చిత్తూరు: వైయస్ఆర్‌సీపీ అధినేత వైయస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో మహిళల భద్రతకు, సంక్షేమానికి పెద్దపీట వేశారని వైయస్ఆర్‌సీపీ మహిళా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ద్రాక్షాయణి అన్నారు. మహిళలను కేవలం సంక్షేమ పథకాల లబ్ధిదారులుగా కాకుండా, రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములుగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో వైయస్ జగన్ ప్రభుత్వం పని చేసిందని గుర్తు చేశారు. గంగాధర నెల్లూరు నియోజకవర్గం, పెనుమూరు మండలం, ఉగ్రాణంపల్లి గ్రామంలో వైయస్ జగన్ పుట్టిన రోజు వేడుకలను మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని వినూత్న కార్యక్రమాలతో జననేతకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వైయస్ జగన్ గారి ఫొటోలతో ప్రత్యేక ప్రదర్శన ఏర్పాటు చేసి తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా ద్రాక్షాయణి మాట్లాడుతూ..వైయస్ జగన్ పాలనలో మహిళలకు భద్రత అంటే కేవలం చట్ట పరిరక్షణ మాత్రమే కాదు, ఆర్థిక బలం, సామాజిక గౌరవం, భవిష్యత్‌పై నమ్మకం కూడా కల్పించారన్నారు. అందుకే మహిళలు వైయస్ జగన్ నాయకత్వాన్ని కోరుకుంటున్నారని తెలిపారు. మహిళల భద్రతను బలోపేతం చేసేందుకు దిశా చట్టాన్ని అమలు చేసి, మహిళలపై నేరాలకు కఠిన శిక్షలు విధించేలా చట్టపరమైన రక్షణ కల్పించారని చెప్పారు. ఆర్థిక స్వావలంబన దిశగా మహిళలకు నేరుగా లబ్ధి చేకూరేలా అనేక సంక్షేమ పథకాలు అమలు చేశారు. అమ్మ ఒడి, వైయస్ఆర్ ఆసరా, వైయస్ఆర్ చేయూత, వైయస్ఆర్ కళ్యాణమస్తు వంటి పథకాలు మహిళల జీవితాల్లో స్థిరత్వాన్ని తీసుకొచ్చాయన్నారు. ముఖ్యంగా డబ్బులు నేరుగా మహిళల ఖాతాల్లో జమ చేయడం ద్వారా వారి కుటుంబాల్లో గౌరవం, నిర్ణయాధికారం పెరిగిందని పేర్కొన్నారు. స్థానిక సంస్థల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్ కల్పించడం ద్వారా రాజకీయ, సామాజిక సాధికారతను ప్రోత్సహించారని తెలిపారు. ఈ రోజు వైయస్ జగన్ జన్మదినాన్ని మహిళలే ఘనంగా జరుపుకోవడం, ఆయన పాలనపై ఉన్న నమ్మకానికి నిదర్శనమన్నారు. మళ్లీ వైయస్ జగన్ గారి పాలన రావాలంటే ప్రతి మహిళ ముందుకు వచ్చి పార్టీని బలోపేతం చేయాలని ద్రాక్షాయని పిలుపునిచ్చారు.