పెట్టుబడిలేని పంట గిట్టుబడి కాని పరిపాలన

నూతన సంవత్సరం సందర్భంగా మనకో కొత్త విషయం తెలిసింది. ఇంత వరకూ చంద్రబాబు రాష్ట్రానికి సిఇవోగా పని చేస్తున్నాడని మాత్రమే ప్రజలకు తెలుసు. కానీ తాను మార్కెటింగ్ మేనేజర్ ని అని కూడా ప్రకటించారు బాబుగారు. అఫ్ కోర్స్ రాష్ట్రం మొత్తానికీ ఆ విషయం తెలుసనుకోండి. రైతుల భూములన్నిటినీ లాక్కొని, విదేశీ కంపెనీలకు కట్టబెడుతున్నందుకు భూముల బ్రోకర్ లా పని చేస్తున్నారంటూ ప్రతిపక్ష నేతలు విమర్శించడం సంగతి పక్కన పెడితేంరాష్ట్రాన్ని, వనరులను సరుకులుగా చేసి అందినకాడికి అమ్మి, అనుయాయులకు దోచిపెట్టి కమీషన్లు కుమ్మి పరిపాలనను వ్యాపారంగా చేసాడన్న పత్రికల మాటలు పెడచెవిన పెడితేంబాబుదెప్పుడూ మార్కెటింగ్ స్టేటజీయే. 
మార్కెటింగ్ లో ఎప్పుడూ లాభ, నష్టాల బేరీజే తప్ప న్యాయాన్యాయాల మాట ఉండదు. అందుకే చంద్రబాబు తన మార్కెటింగ్ టెక్నిక్ తో అమరావతి పేరు చేప్పి వేల కోట్లు వెనకేసుకోగులుగుతున్నాడు. 
ఇక పోతే చంద్రబాబు మార్కెటింగ్ మేనేజర్ కూడా అన్న కొత్త విషయాన్ని  జీర్ణించుకునేలోపు మరో కొత్త విషయం కూడా ఈ కొత్త సంవత్సరంలో మన ముందుకు రాబోతోంది. అందేంటంటే పెట్టుబడిలేని ప్రకృతి వ్యవసాయం. పాలేకర్ గారి పుణ్యమా అని ప్రకృతి వ్యవసాయం మీద రైతులకు కొంత అవగాహన కలుగుతోంది. ఐతే దానికి చంద్రబాబుగారి కొనసాగింపు ఏమిటంటే రూపాయి ఖర్చు పెట్టకుండా రైతులు పంటలు పండించేయొచ్చు అని నొక్కి వక్కాణించడం. దీని వల్ల ఏమిటి లాభం అని ఒకసారి ఆలోచిస్తే తత్వం ఇలా బోధపడింది. ఉత్త వ్యవసాయం అనే మాటలో బోలెడంత భారం, బాధ్యతా ఉన్నాయి. దీనిలో రైతులకు రుణాలు, విత్తనాలు, ఎరువులు, మందులు, నీళ్లు, విద్యుత్తు ఇలా బోలెడన్ని విషయాలున్నాయి. అవేవీ సవ్యంగా ఇవ్వడం లేదని చంద్రబాబు ప్రభుత్వంపై బోలెడన్ని విమర్శలున్నాయి. అసలు పెట్టుబడే లేని ప్రకృతి వ్యవసాయం అని అంటే చాలు మాటలో తప్ప చేతల్లో ఒక్క రూపాయి ఖర్చు చేయక్కర్లేదు. అందుకే బాబుగారు పాలేకర్ గారి ప్రాజెక్టును ప్రమోటు చేసి రైతులకు వీలైనంత దూరంగా ఉంటారన్నమాట. పెట్టుబడే లేదంటే ఖర్చే ఉండదు, ఖర్చే లేదంటే రుణాలు తీసుకోనక్కర్లేదు, వాటిని మాఫీ చేయక్కర్లేదు. పెట్టుబడే లేదంటే విత్తులు, ఎరువులు, మందులు, కూలీలు ఏమీ అక్కర్లేదు. అసలు ఇవన్నీ చెప్పుకోడం ఎందుకు వ్యవసాయమే అక్కర్లేదు. ఇదీ బాబుగారి థాట్ ప్రాసెస్. 
అయితే ఈ ఏడాది ప్రజలకు మరో విషయాన్ని కూడా బోధిస్తుంది. పెట్టుబడిలేని వ్యవసాయమే కాదు, గిట్టుబడి కాని పాలననూ వాళ్లు వదిలేస్తారు. బాబూ తస్మాత్ జాగ్రత్త. 
 
Back to Top