హామీలు అమలు చేశామన్న కూటమి ప్రభుత్వ మాటలు దుర్మార్గం 

వైయ‌స్ఆర్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్ సతీష్ కుమార్ రెడ్డి ఆగ్రహం

వైయ‌స్ఆర్‌ జిల్లా వైయ‌స్ఆర్‌సీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్ సతీష్ కుమార్ రెడ్డి

ప్రజలకిచ్చిన హామీలను తుంగలో తొక్కిన కూటమి ప్రభుత్వం

పథకాలన్నీ అమలు చేశామని నిస్సిగ్గుగా చెప్పుకుంటున్నారు

సూపర్ 6 గురించి అడిగితే నాలుక మందం అంటున్న చంద్రబాబు

ఆడబిడ్డ నిధి కోసం రాష్ట్రాన్ని అమ్మాలంటున్న అచ్చెన్నాయుడు

కూటమి పాలనపై ధ్వజమెత్తిన ఎస్.సతీష్ కుమార్ రెడ్డి

కడప జిల్లాలో కొత్త సాంస్కృతికి ఆజ్యం పోస్తున్న లోకేష్

లోకేష్ ఆదేశాలతో టీడీపీ నేతలు బెదిరింపులు

భయపెట్టి వైయస్ఆర్‌సీపీని అడ్డుకోవాలనుకోవడం అవివేకం 

కూటమి సర్కార్‌ను హెచ్చరించి సతీష్ కుమార్ రెడ్డి

వైయ‌స్ఆర్ జిల్లా: ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలన్నీ తుంగలో తొక్కి, నిస్సిగ్గుగా హామీలన్నీ అమలు చేశామని చెబుతున్న కూటమి ప్రభుత్వ తీరుని వైయ‌స్ఆర్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్ సతీష్ కుమార్ రెడ్డి తీవ్రంగా ఆక్షేపించారు. వైయస్సార్ కడప జిల్లా వైయ‌స్ఆర్‌సీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ...  ఎన్నికల్లో ప్రాధాన్య పథకంగా ప్రచారం చేసిన సూపర్ సిక్స్ లో నాలుగింటి ఊసే లేదని, రెండు పథకాలను అరకొరా అమలు చేసి అన్నీ చేసేశామని చెప్పడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికార పార్టీకి చిత్తశుద్ధి ఉంటే క్షేత్రస్ధాయిలో పరిశీలనకు రావాలని సవాల్ విసిరారు. ఇదే విషయాన్ని బాధ్యత గల ప్రతిపక్షంగా ప్రజల తరపున ప్రశ్నిస్తే... డైవర్షన్ పాలిటిక్స్ కు తెరతీసిన చంద్రబాబు లేని లిక్కర్ స్కాంలో అరెస్టులు చేస్తున్నారని మండిపడ్డారు. అయినా ప్రజల తరపున పోరాటం ఆగదని సతీష్ రెడ్డి స్పష్టం చేశారు. కడప జిల్లాలో మంత్రి లోకేష్ ప్రోద్భలంతో కొత్త సంస్కృతిని తీసుకురావాలని అనుకుంటున్నారని మండిపడ్డారు. తనను వ్యక్తిగతంగా టార్గెట్ చేయాలనుకంటే.. అదే స్ధాయిలో ప్రతిస్పందన ఉంటుందని కూటమి పార్టీ నేతలను హెచ్చరించారు. 

ఇంకా ఆయన ఏమన్నారంటే...
  
సూపర్ సిక్స్ పై చర్చకు సిద్ధం:

కూటమి పార్టీ నేతలు ఎన్నికల ముందు సూపర్ సిక్స్ పథకాలు అమలు మా ప్రథమ ప్రాధాన్యత అని చెప్పారు. అధికారంలోకి వచ్చి ఏడాది గడిచిన తర్వాత సూపర్ సిక్స్ లో అన్నింటినీ అమలు చేశామని... ఒక్క ఆడబిడ్డ నిధి పథకం మాత్రమే పెండింగ్ అన్నారు. ఆ పథకాన్ని అమలు చేయాలంటే రాష్ట్రాన్ని అమ్మాలని మంత్రి అచ్చన్నాయుడు మాట్లాడారు. మరోవైపు ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా సూపర్ సిక్స్ అమలు చేశామని ఎవరైనా కాదంటే వారికి నాలుక మందం అంటూ మాట్లాడారు. వాస్తవానికి సూపర్ సిక్స్ లో ఏ మేరకు అమలు చేసిందో చూస్తే.. .అసలు వాస్తవం బయటపడుతుంది. 

