గడప గడపకూ ప్ర‌భుత్వం చేసిన మంచిని వివ‌రించాలి

పార్టీ నాయ‌కుల‌కు పార్టీ రీజిన‌ల్ కో-ఆర్డినేట‌ర్ వైవీ సుబ్బారెడ్డి దిశానిర్దేశం
 

విశాఖ‌: ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి సూచించిన విధంగా గడపగడపకూ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను ప్రజల వద్దకు తీసుకువెళ్లాలని వైయ‌స్ఆర్‌సీపీ రీజ‌న‌ల్ కో-ఆర్డినేట‌ర్ వైవీ సుబ్బారెడ్డి దిశానిర్దేశం చేశారు. మంత్రుల నుంచి ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే వరకూ ప్రతి ఒక్కరూ బాధ్యతగా ప్రజల ముందుకు వెళ్లి ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు, ముఖ్యమంత్రి వైయ‌స్ జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన మాట నిలబెట్టుకున్న అన్ని అంశాలనూ ప్రజలకు వివరించాల్సిన ఆవశ్యకతను నొక్కి చెప్పారు. విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లాల  ఇంచార్జి , టీటీడీ చైర్మన్  వైవీ సుబ్బారెడ్డి  ఆధ్వర్యంలో  విశాఖపట్నం  పార్టీ ఆఫీసులో అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి జిల్లాల మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలతో పార్టీ కమిటీల సమావేశం నిర్వహించారు. ఈ సంద‌ర్భంగా వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ..మూడేళ్లుగా ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాల ఫలాలను ప్రజల ముంగిటకు తీసుకువెళ్లేందుకు వైయ‌స్ఆర్‌సీపీ ణులు సిద్ధంగా ఉండాల‌న్నారు. ప్ర‌తి ఎమ్మెల్యే, నియోజ‌క‌వ‌ర్గ స‌మ‌న్వ‌య‌క‌ర్త త‌ప్ప‌నిస‌రిగా నెల‌లో 20 రోజులు గ‌డ‌ప గ‌డ‌ప‌కు మ‌న ప్ర‌భుత్వం కార్య‌క్ర‌మం నిర్వ‌హించాల‌న్నారు. ప్రతి సచివాలయాన్ని సందర్శించి, ప్రజల సమస్యలను జిల్లా ఇన్‌చార్జి మంత్రి దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించేందుకు చొరవ తీసుకోవాలన్నారు. ప్రతి ఒక్కరూ ప్రజలకు జవాబుదారీగా ఉండాలని సూచించారు. నాయకులు, కార్యకర్తల మధ్య సమన్వయ సాధన, పార్టీ శ్రేణుల సమస్యలు తెలుసుకుని పరిష్కరించే ప్రక్రియను తాము చేపడతామని చెప్పారు. నాయకులు, కార్యకర్తల సమస్యల పరిష్కారానికి కృషి చేయడంలో కూడా ముందుంటామని  భరోసా ఇచ్చారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా సంక్షేమ పథకాల కింద నేరుగా రూ.లక్షా 43 వేల కోట్లు అందజేసిన విషయాన్ని ప్రజల ముంగిటకు తీసుకు వెళ్లాలని  సూచించారు. కుల, మత, ప్రాంతీయ వివక్షకు తావు లేకుండా ప్రజల ఖాతాల్లో పథకాల నిధులు జమయ్యేలా సీఎం వైయ‌స్ జగన్‌మోహన్‌రెడ్డి సాహసోపేత నిర్ణయం తీసుకున్న విషయాన్ని ప్రతి ఒక్కరికీ వివరించడంలో భాగస్వామ్యులు కావాలన్నారు.  

Back to Top