బాబు అవినీతి మూటలతో నిండిన మీ నోళ్ళు పెగలట్లేదా..?

వైయ‌స్‌ఆర్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కొండా రాజీవ్‌ గాంధీ సూటి ప్రశ్న 

ఐటీ శాఖ నోటీసులపై కూడా మీడియా ముందుకొచ్చి ఏడుస్తావా బాబూ? 

చంద్రబాబు, లోకేశ్‌ ఇద్దరూ దొంగలే.. 

ఆ అవినీతి సొమ్మును చేతులుమార్చిన కీలకసూత్రధారి లోకేశ్ 

అందుకే లోకేశ్‌ కాదు.. ఆయన అవినీతి సూట్‌కేస్ అంటున్నాం 

ఇప్పటికైనా ఆ నోటీసులపై తండ్రీకొడుకులు స్పందించాలి 

 వైయ‌స్‌ఆర్‌సీపీ రాష్ట్ర అధికారప్రతినిధి కొండా రాజీవ్‌ గాంధీ డిమాండ్‌

బాబు ప్యాకేజీ చక్రాలతో నడుస్తున్న వారాహీ 

అందుకే, ప్రశ్నిస్తానంటూ వచ్చిన దత్తపుత్రుడు మౌనందాల్చాడు 

 చెల్లి కళ్లల్లో ఆనందానికి బీజేపీ కళ్లల్లో కారంకొడుతున్న పురంధేశ్వరి 

కరప్షన్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా నేతలుగా సీపీఐ నారాయణ, రామకృష్ణ 

 వైయ‌స్‌ఆర్‌సీపీ రాష్ట్ర అధికారప్రతినిధి కొండా రాజీవ్‌ 

 తాడేపల్లి:  చంద్ర‌ బాబు అవినీతి మూటలతో నిండిన మీ నోళ్ళు పెగలట్లేదా..? అని  వైయ‌స్‌ఆర్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కొండా రాజీవ్‌ గాంధీ సూటిగా ప్ర‌శ్నించారు.  చంద్రబాబుకు ఐటీ షోకాజ్ నోటీసులపై విపక్షాలు, ఎల్లో మీడియా మౌనరాగంపై   రాజీవ్ గాంధీ నిల‌దీశారు. అమరావతి రాజధాని పేరుతో టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు రెండు చిన్న కాంట్రాక్టర్‌లలోనే దాదాపు రూ.150 కోట్లు కొట్టేశాడని, ఇందుకుగాను కేంద్ర ఐటీశాఖ నోటీసులిచ్చిన సంగతి అందరికీ తెలిసిందేనని వైఎస్‌ఆర్‌ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కొండా రాజీవ్‌ గుర్తుచేశారు. చంద్రబాబుకు అందిన ఈ సొమ్మును పలువురు వ్యక్తుల ద్వారా చేతులు మార్చి చేర వేయడంలో ఆయన కొడుకు నారా లోకేశ్‌ కీలక సూత్రధారిగా వ్యవహరించాడు. ఇదే విషయాన్ని  కేంద్ర ఐటీశాఖ నోటీసులో కూడా స్పష్టంగా ఉందంటూ రాజీవ్‌ పేర్కొన్నారు. అయితే, ఈ విషయాలపై ఇప్పటి వర కూ చంద్రబాబు గానీ.. లోకేశ్‌ గానీ స్పందించకపోవడంలో అర్ధమేంటని ఆయన నిలదీశారు. గతంలో చంద్రబాబు, తన భార్యను వైఎస్‌ఆర్‌సీపీ నేతలు అవమానించారంటూ మీడియా ముందుకొచ్చి ఏడిస్తే..లోకేశ్‌నేమో పరువు నష్టం దావాలంటూ మా పార్టీ నాయకులపై హడావిడి చేశారన్నారు. మరి, ఈరోజు తనకు అన్యాయంగా కేంద్ర ఐటీశాఖ నోటీసులిచ్చిందని చంద్రబాబు మీడియా ముందుకొచ్చి భోరున ఏడ్చే దమ్ముందా..? అని ప్రశ్నించారు. అదేవిధంగా తన తండ్రి ఎలాంటి అవినీతికి పాల్పడకపోయినా.. నోటీసులిచ్చారంటూ ఐటీశాఖపై పరువు నష్టం దావా వేసే సత్తా ఉందా..? అని లోకేశ్‌ను ఆయన నిలదీశారు.  

