ఆంధ్ర‌ప్ర‌దేశ్ విదేశాంగ మంత్రి బాబు

'తెలుగదేల‌య‌న్న‌దేశంబు తెలుగేను...' అంటూ ఎన్టీఆర్ త‌న‌దైన శైలిలో చెబుతూనే
ఉండేవారు. సాహిత్యం తెలిసిన వారికి ఆ మాట శ్రీ‌కృష్ణదేవ‌రాయలుది అని తెలుసు. అది
తెలియ‌ని వారికి ఎన్టీఆర్ మాట‌గానే ప్ర‌చారం పొందింది. ఏమాట‌కామాట ఒప్పుకోవాలి. ద‌క్షిణాదిలో
తెలుగు వారికి మ‌ద్రాసీలుగానే బ‌య‌ట ప్ర‌పంచంలో ముద్ర‌. అలాంటిది తెలుగు వారికి ఒక
ఉనికిని తీసుకురావ‌డంలో ఎన్టీఆర్ పాత్ర చిన్న‌ది కాదు. 

 

తెలుగు భాష‌,
సంస్కృతి, ఆచారాలు, వార‌స‌త్వాలంటే ఎన్టీఆర్‌కున్న అభిమానం, ఆవేశం అంతా ఇంతా కాదు. ఒక చారిత్ర‌క అవ‌స‌రంగా
ఆయ‌న్ను విగ్ర‌హం చేసి ముఖ్య‌మంత్రి కుర్చీలో కూర్చుని, ఆయ‌న విగ్ర‌హానికే దండలు వేస్తున్న బాబు
తెలుగునేల‌,
భాష‌తో పాటు యావ‌త్
భార‌త‌దేశాన్నే ఎగ‌తాళి చేశారు. తోడుగా వెంక‌య్య‌ను కూడా బోనులోకి లాగారు. లేక
వెంక‌య్య అభిప్రాయ‌మే చంద్ర‌బాబు చెప్పారేమో తెలీదు. 

 

ఎవ‌రైనా అణ‌గారిన వ‌ర్గాల్లో పుట్టాల‌ని కోరుకుంటారా అని ఆ మ‌ధ్య పేద‌వారు, నిమ్న‌కులాల వారి గుండెల్లో గుచ్చి మిర‌ప‌పొడి
పూశారు. ఆ అవ‌మానం,
బాధ ఇంకా జనం
దిగ‌మింగుకోక ముందే ఇప్పుడు మ‌రో మ‌న‌సులో మాట శెల‌విచ్చారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఎడిష‌న్‌లో
బాబు మిత్ర ప‌త్రిక‌లోనే ఆ వార్త ప్ర‌ముఖంగా వ‌చ్చింది కాబ‌ట్టి వార్త గురించి
అనుమానాలు అక్క‌ర్లేదు. 

'పుట్టుక మ‌న చేతుల్లో ఉంటే నేను, వెంక‌య్య నాయుడు అమెరికాలోనే పుట్టాల‌ని
కోరుకుంటాం'
అన్న‌వి బాబు
మాట‌లు. లోప‌ల‌ ఏయిజం లేదు - టూరిజం త‌ప్ప‌. ఆర్ట్స్ స‌బ్జెక్టులు వేస్ట్ - ఐ.టి.
స‌బ్జెక్టులు త‌ప్ప‌లాంటి ఆణిముత్యాలు కూడా బాబు అనుగ్ర‌హ భాష‌ణ‌ల్లో దొర్లిన‌వే. 

 

భార‌త రాజ్యాంగం మీద ప్ర‌మాణం చేసి రాజ్యాంగ ప‌ద‌విలో ఉన్న బాబు క‌న్న
దేశానికి ఎంత మ‌ర్యాద ఇస్తున్నారో తెలిపే ఉదంత‌మిది. అంత్య‌ప్రాస‌ల‌తో ఆసేతు హిమాచ‌లం
అర‌మోడ్పు క‌న్నుల‌తో పుంభావ స‌ర‌స్వ‌తిలా మిష‌న్ కంటే వేగంగా అనేక భాష‌ల్లో
మాట్లాడే వెంక‌య్య కూడా చంద్ర‌బాబు లాగే ఈ దేశంలో పుట్ట‌ద‌గ్గ‌వారు కాద‌న్న‌ది
బాబు నిశ్చితాభిప్రాయం.

 

సింగ‌పూరు మీద బాబు ప్రేమ లోకానికి తెలిసిందే. జ‌పాన్‌తో బంధుత్వం కోసం చేయ‌ని
ప్ర‌య‌త్నం లేదు. చైనాతో చెలిమి కోసం చేయి చాచారు. తాజాగా ర‌ష్యాతో ఒప్పందాలే జ‌రిగాయి.
వియ‌త్నాల ప‌ర్వ‌తం అమ‌రావ‌తికి ద‌గ్గ‌ర‌వుతోంది. కొరియా కొలిమిని ఎప్పుడు ఊదుతారో
తెలీదు. జ‌ర్మనీని తీసి పారేయ‌డానికి వీల్లేదు. ఇస్తాంబుల్ మ‌న‌సుకు న‌చ్చింది.
స్విస్ ఛాలెంజ్ ప‌నులు పూర్త‌యితే చాలాసార్లు స్విట్జ‌ర్లాండ్‌తో ప‌నులుంటాయి. 

 

ఇంత‌కూ బాబు ఒక రాష్ట్రానికి ముఖ్య‌మంత్రా?  లేక ఒక దేశానికి విదేశాంగ మంత్రా?  భార‌త‌దేశ‌మంటే గౌర‌వం లేన‌ప్పుడు ఆయ‌న ఏ
దేశానికి విదేశాంగ మంత్రి కావాల‌నుకుంటున్నారో అమెరికాలో తెలుగు వారికి విదేశంలో
స్వ‌దేశీమంత్రిలా ప‌ని చేస్తున్న పెద్ద మ‌నిషి ఏమైనా చెప్ప‌గ‌ల‌రేమో?

అయినా దేశాల‌కేనా విదేశాంగ మంత్రి? ఆంధ్ర‌ప్ర‌దేశ్ త‌ర‌ఫున అన్ని దేశాల్లో
అధికార ప్ర‌తినిధులు ఉంటే త‌ప్పు కాదేమో - బాబు దృష్టిలో.

 

Back to Top