కావ్...కావ్..కావ్.

తీతువు పిట్ట అరుపులా...ట్విట్టర్ లో కొత్త పోస్ట్ మెరిస్తే చాలు  నెటిజనుల రోమాలు నిక్కబొడుచుకుంటాయి.ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంతటి సూపర్ స్టారే ట్విట్టర్ మీట నొక్కాడంటే ఇక చెప్పేదేముంది.

రెండు తెలుగు రాష్ట్రాలను  ...ఆ మాటకొస్తే యావద్దేశాన్నే పట్టికుదిపేసిన ఓటుకు నోటు కేసు తెరపైకి వచ్చి నెల రోజులు దాటిపోయింది.మేథావులు..  రాజకీయ నాయకులు  నెల రోజులుగా ఈ అంశం పైనే మాటల తూటాలు విసురుతున్నారు.సినీ రంగంతో పాటు  అన్ని రంగాల ప్రముఖులూ ఈ అంశంపైనే చర్చించుకుంటున్నారు.అయితే అసలైన మనిషి మాత్రం ఇంత హంగామా జరుగుతోంటే నోరే మెదపడం లేదు.చెప్పొద్దూ ఆయన  బెల్లంకొట్టిన రాయిలా ఏమీ మాట్లాడకపోవడం నాకైతే అస్సలు నచ్చలేదు. ఎందుకంటే ఆయన మాట్లాడితే రెండు రాష్ట్రాల్లోని తెలుగు ప్రజలంతా ఆసక్తిగా వింటారు. అలాంటి మనిషి మౌనంగా ఉండడం ఏంటి? పైగా  వ్యవస్థలోని  అన్యాయాలను ప్రశ్నించడమే తన లక్ష్యమని చెప్పిన ఆ మనిసి జనసేన పార్టీని పెట్టారు. అధికారం తనకు ముఖ్యం కాదని చెప్పి..చంద్రబాబు నాయుడికీ..బిజెపికీ ఓటెయ్యండ్రా అని  మొన్నటి ఎన్నికల్లో ఊరూ వాడా తిరిగి  ఆయన ప్రచారం చెయ్యబట్టే నేను కూడా టిడిపి-బిజెపి కూటమికి ఓటేశాను.

అటువంటి మనిషి ఓటుకు నోటు కేసుపై మాట్లాడ్డం లేదేట్రా అని నేను బెంగపెట్టుకుంటోన్న టైమ్ లోనే...మా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ట్విట్టర్ లో  పోస్టింగ్ పెట్టేశారు. మరో వారం రోజుల్లో ...ఓటుకు నోటు కేసు తో పాటు..చంద్రబాబు నాయుడు..ఆయన పార్టీ నేతలు ఆరోపిస్తోన్న టెలిఫోన్ ట్యాపింగ్ పైనా..ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిపోయి..దాన్నుంచి తప్పించుకోడానికి  చంద్రబాబు నాయుడు తెరపైకి తీసుకొచ్చిన సెక్షన్ 8 పైనా తన అభిప్రాయాలు చెప్తానని పవన్ కళ్యాణ్ పెట్టారు. హమ్మయ్య. ఇక  తప్పు చేసిన వాళ్లను ఎవరూ రక్షించలేరన్న ఆనందం నన్ను ఉక్కిరి బిక్కిరి చేసేసింది.చంద్రబాబు నాయుణ్ని ఇక పవన్ కళ్యాణ్  ప్రశ్నలతో ఊపిరాడకుండా చేసే సీన్ తలచుకుంటే నాకు తెగ సంతోషం వేసేసింది.ఎమ్మెల్యేకి 5 కోట్లు ఇచ్చి కొనడం నేరం కాదా బాబుగారూ అని చంద్రబాబును బోనులో నిలబెట్టి పవన్ కళ్యాణ్ లాయర్ కోటు వేసుకుని ప్రశ్నిస్తున్నట్లు అనిపించి  మురిసిపోయాను. అన్యాయాన్ని నిలదీసే ఒక్క గొంతు చాలురా నాయనా అనుకున్నాను. అయితే  మా శిష్యుడు గోపాత్రుడు మాత్రం  వెకిలి నవ్వు ఒకటి నవ్వాడు. నాకు ఒళ్లు మండిపోయింది. ఎందుకురా ఆ నవ్వు అని అడిగాను. " ఏం లేదు గురూగోరూ మీరు ఏవేవో ఊహించుకుని నవ్వుకుంటూ ఉంటే నాకూ నవ్వొచ్చిందండి" అన్నాడు.