లోకేశ్‌ కాదు.. ఆయన అవినీతి సూట్‌కేస్ః
నారా లోకేశ్‌ చిన్నతనం నుంచీ తన బతుకే అవినీతిమయమని తెలుసుకోవాలంటూ కొండా రాజీవ్‌ గుర్తుచేశారు. స్టాన్‌ఫోర్డ్‌ యూనివర్శిటీలో చదువుకున్నానని గొప్పలు చెప్పుకునే లోకేశ్‌ తన ఫీజులు ఆయన తండ్రి ఏ అకౌంట్‌ నుంచి చెల్లించారనేది తెలుసుకోవాలన్నారు. లోకేశ్‌ గతంలో మంత్రిగా పనిచేసినప్పుడు ఫైబర్‌నెట్, ఈఎస్‌ఐ, సీమెన్స్‌ స్కామ్‌లతో పాటు ఇసుక, లిక్కర్‌ వంటి మాఫియా దందాలకు నాయకత్వం వహించారని రాజీవ్‌ ఆరోపించారు. దీన్నిబట్టి ఆయన పేరు నారా లోకేశ్‌ అని కాకుండా అవినీతి సూట్‌కేస్‌ అని పెట్టుకుంటే బాగుంటుందని రాజీవ్‌ చెప్పారు. 

ప్రతీ సెల్ఫీ వెనుక ఒక అవినీతిమూట:

పాదయాత్ర పేరుతో ఊరూరా తిరుగుతూ.. ఎక్కడో ఒకచోట సెల్ఫీలు దిగుతున్న లోకేశ్‌కు తానొకటి గుర్తుచేస్తున్నానని.. ఆయన దిగే ప్రతీ సెల్ఫీ వెనుక ఒక అవినీతిమూటల కథ ఉందని రాజీవ్‌ విమర్శించారు. ఆ అవినీతి కథేంటో రాష్ట్ర ప్రజలకు వివరించాల్సిన బాధ్యత లోకేశ్‌కు ఉందన్నారు. 

మౌనముద్రలో దుష్టచతుష్టయంః
రాజకీయాల్లో ఫార్టీఇయర్స్‌ ఇండస్ట్రీ అని, 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేశానని డబ్బాలు కొట్టే చంద్రబాబు రూ.150 కోట్లు కొట్టేశాడని లోకం కోడైకూస్తుంటే ఆయన ముఠా దుష్టచతుష్టయం మాత్రం మౌనముద్రలో ఉండటమేంటని రాజీవ్‌ ప్రశ్నించారు. కేంద్ర ఐటీశాఖ జారీ చేసిన నోటీసుల సారాంశంపై చంద్రబాబు, లోకేశ్‌లు మాట్లాడటం లేదని.. ప్రశ్నిస్తానన్న దత్తపుత్రుడు పవన్‌కళ్యాణ్‌ అంతులేడని.. వార్తలు రాయాల్సిన రామోజీరావు కలం కన్నెత్తి అయినా చూడటంలేదని.. కళ్లకు కట్టినట్లు ప్రజలకు చూపించాల్సిన ఏబీఎన్‌ రాధాకృష్ణ, టీవీ5 బీఆర్‌ నాయుడు నోటికి ప్లాస్టరేసుకున్నారంటూ కొండా రాజీవ్‌ ఎద్దేవా చేశారు. సీపీఐతో పాటు ఆఖరికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి సైతం బాబు అవినీతి కథపై నోరిప్పకపోవడం ఆశ్చర్యకరమన్నారు. వీరికి చంద్రబాబు అవినీతి సొమ్ముకున్న సంబంధమేంటని.. ఆయన అవినీతి సొమ్ములో వాటాలున్నందునే వారంతా మౌనంగా ఉన్నట్లు రాజీవ్‌ ఆరోపించారు. 