ప్రజల పక్షాన ప్రశ్నిస్తే ప్రతిపక్షంపై కేసులు:

ఇటీవల వైయ‌స్ఆర్‌ కాంగ్రస్ పార్టీ శ్రేణులు జూన్ 4న తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాది కావస్తున్న నేపథ్యంలో.. ఇచ్చిన హామీలేవి అమలు చేయలేదని గుర్తు చేస్తూ దాన్ని బ్లాక్ డే కింద పాటిస్తూ రోడ్ల మీదకు వచ్చి ఆందోళన చేపట్టాం. ప్రజలను మోసం చేస్తుంటే ప్రతిపక్షంగా మా పాత్ర ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా వారి తరపున పోరాటం చేయడమే మా ధర్మం. చంద్రబాబు ప్రజలకిచ్చిన హామీలను అమలు చేయకుండా, ప్రతిపక్షంగా వాటిని ప్రశ్నిస్తున్న మాపై రోజుకొక తప్పుడు కేసు పెట్టి జైల్లో పెడుతున్నాడు. అందులో భాగంగానే లేని లిక్కర్ స్కామ్ ను తెరపైకి తీసుకొచ్చి ఒక రోజు రూ.1 లక్ష కోట్లు స్కామ్ అని, మరో రోజు రూ.10 వేల కోట్లు, ఇంకో రోజు రూ.4వేల కోట్లు అని తప్పుడు ప్రచారం చేశారు. అవినీతి జరిగిందని ఇంత మంది అరెస్టులు చేశారు. ఈ కేసులో ఇవిగో ఆధారాలు అని ఎక్కడైనా చూపించగలిగారా.? అధికారం చేతిలో ఉందని ఇష్టారీతిన అరెస్టులు చేస్తూ పోతున్న చంద్రబాబు, లోకేష్ లు దీనికి సమాధానం చెప్పాలి.

పాత మద్యం పాలసీలో నీకెంత ముట్టింటి బాబూ.?

2024 జూన్ 12న కూటమి ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేసిన దగ్గర నుంచి 2024 అక్టోబరు 26న నూతన మద్యం పాలసీ వచ్చేంత వరకు గత ప్రభుత్వం అమలు చేసిన పాత మద్యం విధానం అమల్లో ఉంది. గతంలో ఈ విధానంలో అవినీతి జరిగిందన్నప్పుడు.. మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అమల్లో ఉన్న ఈ స్కీం వల్ల నీకు ఎంత డబ్బులు ముట్టాయో చంద్రబాబూ సమాధానం చెప్పాలి. పాత మద్యం విధానంలో అవకతవకలు, అన్యాయం జరిగిందని చెబుతున్నప్పుడు మీ హయాంలో మీకు ఎన్నివేల కోట్లు ముడుపులు అందాయి. మీ మీద సీబీఐ విచారణ ఎందుకు వేయకూడదు.? కోట్లాది రూపాయలు అవినీతి జరిగిందని మీ పచ్చ పత్రికల్లో ఇష్టమొచ్చినట్లు వార్తలు రాశారు. మరి 12 జూన్ 2024 నుంచి అక్టోబరు వరకు అమల్లో ఉన్న పాత మద్యం విధానంలో జరిగిన లావాదేవీల నగదు మీ ఇంటికి వచ్చిందా చంద్రబాబూ సమాధానం చెప్పు. కనీస ఇంగిత జ్ఞానం లేకుండా ఇష్టం వచ్చినట్లు పేపర్లలో వార్తలు రాయించారు. 

లోకేష్ బెదిరింపులకు తలొగ్గేది లేదు:

వైయస్ఆర్‌సీపీ నాయకులు మంత్రి నారా లోకేష్ గురించి మాట్లాడితే తీవ్ర పరిణామాలు ఉంటాయంటూ జిల్లా టీడీపీ అధ్యక్షుడు, పులివెందుల టీడీపీ ఇన్‌చార్జ్‌లు బెదిరించే దోరణిలో మాట్లాడుతున్నారు. తనపై వైయస్ఆర్‌సీపీ నాయకులు విమర్శులు చేస్తున్నా టీడీపీ నాయకులు పట్టించుకోకపోవడంపై లోకేష్ వారిని హెచ్చరించడం వల్లే ఆలస్యంగా ఆ ఇద్దరు నాయకలు స్పందిచినట్లు తెలుస్తోంది. వారి బెదిరింపులకు భయపడేవారు ఎవరూ వైయస్ఆర్‌సీపీలో లేరు. తప్పుడు కేసులు పెట్టే మీ నైజంకు తలొగ్గే ప్రసక్తే లేదు. హామీలు అమలు చేయకపోతే చొక్కా పట్టుకుని ప్రశ్నించాలన్న లోకేష్ మాటలనే మేం గుర్తు చేస్తున్నాం. మమ్మల్ని హెచ్చరించే సాహసం చేస్తున్న వారు తమ రాజకీయ జీవితంలో చేసిన తప్పులను కూడా గుర్తు చేసుకోవాలి. ఇటువంటి బెదిరింపులు కట్టిపెట్టి, జిల్లా అభివృద్దిపై దృష్టి సారించాలి. ప్రజలకు మేలు చేసే అంశాల్లో వారి సత్తాను చాటుకోవాలని హితవు చెబుతున్నాం.

Back to Top