మా ప్రభుత్వానికి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలే వెన్నెముక

ఎమ్మెల్సీల ప్ర‌మాణ స్వీకారోత్స‌వంలో వైయ‌స్ఆర్‌సీపీ రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి

3 ఎమ్మెల్సీ స్థానాలు గెలిచినందుకే 2024 అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి సీఎం అయినట్లుగా చంద్రబాబు ఫీల్‌ 

చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు టిడ్కో ఇళ్లు ఎందుకు పూర్తిచేయలేదు

సీఎం వైయ‌స్‌ జగన్‌ నాయకత్వం రాష్ట్రానికి శాశ్వతంగా ఉండాలన్న‌దే బడుగు, బలహీన వర్గాల విశ్వాసం

రాష్ట్రం కోసం వైయ‌స్ఆర్‌సీపీ, రాష్ట్ర‌ భవిష్యత్తు కు వైయ‌స్ జగన్ అనే నినాదం వినిపిస్తోంది

అమ‌రావ‌తి:  వైయ‌స్ఆర్ కాంగ్రెస్‌ ప్రభుత్వానికి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలే వెన్నెముక అని వైయ‌స్ఆర్‌సీపీ రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి పేర్కొన్నారు. నూతనంగా ఎన్నికైన  శాసన మండలి సభ్యులు శాస‌న మండ‌లిలో ప్రమాణ స్వీకారం చేశారు.  ఈ కార్యక్రమంలో సజ్జల రామ‌కృష్ణారెడ్డి మాట్లాడారు. శాసన మండలి చైర్మన్‌గా ఎస్సీ సామాజిక వ‌ర్గానికి చెందిన వ్య‌క్తిని సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి నియ‌మించార‌ని, డిప్యూటీ చైర్‌పర్సన్‌ మైనారిటీ వర్గానికి చెందిన మహిళకు అవ‌కాశం క‌ల్పించార‌న్నారు. సీఎం వైయ‌స్ జగన్‌ అట్టడుగు వర్గాలను అభివృద్ధిలోకి తెస్తుంటే చంద్రబాబు ఓర్చుకోలేక కుట్రలు చేస్తున్నాడ‌ని మండిప‌డ్డారు. జీరో మార్కులు సంపాదించుకున్న చంద్రబాబు వైయ‌స్ జగన్‌కు 100 మార్కులు ఎందుకు రాలేదు? అని ప్రశ్నిస్తున్నారన్నారు. 3 ఎమ్మెల్సీ స్థానాలు గెలిచినందుకే 2024 అసెంబ్లీ ఎన్నికలు గెలిచి సీఎం అయినట్లుగా చంద్రబాబు ఫీల్‌ అవుతున్నార‌ని ఎద్దేవా చేశారు. చంద్రబాబు మోసానికి, వెన్నుపోటుకు ట్రేడ్‌ మార్క్  అని అభివ‌ర్ణించారు. చెప్పిన మాటపై నిలబడటం, చెప్పని హామీలను కూడా అమలుచేయటం వైయ‌స్ జగన్‌ ట్రేడ్‌ మార్క్ అని వివ‌రించారు.

రాష్ట్రాన్ని సంక్షేమ పథంలో అభివృద్ధివైపు తీసుకువెళ్లడానికి సీఎం వైయ‌స్‌ జగన్‌ కృషిచేస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలో అవినీతికి స్థానం ఉండకూడదని, పాలన పూర్తి పారదర్శకంగా ఉండాలని వైయ‌స్ జగన్‌ భావిస్తారని చెప్పారు. చంద్రబాబును ఎప్పుడెప్పుడు సీఎం చేద్దామా అని ఎల్లోమీడియా ఉవ్విల్లూరుతోందని త‌ప్పుప‌ట్టారు.  అందుకు అనుగుణంగానే చంద్రబాబుకు ఎలివేషన్లు ఇస్తూ విపరీతంగా ప్రచారం చేస్తున్నార‌ని ధ్వ‌జ‌మెత్తారు. చంద్రబాబు ప్రతి ఎన్నికల్లో ఎల్లోమీడియాతో విపరీతంగా ప్రచారం చేయించుకుంటార‌ని వ్యాఖ్యానించారు. ఒకవేళ అధికారంలోకి వస్తే ప్రజలను అభివృద్ధి అనే భ్రమలో ఉంచి తన కోటరీలోని  నాయకులకు మాత్రమే లబ్ధి చేకూర్చే వార‌న్నారు. చంద్రబాబు తాను సీఎంగా ఉన్నప్పుడు ఫలానా ప్రాజెక్టు కట్టాను అని చెప్పుకోవడానికి ఏదీలేదన్నారు. సీఎం వైయ‌స్ జగన్‌ శాచురేషన్‌ మోడ్‌లో ప్రజలకు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నార‌ని పేర్కొన్నారు.

చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు టిడ్కో ఇళ్లు ఎందుకు పూర్తిచేయలేద‌ని ప్ర‌శ్నించారు. ఇప్పుడు సీఎం వైయ‌స్ జగన్ గ‌త ఐదేళ్ల పాల‌న‌లో చంద్రబాబు పెట్టిన రూ.8,000 కోట్లు బకాయిలు చెల్లించి, అసంపూర్తిగా వదిలేసిన టిడ్కో ఇళ్లను పూర్తిచేసి లబ్ధిదారులకు అందజేస్తుంటే వాటిముందు సెల్ఫీలు తీసుకుని బిల్డప్‌ ఇస్తున్నాడ‌ని దుయ్య‌బ‌ట్టారు. చంద్రబాబు చేపట్టిన అమరావతి నిర్మాణం ఒక రియల్‌ ఎస్టేట్‌ స్కామ‌ని విమ‌ర్శించారు. చంద్రబాబుకు చేసింది చెప్పుకోవటానికి ఏమీలేదన్నారు. 2024 ఎన్నికల్లో సింగిల్‌గా పోటీచేస్తానని చెప్పే దమ్ము చంద్ర‌బాబుకు ఉందా అని స‌వాలు విసిరారు. వైయ‌స్ఆర్ కాంగ్రెస్‌ పార్టీ మారీచులతో పోరాడుతోంద‌ని, చంద్రబాబుకు తెలిసినన్ని టక్కుటమార విద్యలు మాకు తెలియద‌న్నారు. టీడీపీ, ఎల్లోమీడియా మళ్లీ తోడేళ్ల మందలా ప్రజల మీదపడబోతున్నాయ‌న్నారు. ఆ దుష్టశక్తుల ప్రభావం ప్రజలపై పడకుండా ప్రభుత్వం ‘గడపగడపకూ మన ప్రభుత్వం’ కార్యక్రమాన్ని చేపట్టింద‌న్నారు. 
టీడీపీ ఎప్పుడూ ఇలాంటి కార్యక్రమం చేపట్టలేద‌ని పేర్కొన్నారు. దేశంలోని  ఏ ప్రభుత్వం చేయలేని సాహసం వైయ‌స్ జగన్‌ ప్రభుత్వం చేస్తోంద‌ని ఉద్ఘాటించారు. 2014–19 మధ్య టీడీపీ హయాంలో జరిగిన విధ్వంసాన్ని ప్రజలకు ఎప్పటికీ గుర్తు ఉంటుంద‌న్నారు.  సీఎం వైయ‌స్‌ జగన్‌ నాయకత్వం రాష్ట్రానికి శాశ్వతంగా ఉండాలనే బడుగు, బలహీన వర్గాల విశ్వాసమ‌న్నారు. 2024 ఎన్నికల ఫలితాల్లో ఇదే ప్రతిఫలించాల‌ని ఆకాంక్షించారు. 

 మిస్డ్‌కాల్‌ ప్రోగ్రామ్‌ గ్రాండ్‌ సక్సెస్  
వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వ‌ర్యంలో ఈ నెల 7వ తేదీ నుంచి జ‌గ‌న‌న్నే మా భ‌విష్య‌త్ కార్య‌క్ర‌మం దిగ్విజ‌యంగా రాష్ట్ర‌వ్యాప్తంగా కొన‌సాగుతుంద‌ని స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి తెలిపారు. 82960 82960 మిస్డ్‌కాల్‌ ప్రోగ్రామ్‌ గ్రాండ్‌ సక్సెస్‌ అయింద‌ని ఆయ‌న వెల్ల‌డించారు. వైయ‌స్ జగన్‌ ప్రభుత్వంలో రాష్ట్రంలోని ప్రతి కులానికి, ప్రతి వర్గానికి తమ ఉనికి తెలుస్తోంది, తమ హక్కులు తెలుస్తున్నాయ‌న్నారు. సీఎం వైయ‌స్‌ జగన్‌ బడుగు, బలహీన వర్గాలను ప్రోత్సహిస్తూ మెజారిటీ పదవులు ఇచ్చార‌ని గుర్తు చేశారు. రాష్ట్రం కోసం వైయ‌స్ఆర్‌సీపీ , రాష్ట్రానికి అవసరం వైయ‌స్ఆర్‌సీపీ, రాష్ట్రానికి భవిష్యత్తు కు వైయ‌స్ జగన్‌ అనే నినాదాలు ప్రజల నుంచే రావటానికి పార్టీ శ్రేణులు కృషిచేయాల‌ని స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి పిలుపునిచ్చారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top