 ప్యాకేజీ చక్రాల అవినీతిరథం..వారాహీః
జీరోబడ్జెట్‌ పాలిటిక్స్, అవినీతిరహిత రాజకీయం నడిపిస్తానంటూ.. దత్తపుత్రుడు పవన్‌కళ్యాణ్‌ బీరాలు పలికాడు. మరి, ఇప్పుడు చంద్రబాబుకు అందిన ఐటీ నోటీసులపై ఆయన ఎందుకు స్పందించడంలేదని కొండా రాజీవ్‌ నిలదీశారు. కేవలం, ప్యాకేజీ రాజకీయాలకే పవన్‌కళ్యాణ్‌ పరిమితమయ్యే నాయకుడని ఆయన విమర్శించారు. బాబు ఇచ్చే ప్యాకేజీ చక్రాలపై తిరిగే అవినీతి రథమే వారాహీ అని ఆయన ఆరోపించారు. అందుకే, నారా చంద్రబాబు, ఆయన కొడుకు లోకేశ్‌పై వచ్చే విమర్శలకు సంబంధించి పవన్‌ కళ్యాణ్‌ పలెత్తుమాట కూడా అనడంలేదని గుర్తుచేశారు. ఇప్పటికైనా ప్రజలంతా చంద్రబాబు అవినీతిపై చర్చించుకుంటున్న సంగతిని గ్రహించి.. కేంద్ర ఐటీ శాఖ నోటీసుల్ని చదువుకుని, చంద్రబాబు దొంగ అని పవన్‌ కళ్యాణ్‌ చెప్పాలన్నారు. ఒకవేళ నమ్మకపోతే.. కేంద్ర ఐటీశాఖనే తప్పు చేసిందని నిలదీసే దమ్మూ, ధైర్యం పవన్‌కళ్యాణ్‌కు ఉందా..? అని రాజీవ్‌ సవాల్‌ విసిరారు.

చెల్లి కళ్లల్లో ఆనందం.. బీజేపీ కళ్లలో కారంః
చంద్రబాబు రాజకీయమంతా అవినీతి, అక్రమపొత్తుల బేరమేనని ప్రజలు తెలుసుకోవాలని కొండా రాజీవ్‌ విమర్శించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలిగా ఉన్న పురందేశ్వరి తన చెల్లి కళ్లలో ఆనందం చూడటానికి బీజేపీ కళ్లల్లో కారం కొడుతుందని విమర్శించారు. అందుకే, రూ.150 కోట్ల అవినీతికి పాల్పడ్డాడని ఐటీశాఖకు ఆధారాలతో దొరికిన మరిది చంద్రబాబును కాపాడుకోవాలనే ఆరాటంలో ఉన్నట్లు రాజీవ్‌ తెలిపారు. ఈ విషయం అబద్ధమైతే.. పురందేశ్వరి కేంద్ర ఐటీశాఖను సమర్ధించి ప్రశంసించాలని ఆయన డిమాండ్‌ చేశారు. 

కరప్షన్‌ పార్టీ ఆఫ్‌ ఇండియాలో కమ్యూనిస్టులా..?ః
చంద్రబాబు అవినీతిదందాపై సీపీఐ నాయకులు నారాయణ, రామకృష్ణ  సైతం నోరుమెదపకపోవడం సిగ్గుచేటని కొండా రాజీవ్‌ విమర్శించారు. పేదలపక్షాన పోరాటాలు చేస్తూ.. ప్రజలకు అవినీతిరహితమైన రాజ్యాధికారాన్ని చూపిస్తామనే కమ్యూనిస్టు నాయకులు ఈరోజు తమ పంథా మార్చుకున్నారా..? అని ప్రశ్నించారు.  సీపీఐ నారాయణ, రామకృష్ణలు కలిసి కరప్షన్‌ పార్టీ ఆఫ్‌ ఇండియాగా పనిచేస్తున్నారా..? అని నిలదీశారు. 

