తాడేపల్లి: రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ప్రతిపక్ష నేత చంద్రబాబుకు ఏజెంట్‌గా, టీడీపీ కార్యకర్తగా వ్యవహరిస్తున్నారని వైయస్ఆర్‌సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. నిమ్మగడ్డ తాటాకు చప్పుళ్లకు ఎవరూ భయపడరని ఆయన వ్యాఖ్యానించారు. పంచాయతీ ఎన్నికల్లో ఏకగ్రీవాలను సాకుగా చూపి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని గృహ నిర్భందం చేయాలని ఆదేశాలు జారీ చేయడం సిగ్గు చేటు అన్నారు. శనివారం సజ్జల రామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడారు. అడుగడుగునా అడ్డుపడుతున్న నిమ్మగడ్డ.. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అడుగడుగునా ప్రభుత్వానికి అడ్డుపడుతూ చంద్రబాబు చెప్పినట్లుగా వ్యవహరిస్తున్నారని సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శించారు. గతేడాది మార్చిలో పరిషత్ ఎన్నికల సందర్భంగా అధిక స్థానాల్లో వైయస్ఆర్‌సీపీ అభ్యర్థులు ఎంపీటీసీ, జడ్పీటీసీ సభ్యులుగా ఏకగ్రీవంగా ఎన్నిక అవుతున్న నేపథ్యంలో కరోనా సాకు చూపి వాయిదా వేశారన్నారు. ప్రస్తుతం పంచాయతీ ఎన్నికల్లో ఏకగ్రీవాలు ఊపందుకోవడంతో ఎన్నికల కమిషనర్ ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. ఎన్నికల విధుల్లో ఉన్న అధికారుల పై ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతూ..వారి మనోధైర్యం కోల్పోయేలా ప్రవర్తిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిమ్మగడ్డ ఎవరి డైరెక్షన్ లో పని చేస్తున్నారనేది ఆయన ప్రవర్తన లోనే అర్థం అవుతోందన్నారు. ప్రభుత్వానికి చెడ్డపేరు తీసుకుని రావాలని కుటిల ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు. తప్పులను ఎత్తిచూపితే గృహ నిర్బంధం అంటారా? ఎన్నికల కమిషనర్ చేస్తున్న తప్పులను ఎత్తిచూపితే మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని గృహ నిర్బంధం చేయాలని ఆదేశాలు ఇస్తారా అని సజ్జల రామకృష్ణారెడ్డి నిలదీశారు. ఎస్ఈసి ఎన్నికల పనులను మార్గదర్శకంగా చేయాలే తప్ప..తన బాధ్యత మరచి పరిమితిని మించి నిమ్మగడ్డ ప్రవర్తిస్తున్నారని తప్పుపట్టారు. రాష్ట్రంలో సర్వాధికారాలు తనకె ఉన్నాయంటూ నిమ్మగడ ధోరణి ఉందన్నారు. చిత్తూరు, గుంటూరు జిల్లాలో ఏకగ్రీవాలపై డిక్లరేషన్ ఇచ్చాక నిలిపివేయడం దారుణమన్నారు. ఇది చట్టవ్యతిరేక నిర్ణయంగా అభివర్ణించారు. ఎప్పటి లాగే ఏకగ్రీవాలు జరిగాయి తప్ప అధిక సంఖ్యలో లేవు అన్నారు. రాయలసీమ జిల్లాలో చిత్తూరు కూడా భాగమే అన్నారు. అక్కడ కూడా సాధారణంగానే ఏకగ్రీవాలు జరిగాయని చెప్పారు. ఏకగ్రీవం పై విచారణ చేస్తే ప్రజల నుంచి నిమ్మగడ కు వ్యతిరేకత వస్తుందన్నారు. ఏకగ్రీవాలను కారణంగా చుపి మంత్రి పెద్దిరెడ్డి గృహానిర్బంధం నిర్ణయం తీసుకోవడం సరికాదన్నారు. గ్రామాల అభివృద్ధికోసమే ఏకగ్రీవం తప్ప మరేమీ కాదు అని స్పష్టం చేశారు. ఏకగ్రీవం జరిగేది అక్రమం అంటున్న నిమ్మగడ వివరణ ఇవ్వాలని సజ్జల రామకృష్ణారెడ్డి డిమాండు చేశారు. న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాం.. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై విధించిన గృహ నిర్భందంపై న్యాయస్థానాలను ఆశ్రయిస్తామని సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. మొదటి నుంచి కూడా నిమ్మగడ్డ వ్యవహారం ఒకేలా ఉందని, టీడీపీకి మేలు చేసేలా ఆయన వ్యవహరిస్తున్నారని తప్పుపట్టారు. ఆయన చర్యలను ప్రజలు గమనిస్తున్నారని చెప్పారు. చంద్రబాబు ఏజెంట్ గా, టీడీపీ కార్యకర్త గా ఎస్ ఈ సి నిమ్మగడ వ్యవహారం ఉందన్నారు. చంద్రబాబు నేరుగా ప్రజలోకి వెళ్లలేక వ్యవస్థలను వాడుకుంటున్నారని విమర్శించారు. సీఎం వైయస్ జగన్ పథకాలతో సీట్లు పెరిగాయి ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో స్థానిక సంస్థల ఎన్నికల్లో వైయస్ఆర్‌సీపీ సీట్లు పెరుగుతాయని సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. ప్రజలను తప్పుదోవ పట్టించేందుకే ప్రతిపక్షం కుట్ర చేస్తుందన్నారు. నిమ్మగడ ఉన్న కాలం నిక్కచ్చిగా వ్యవహరించాలన్నారు. సీనియర్ మంత్రికే దిక్కు లేదు మీరెంత అనే కోణంలో ప్రభుత్వ అధికారులను బెదిరించే యత్నం జరుగుతుందన్నారు. అధికారులు నిమ్మగడ కు భయపడకుండా నిష్పక్షపాతంగా వ్యవహరించాలన్నారు. నిమ్మగడ రిటైర్ తర్వాత చూడాల్సినవి చాలా ఉన్నాయని చెప్పారు. కేవలం నిమ్మగడ వివరణ అడిగే అధికారం ఉంది తప్ప చర్యలకు అధికారం లేదని పేర్కొన్నారు. అధికారంలో ఉన్నది వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వం.. టీడీపీ ప్రభుత్వం కాదు అనేది నిమ్మగడ గమనించాలన్నారు. ఎస్ ఈ సిని అడ్డం పెట్టుకుని చంద్రబాబు తన పావు లాగా నిమ్మగడ ను వాడుకుంటున్నారని, రమేష్ కుమార్ చేసిన తప్పుడు పనులకు కచ్చితంగా శిక్ష తప్పదని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు.