తిరుపతి: ఎన్నికల వేళ కూటమి ప్రభుత్వం ముస్లిం మైనారిటీలకు ఇచ్చిన హామీలు ఏమయ్యాయని వైయస్ఆర్‌సీపీ తిరుపతి నియోజకవర్గ సమన్వయకర్త భూమన అభినయ్‌రెడ్డి ప్రశ్నించారు. తిరుపతి నగరంలోని పీపీ చావడి, పెద్ద మసీదు వద్ద ముస్లిం మైనారిటీలు చేపట్టిన ఆందోళన కార్యక్రమానికి భూమన అభినయ్ రెడ్డి మద్దతు తెలిపారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. `ముస్లిం మైనారిటీల సంక్షేమాన్ని చంద్రబాబు నాయుడు తుంగలో తొక్కారు. ముస్లిం మైనారిటీలకు 50 ఏళ్లకే పెన్షన్ ఇస్తానన్నాడు..ఇంత వరకు ఏ ఒక్కరికీ ఇవ్వలేదు. ఈద్గాలకు కబరస్థాన్లకు స్థలాలు కేటాయించలేదు. నూర్ బాషా కార్పొరేషన్ ఏర్పాటు కు 1000 కోట్లు ఇస్తామని మాటిచ్చారు. ఇంతవరకు ఎంట కేటాయించారు? . మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా 5 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు. ఇమామ్ బౌజులకు ప్రతి నెల 10,000, రూ.5000 వేలు గౌరవ వేతనం ఎక్కడ. ప్రత్యేక మసీదు నిర్వహణకు 5000 ఆర్థిక సహాయం చేస్తామన్నారు. హజ్ యాత్రకు వెళ్లే ఒక్కో ముస్లింకు లక్ష రూపాయలు సాయమన్నారు` అని కూటమి ప్రభుత్వ హామీలను భూమన అభినయ్‌రెడ్డి ఎండగట్టారు.