బాబు స్కాముల్లో ఇది నీటిచుక్క మాత్రమేః
బాబు అవినీతి సామ్రాజ్యం ఈనాటిది కాదని.. గతంలో ఆయనపై అనేక అవినీతి ఆరోపణలున్నాయని కొండా రాజీవ్‌ అన్నారు. వ్యవస్థల్ని మేనేజ్‌ చేయడంలో బాబు దిట్ట. కాబట్టే ..ఆయన అవినీతి చిట్టా పుట్ట ఇప్పటి వరకు పగల్లేదని.. నేటికి పాపం పండినందునే ఐటీశాఖ నోటీసుల రూపంలో దొంగ దొరికాడని రాజీవ్‌ వివరించారు. తెలంగాణలో రేవంత్‌ రెడ్డిని అడ్డంపెట్టుకుని ఓటుకు నోటు స్కామ్‌కు పాల్పడటం, ఏలేరు స్కామ్, స్కిల్‌డెవలప్‌మెంట్, అమరావతి రాజధాని కుంభకోణాల గురించి వైఎస్‌ఆర్‌సీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడే ప్రజలకు గుర్తుచేసిందని చెప్పారు. ఇప్పుడు ఐటీ పట్టుకున్న రూ.150 కోట్ల అవినీతి అనేది చంద్రబాబు నేర సముద్రంలో ఒక నీటిబిందువు మాత్రమేనని .. ఆయన అక్రమాల భాగోతం ఇంకా బట్టబయలు కావాల్సి ఉందన్నారు. 

కదులుతున్న చంద్రబాబు అవినీతి డొంకః
40 ఏళ్ల రాజకీయ అనుభవశాలిగా 2014 ఎన్నికల్లో ప్రజలు నమ్మితే వారి నమ్మకాన్ని నిలువునా నట్టేటా ముంచిన వ్యక్తి నారా చంద్రబాబు అని రాజీవ్‌ గుర్తుచేశారు. అమరావతి రాజధాని పేరిట తాత్కాలిక సచివాలయ నిర్మాణాలతో పాటు పేదలకు ఇళ్లంటూ టిడ్కో నిర్మాణాల్లోనూ బాబు భారీగా అవినీతికి పాల్పడ్డాడని.. స్కిల్‌డెవలప్‌మెంట్, ఇతర కుంభకోణాల అవినీతి డొంక కూడా కదులుతుందన్నారు. అధికారాన్ని అడ్డంపెట్టుకుని చంద్రబాబు, లోకేశ్‌ పోగేసుకున్న రూ.లక్షల కోట్లు అవినీతి సొమ్మును కక్కించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ వ్యవస్థలు చురుగ్గాపనిచేస్తాయని .. ఆ ఇద్దరు దొంగల్ని సమర్ధించేవారిని కూడా ప్రజలు ద్రోహులుగా చూడాలని రాజీవ్‌ అన్నారు. ఇన్నాళ్లూ రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ పేదలకు మేలు చేస్తున్న వైయ‌స్‌ఆర్‌సీపీ ప్రభుత్వంపై బురదజల్లిన చంద్రబాబు అండ్‌ కో.. దొంగల్ని ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరన్నారు. 2024 ఎన్నికల్లో టీడీపీతో పాటు చంద్రబాబును కొమ్ముకాస్తున్న ఇతర పార్టీలను సైతం చిత్తుచిత్తుగా ఓడించి.. 175 స్థానాలకు 175 చోట్ల వైయ‌స్‌ఆర్‌సీపీకే పట్టం కట్టేందుకు ప్రజలు ఎదురుచూస్తున్నారని రాజీవ్‌ ధీమా వ్యక్తం చేశారు.  

Back to Top