వైయస్‌ వివేకానందరెడ్డి మరణం వెనుక కుట్ర

వాస్తవాలు బయటకురావాలంటే సీబీఐ దర్యాప్తు జరగాలి

గమ్మడికాయల దొంగలు భుజాలు తడుముకున్నట్లుగా ఆదినారాయణరెడ్డి తీరు

టీడీపీ ప్రభుత్వ సిట్‌పై మాకు నమ్మకం లేదు

గత ఐదేళ్లుగా వైయస్‌ కుటుంబం, కడప టార్గెట్‌గా టీడీపీ ఆకృత్యాలు

కడప ఎంపీ అభ్యర్థిగా ఆదినారాయణరెడ్డి ఎంపికతోనే మహాకుట్రకు బీజం

వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ

హైదరాబాద్‌: వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత, దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి సోదరుడు, వైయస్‌ జగన్‌ చిన్నాన్న వైయస్‌ వివేకానందరెడ్డి మరణంతో యావత్తు పార్టీ తీవ్ర దిగ్భ్రాంతి చెందింది. వైయస్‌ వివేకానందరెడ్డి మరణం వెనుక కుట్ర కోణం దాగి ఉందని, వాస్తవాలు బయటకు రావాలంటే సీబీఐతో విచారణ జరిపించాలని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ డిమాండ్‌ చేశారు. ఉదయం నుంచి వరుసగా అనేక సంఘటనలు వెలుగులోకి వస్తున్నాయని, అనుమానం బలపడే విధంగా అనేక పరిణామాలు జరుగుతున్నాయన్నారు. హైదరాబాద్‌ లోటస్‌పాండ్‌లోని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కార్యాలయంలో వాసిరెడ్డి పద్మ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. జమ్మలమడుగు ఎన్నికల ఇన్‌చార్జిగా ఉన్న వైయస్‌ వివేకానందరెడ్డి మైదుకూరులో ఎన్నికల ప్రచారం నిర్వహించిన అనంతరం తిరిగి ఇంటికి వచ్చారని తెలిసిందన్నారు. ఈ సందర్భంలో ఆయన అనుమానాస్పద పరిస్థితుల్లో మరణించిన సంఘటన వెనుక ఉన్నత స్థాయి విచారణ జరగాల్సిన అవసరం ఉందన్నారు. 

గుమ్మడికాయల దొంగ ఎవరెంటే భుజాలు తడుముకున్నట్లుగా ఆదినారాయణరెడ్డి మాట్లాడుతున్నారని వాసిరెడ్డి పద్మ అన్నారు. ఉన్నత స్థాయి విచారణ అంటే సిట్‌ వేశామని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయని, రాష్ట్రంలో అనేక సంఘటనల్లో సిట్‌ దర్యాప్తు ఏ విధంగా ఉందో అందరికీ తెలుసన్నారు. ఈ దర్యాప్తు సంస్థలతో వివేకానందరెడ్డి మరణం వెనుక కుట్రలోని వాస్తవాలు బయటకువస్తాయనే నమ్మకం లేదన్నారు. ఘటనపై సీబీఐ ఎంక్వైరీ జరిపించాలని డిమాండ్‌ చేశారు. 

కడపలో మేము గెలిచి తీరుతాం. పులివెందులలో ఎలా నెగ్గుతామో చేసి చూపిస్తామని గత కొద్ది రోజులుగా టీడీపీ నేతలు మాట్లాడుతున్న తీరు ప్రజలంతా గమనిస్తున్నారని, గత ఐదేళ్లుగా కడప, వైయస్‌ కుటుంబం టార్గెట్‌గా చంద్రబాబు డైరెక్షన్‌లో ఎలాంటి రాజకీయాలు జరిగాయో అందరికీ తెలుసని, కడపను కొట్టాలనే టార్గెట్‌గా రాజకీయాలు చేస్తూ టీడీపీ నేతలు బహిరంగంగా మాట్లాడిన సందర్భాలను ఆమె గుర్తు చేశారు. కడప ఎంపీ అభ్యర్థిగా జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డిని ఎంపిక చేసినప్పుడే మహాకుట్రకు బీజం పడినట్లుగా అర్థం అవుతుందన్నారు. వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ గుర్తుపై గెలిచి చంద్రబాబు పంచన చేరి ఆదినారాయణరెడ్డి మంత్రిగా ఎలాంటి ఆకృత్యాలు చేస్తున్నాడో ప్రజలకు తెలుసన్నారు. ఈ నేపథ్యంలో కీలక ఎన్నికల సమయంలో వైయస్‌ వివేకానందరెడ్డి మరణంపై కులంకుశంగా విచారణ జరగాలన్నారు. 

 

Back to Top