ఓటుకు నోటు కేసులో తప్పు చేసిన వాళ్ల తాట తీయడానికి మా పవన్ కళ్యాణ్ వస్తున్నాడురా అన్నాను. గోపాత్రుడు మరింత వెకిలిగా నవ్వాడు. నాకు ఒళ్లు మండుకొచ్చింది. ఎందుకు నవ్వావో సరైన కారణం చెప్పకపోయావో నీ తాట నే తీస్తానురా అని  సీరియస్ గానే వార్నింగ్ ఇచ్చాను. గోపాత్రుడు మళ్లీ నవ్వాడు. మీరు ఒఠ్టి అమాయకులండీ గురూగోరూ అన్నాడు. నాకు కోపం పెరిగింది. నేను అమాయకుణ్నయితే నువ్వు మేథావా? అయితే చెప్పరా నువ్వెందుకు నవ్వావో చెప్పు అని రెట్టించాను." మరేం లేదు గురూగోరూ....పవన్ కళ్యాణ్ బాబు  మీరనుకుంటోన్నట్లుగా  ఎవరినీ ప్రశ్నించరండీ బాబూ అన్నాడు.  ఎవరు చెప్పార్రా నీకు అని అనుమానంగా అడిగాను. దీనికి ఒకరు చెప్పాలేటండీ ఆ మాత్రం తెలవదా?  రాజధాని కోసం బూవులు లాక్కుంటోన్నప్పుడు తుళ్లూరువెళ్లిన పవన్ కళ్యాణ్ బాబు ఏటి చెప్పాడండీ అని గోపాత్రుడు అడిగాడు.  చంద్రబాబు ప్రభుత్వం రైతుల బూవులు లాక్కుంటే చూస్తూ ఊరుకోను అన్నాడు కదా అని టకీమని చెప్పాను. గోపాత్రుడు మళ్లీ నవ్వాడు. ఇంకోసారి నువ్వలా వెకిలిగా నవ్వాంటే నాలుక్కోసేస్తా అన్నాను.

అంత కోపం ఎందుగ్గానీ...రైతుల బూవులు లాక్కుంటే మరి పవన్ కళ్యాణ్ ఎందుకు ప్రశ్నించలేదండీ అని అడిగాడు . నా నోట మాట లేదు.  నెమ్మదిగా ప్రశ్నిస్తాడేమోరా అన్నాను. ప్రశ్నించడం మాట అలాగుంచండి..తుళ్లూరు  లో తాట తీస్తా..డొక్క చింపి డోలు కడతా అన్న పవన్ కళ్యాన్ బాబు హైదరాబాద్ వచ్చి ఏటి చేశారండీ అని అడిగాడు గోపాత్రుడు.  ఏం చేశాడో నువ్వే చెప్పు అన్నాను గంభీరంగా.చంద్రబాబు చేస్తున్నదంతా కరెక్టే అన్నాడా లేదా అని గోపాత్రుడు అడిగాడు. నాదగ్గర సమాధానం లేదు.  ఇపుడూ అదే జరుగుద్దండీ బాబూ.  చంద్రబాబునాయుడిగోరి మాటలు ఎవరూ నమ్మడం లేదు కదా..అంచేత రేపు పవన్ కళ్యాణ్ చేత మాట్లాడించి సెక్షన్ 8 ఎందుకు అమలు చేయరు? ఫోన్ ట్యాపింగ్ ఎందుకు చేశారు? ఇది ఏపీ ప్రజలను అవమానించడం కాదా? అని పవన్ కళ్యాన్ చేత అడిగిత్తారండీ. అక్కడితో ఈ సినిమా అయిపోద్దండి. అన్నాడు గోపాత్రుడు.

అవడానికి గోపాత్రుడు నా శిష్యుడే కానీ..వాడికి లోక జ్ఞానం ఎక్కువ.

చూడ్డానికి మట్టి బుర్రలా కనిపిస్తాడే కానీ..నా కన్నా వాడికే లోకం పోకడ బాగా తెలుసు.

గోపాత్రుడు  అన్న మాటలకి నేను సమాధానం చెప్పలేకపోయాను.

అదే ఆలోచిస్తూ ఉండిపోయాను. నాక్కూడా నేను సమాధానం చెప్పుకోలేకపోతున్నాను.

గోపాత్రుడు చెప్పిందే నిజవా?

--------------

-కవి కాకి
Back to Top