చంద్రబాబు మతిమరుపు...ఆపై పెదవి విరుపు

సీనియర్ జర్నలిస్టులతో  ఇష్టాగోష్టి  ఏర్పాటు చేశారు చంద్రబాబు నాయుడు.
అందరినీ నవ్వుతూ పలకరించి తన కుర్చీలో కూర్చున్నారు బాబు.
ఏంటి విశేషాలు? అందరూ మన గురించి ఏమనుకుంటున్నారు? అని చంద్రబాబు ఆరా తీశారు.
సుబ్బారావు  మైక్ అందుకుని ఏం లేదండీ తమరి ఆరోగ్యం గురించి కాంగ్రెస్ లీడర్ కె.వి.పి.రామచంద్రరావు  తెగ కంగారు పడుతున్నారండీ బాబూ అన్నాడు.
చంద్రబాబు ఆశ్చర్యంగా చూశారు. ఏం గుండు పిక్కలా ఉన్నాను కదా నా గురించి ఆయనకెందుకు బెంగ? అని నవ్వారు.
వెంకట్రావు మైక్ అందుకుని అది కాదులెండి..ఆయన సెటైర్ వేశారు. మీకేదో అల్జీమర్స్ వ్యాధి ఉందని.. అది కూడా ముదిరి మెగలో మేనియాక్ గా మారిపోయిందని కె.వి.పి. అన్నారని చెప్పారు.
చంద్రబాబు  మరో  సారి ఆశ్చర్యపోయి.. నాకు అల్జీమర్సా?   కె.వి.పి.కి ఎవరు చెప్పారు?అని బాబు నిలదీశారు.
సూరిబాబు లేచి అబ్బే అది కాదండీ బాబూ.. మీరేమో పోలవరం మీ కలే అన్నారు కదా... అది కాంగ్రెస్ వాళ్ల  ప్రాజెక్టు కదా.. మీ కలని అంటారేంటని కె.వి.పి. అన్నారు అని వివరించారు.
చంద్రబాబు కోపంగా చూసి  పోలవరమే కాదు.. అసలు జలయజ్ఞం కూడా నా కలే. నోట్ల రద్దు నాకలే. అని ఆవేశంగా అన్నారు.
జనార్ధన్ మైక్ అందుకుని  పోలవరం వై.యస్.రాజశేఖరరెడ్డిగారి టైమ్ లోనే మొదలు పెట్టారు కదండీ అందుకే అలా అని ఉంటారు . అది వదిలేయండి కానీ.. ప్రత్యేక హోదా కోసం గట్టిగా అడిగితే  పోలవరానికి నిధులు రావన్నారేంటి మీరు? అందరూ  మీకేమన్నా తేడా చేసిందేమో అనుకుంటున్నారు అని ఆగారు జనార్ధన్.
చంద్రబాబు మళ్లీ కోపంగా చూసి ప్రత్యేక హోదానా? అంటే ఏంటి? అని అడిగారు.
అక్కడున్న జర్నలిస్టులంతా అదిరి పడ్డారు.
చంద్రబాబు మళ్లీ అందుకుని... ఇందాకటి నుంచి పోలవరం అంటున్నారు..ప్రత్యేక హోదా అంటున్నారు నాకేమీ అర్ధం కావడం లేదు. అని చిరాగ్గా చూశారు.
సుబ్బారావు మైక్ తీసుకుని అది కాదండీ.. పోలవరం మీ కల అని మీరన్నారు కదా..అని నసిగాడు.
చంద్రబాబు గుర్రుగా చూసి... ఏంటి కలా? ఏం కల?   కలని నేననడమేంటి? మీరేమన్నా కలగన్నారా? అని  నిలదీశారు.
వెంకట్రావు కలుగ చేసుకుని  ఇదేంటంటీ బాబూ అన్నీ ఇలా మర్చిపోతున్నారు.. పోనీ అది వదిలేయండి..అసలు మమ్మల్ని ఎందుకు పిలిపించారు అని అడిగాడు.
చంద్రబాబుకు చిర్రెత్తుకొచ్చింది. ఏంటి? నేను మిమ్మల్ని పిలిచానా? నేనెప్పుడు  పిలిచాను? మీరే నా దగ్గరకు వచ్చారు.  మాట్లాడుకుంటున్నాం ..అంతే అన్నారు చంద్రబాబు.
ప్రత్యేక హోదా పదిహేనేళ్లు కావాలని మీరు ఎన్నికల సమయంలో అనలేదా అని మాణిక్యం అడిగారు.
ఏంటి ప్రత్యేక హోదానా? పదిహేనేళ్లా? నేనా ? అడిగానా? అని  ప్రశ్నలపై ప్రశ్నలు సంధించి ఆశ్చర్యపోయారు.
జర్నలిస్టులు ఒకరి ముఖం ఒకరు చూసుకుని అయోమయంగా నవ్వుకున్నారు.
చంద్రబాబు జర్నలిస్టుల కేసి చూసి.. అసలింతకీ మీ సమస్యేంటి? అపి అడిగారు.
జర్నలిస్టులంతా లేచి నిలబడి మరేం లేదండీ బాబూ ఈ మధ్య మేం అన్నీ మర్చిపోతున్నాం. ఇప్పుడు మాట్లాడింది ఆ మరుక్షణమే మర్చిపోతున్నాం ..అల్జీమర్స్ వచ్చేసి ఉంటుంది అన్నారు.
చంద్రబాబు అందరికేసి జాలిగా చూసి జాగ్రత్త. ఆరోగ్యం బాగా చూసుకోవాలి. ఇంకేంటి విషయాలు అని అడిగారుబాబు.
అబ్బే ఇంకేమీ లేదండీ బాబూ.. మీరు పెద్ద నోట్లు రద్దు చేయించారు కదా జనం నానా అవస్థలూ పడిపోతున్నారండీ బాబూ ఏదో ఒకటి చేయాలి మరి అన్నారు.
చంద్రబాబు మళ్లీ కోపంగా చూశారు. ఏంటీ నోట్లు రద్దయ్యాయా? అవి కూడా నేను రద్దు చేయించానా? ఏం మాట్లాడుతున్నారు మీరు? అని  అడిగారు.
జర్నలిస్టులు లెంపలు వాయించుకుని ... మీరు కాదండీ బాబూ ఆ మోదీగారి పేరు చెప్పబోయి..మతిమరపు వచ్చేసింది కదా..పొరపాటున మీ పేరు చెప్పాం.. క్షమించండి ఇక ఉంటాం అని చంద్రబాబు బదులు గురించి ఆగకుండా పరుగులాంటి నడకతో  వెళ్లిపోయారు.
ఏంటో ఈ మనుషులు.ఏదీ గుర్తుండి చావదు వీళ్లకి అని  తనలో తానే గొణుక్కున్న చంద్రబాబు తన క్యాంప్ ఆఫీస్ కి వెళ్లిపోయారు.
Back to Top