తిరుమల: తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల్లో పాల్గొనే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు పూర్తిచేశామని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత జరగబోతున్న మొట్టమొదటి బ్రహ్మోత్సవాలు కాబట్టి ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఏర్పాట్లు పూర్తిచేశామన్నారు. తిరుమల కొండపై వైవీ సుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. బ్రహ్మోత్సవాల్లో లక్షలాది మంది భక్తులు పాల్గొంటారు కాబట్టి వారికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని వసతులు, సౌకర్యాలు కల్పించడం జరిగిందన్నారు. భద్రతాపరమైన ఏర్పాట్లు క్షుణ్ణంగా పరిశీలించామన్నారు. ముఖ్యమంత్రి వైయస్ జగన్ స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించే కార్యక్రమంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయన్నారు.
ఆ కుటుంబానికి భగవంతుడు కల్పించిన వరం
తిరుమల తిరుపతి దేవస్థాన చరిత్రలోనే అరుదైన గొప్ప అవకాశం భగవంతుడు వైయస్ కుటుంబానికి కాల్పించారని వైవీ సుబ్బారెడ్డి అన్నారు. దివంగత మహానేత వైయస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న ఐదు సంవత్సరాల పాటు స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించి బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్నారని గుర్తుచేశారు. మళ్లీ ఈ రోజు వైయస్‌ఆర్ తనయుడు సీఎం వైయస్ జగన్ స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పిస్తున్నారన్నారు. ఇలాంటి అరుదైన అవకాశం భగవంతుడు వైయస్ కుటుంబానికి కల్పించారన్నారు.