆగదని మంత్రులు..ముఖ్యమంత్రీ కూడా  పంతానికి పోయారు. ఇదంతా జరుగుతుండగానే  టిడిపికి మద్దతుగా ఉన్న జనసేన నేత పవన్ కళ్యాణ్ రాజధాని ప్రాంతానికి వచ్చి భూసేకరణ జరపద్దని అన్నాడు. కొద్ది రోజుల్లోనే ప్రభుత్వం భూసేకరణ పై వెనకడుగు వేసింది. అసలు భూసేకరణ తమ లక్ష్యమే కాదంది. "
అని కథ ముగించాడు బేతాళుడు.
"విక్రమార్కా ఇపుడు చెప్పు. భూసేకరణ జరపద్దంటూ రాజధాని ప్రాంత రైతులు ఎప్పటినుంచో ఆందోళన చేస్తున్నారు. ప్రతిపక్షాలూ పోరాడుతున్నాయి.  ఇపుడు పవన్ కళ్యాణ్ కూడా వద్దని అన్నాడు. ప్రభుత్వం ఆగిపోతాం ..అయితే భూసేకరణ కాదు కానీ భూ సమీకరణ ద్వారా భూములు సంపాదించుకుంటాం అంటోంది. మొత్తం మీద ఈ ఎపిసోడ్ లో గెలిచిందెవరు? ఓడిందెవరు? దీనికి సమాధానం తెలిసీ కూడా చెప్పలేకపోయావో నీ తల వెయ్యి ముక్కలైపోతుంది "అన్నాడు బేతాళుడు.

చాలా కష్టంగా వస్తుందనుకున్న ఎగ్జామ్ పేపర్ చాలా తేలిగ్గా వస్తే సంబరపడిపోయే విద్యార్ధిలా విక్రమార్కుడు హుషారుగా సమాధానం చెప్పడం మొదలు పెట్టాడు.
"బేతాళా రాజధాని కోసం  ప్రభుత్వం వేలాది ఎకరాల భూమని  ఇప్పటికే  స్వాధీనం చేసుకుంది.
తుళ్లూరు మొదలుకొని చుట్టు పక్కల గ్రామాల్లో దాదాపు 30 వేల ఎకరాలు స్వాధీనం చేసుకున్నామని ప్రభుత్వమే చెబుతోంది. ఆ భూములను ల్యాండ్ పూలింగ్ ద్వారా స్వాధీనం చేసుకోడానికి ప్రభుత్వం సిద్ధమైనపుడు అక్కడి రైతులంతా వ్యతిరేకించారు. మా భూములు ఇవ్వం అన్నారు. ఆ టైమ్ లోనూ పవన్ కళ్యాణ్  రాజధాని ప్రాంత గ్రామాలకు వచ్చారు. మీభూములు బలవంతంగా లాక్కుంటే నేను చూస్తూ ఊరుకోనన్నారు.అవసరమైతే రైతుల తరపున ఎంతటి పోరాటానికైనా సిద్ధం అన్నారు. రైతులు నమ్మారు.ఆనందించారు.తీరా పవన్ కళ్యాణ్ హైదరాబాద్ వచ్చి...రైతులంతా స్వచ్ఛందంగా భూములిస్తున్నారు.చంద్రబాబు నాయుడు చాలా మంచి పని చేస్తున్నారు అని మెచ్చుకున్నారు. రైతులు ఆశ్చర్యపోయారు. పవన్ మెచ్చుకోలుతో ప్రభుత్వం వేగంగా భూముల స్వాధీనంలో పడిపోయింది. పేరుకి ల్యాండ్ పూలింగ్. కానీ జరిగేది మాత్రం రైతులన బెదిరించి పోలీసు బలగాలు మోహరించి..భయభ్రాంతులను చేసి..పంటలు వేయడానికి వీల్లేదని హుకుం జారీ చేసి రైతులు లాక్కుంది. పవన్ కళ్యాణ్ రాలేదు. రైతులను ఆదుకోలేదు. ఇపుడు మరి కొన్ని గ్రామాల్లో భూసేకరణ కోసం ప్రభుత్వం నోటీసులు ఇచ్చింది. ఈ సారి ప్రతిపక్షాలు గట్టిగా దాన్ని వ్యతిరేకించడంతో...ప్రభుత్వం..పవన్ కళ్యాణ్ కలిసి ఓ వ్యూహం పన్నాయి. మెజారిటీ భూములను ప్రభుత్వం బలవంతంగా సేకరిస్తే ఏమీ అనని పవన్ కళ్యాణ్ మూడు వేల ఎకరాల సేకరణ సమయంలో ఎంటర్ అయి భూసేకరణ జరపకండని అన్నారు.ప్రభుత్వం వెంటనే దానికి ఒప్పుకున్నట్లు నటించింది. అంటే రైతుల దృష్టిలో పవన్ హీరో అవుతాడు. అటు పవన్ అభిమానుల దృష్టిలో ప్రభుత్వం మంచిదవుతుంది. పవన్ అస్సలు ప్రశ్నించడం లేదన్న  అప ప్రధా పోతుంది. అందుకే  పవన్ రావడం పోవడం..ప్రభుత్వం ప్రకటించడం జరిగిపోయాయి. పైకి భూసేకరణ చేపట్టం అని అన్నా..సమీకరణ ముసుగులో ప్రభుత్వం ఆ భూములను ఎలాగూ లాక్కుంటుంది. అంటే ఈ మొత్తం కథలో పవన్ కళ్యాణ్..చంద్రబాబు నాయుడు గెలిచారు.
ఏం జరుగుతోందో  అర్ధం కాక బిక్కమొగాలేసిన రైతులు  ఓడిపోయారు." అని విక్రమార్కుడు చెప్పగానే బేతాళుడు మాయమై చెట్టుకి వేలాడాడు.
-----------------
-వీర పిశాచి
Back to Top