తాడేపల్లి: మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై విద్యార్థి లోకం గట్టిగా ననదించి అడ్డుకోవాలని వైయస్ఆర్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, లేళ్ల అప్పిరెడ్డి పిలుపునిచ్చారు. శనివారం తాడేపల్లిలోని వైయస్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ విద్యార్ధి విభాగం రీజనల్ కో-ఆర్డినేటర్లు, రాష్ట్ర ఉపాధ్యక్షులు, జిల్లా అధ్యక్షుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి పార్టీ విద్యార్ధి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు పానుగంటి చైతన్య, వర్కింగ్ ప్రెసిడెంట్ రవిచంద్ర, విద్యార్ధి విభాగం నాయకులు హాజరయ్యారు. వైయస్ఆర్ స్టూడెంట్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఈ నెల 23న రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై చేపట్టే కోటి సంతకాల ఉద్యమంపై లేళ్ల అప్పిరెడ్డి దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఆయన ఏమన్నారంటే.. `కూటమి ప్రభుత్వం అవలంభిస్తున్న విద్యార్ధి వ్యతిరేక విధానాలు, పెండింగ్ లో ఉన్న ఫీజు రీంబర్స్‌మెంట్, మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వంటి అంశాలపై అనేక ఆందోళనలు, పోరాటాలు చేస్తున్నాం. పార్టీ అనుబంధ విభాగాలలో విద్యార్ధి విభాగం క్రియాశీలకమైనది, మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై విద్యార్ధి లోకం గట్టిగా నినదించాలి, పోరాడాలి, అడ్డుకోవాలి. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కష్టపడిన ప్రతి ఒక్కరికీ గౌరవం, గుర్తింపు లభిస్తాయి. విద్యార్ధి నాయకుడిగా మీరు పునాదులు బలంగా వేసుకుంటేనే మీరు భవిష్యత్‌లో మంచి నాయకులుగా ఎదుగుతారు. ప్రభుత్వ వైఫల్యాలను బలంగా నిలదీద్దాం, విద్యార్ధి విభాగానికి పార్టీ పూర్తి అండగా ఉంటుంది. ప్రభుత్వం తప్పుడు కేసులు పెట్టి వేధించినా ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. విద్యార్ధుల ఆందోళనలకు ప్రభుత్వాలే కూలిపోయిన ఘటనలు ఉన్నాయి, విద్యార్ధి విభాగం అంతా సమాయత్తమై మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను అడ్డుకుందాం. చరిత్రలో చెప్పుకునేలా మన పోరాటం ఉండాలి. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై కోటి సంతకాలు, రచ్చబండ కార్యక్రమాలు జరుగుతున్నాయి. వీటిని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళదాం. విద్యార్ధి విభాగం కమిటీలన్నీ కూడా రాష్ట్రస్ధాయి నుంచి గ్రామ స్ధాయి వరకూ వెంటనే పూర్తిచేయాలి. కోటి సంతకాల సేకరణలో చురుగ్గా పాల్గొనాలి: పానుగంటి చైతన్య, రవిచంద్ర పిలుపు మెడికల్ కాలేజీలకు వ్యతిరేకంగా చేపడుతున్న కోటి సంతకాల సేకరణలో విద్యార్థి విభాగం నాయకులు చురుగ్గా పాల్గొనాలని వైయస్ఆర్‌సీపీ స్టూడెంట్ వింగ్ స్టేట్ ప్రెసిడెంట్ పానుగంటి చైతన్య, వర్కింగ్ ప్రెసిడెంట్ రవిచంద్ర పిలుపునిచ్చారు. పేద ప్రజలకు విద్య వైద్యం అందుబాటులోకి తేవాలన్న ఒక మంచి ఉద్దేశ్యంతో మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ తన హయాంలో నిర్మించిన ఆధునిక దేవాలయాలను అమ్మకానికి పెట్టిన కూటమి ప్రభుత్వ వైఖరిపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరించడం అంటే దానికి అనుసంధానంగా ఏర్పడే బోధనాసుపత్రులను కార్పొరేట్ శక్తులకు అప్పనంగా కట్టబెట్టడం కిందకే వస్తుందని అభిప్రాయపడ్డారు. పేద ప్రజలకు సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలను దూరం చేయాలన్న దురుద్దేశంతోనే కూటమి ప్రభుత్వం ఈ కుట్రలకు తెరతీసిందని ఆయన ఆరోపించారు. దీనిని ఎంత మాత్రం సహించే ప్రసక్తే లేదని హెచ్చరించారు. అందులో భాగంగానే తమ నాయకుడైన వైయస్ జగన్ పిలుపు మేరకు మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో ఈనెల 23వ తేదీన వైయస్సార్ స్టూడెంట్స్ యూనియన్ ఆధ్వర్యంలో కోటి సంతకాల సేకరణ కార్యక్రమం జరుగుతుందని వారు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొని సంతకాలు చేయడం ద్వారా జయప్రదం చేయాలని పానుగంటి చైతన్య, రవిచంద్ర విద్యార్ధి లోకానికి పిలుపునిచ్చారు.