విజయవాడ: సీఎం చంద్రబాబుకు చిత్తశుద్ధి ఉంటే వైయస్ఆర్‌సీపీ నేతలు, కార్యకర్తలపై దాడులను ఆపాలి, దాడులకు కారణమైన నిందితులను శిక్షించాలని మాజీ ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను డిమాండ్ చేశారు . చాలా ఘటనల్లో కనీసం ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయడం లేదని కామెంట్స్ చేశారు. మాజీ ఎమ్మెల్యే ఉదయభాను ఆదివారం మీడియాతో మాట్లాడుతూ..‘కౌంటింగ్ జరిగిన నాటి నుంచి టీడీపీ నేతలు ఇష్టానుసారంగా దాడులు చేస్తున్నారు. రాష్ట్రంలో మాదే ప్రభుత్వం. మాదే రాజ్యం అనేలా విర్రవీగుతున్నారు. గత ఐదేళ్లలో జగ్గయ్యపేటలో టీడీపీ నేతలపై ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. ఈ రెండు నెలల్లో వైయస్ఆర్‌సీపీకి చెందిన 15 మందిపై దాడులు చేశారు. రోడ్డుపై ఎవరూ తిరగకూడదనేలా వ్యవహరిస్తున్నారు. గింజుపల్లి శ్రీనివాసరావు తండ్రి వీరయ్య మంచి నాయకులు. ఇందిరమ్మ ఇళ్లు కట్టినందుకు వైయస్ఆర్ వీరయ్యను సన్మానించారు. 2009లో వీరయ్యను ఆనాడు టీడీపీ నేతలు పొట్టనపెట్టుకున్నారు. నాడు తండ్రిని చంపిన వారే ఈరోజు శ్రీనివాసరావును హతమార్చాలని చూశారు. వీరయ్య హత్యలో ప్రస్తుత జగ్గయ్యపేట ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ సోదరుడు ధనుంజయ్ కూడా ఒక ముద్దాయి. టీడీపీ అధికారంలోకి వచ్చాక ఎమ్మెల్యే సోదరుడి రౌడీయిజం ఎక్కువై పోయింది. వైయస్ఆర్‌సీపీ కార్యకర్తలను కొట్టండి.. చంపండి.. కేసులు లేకుండా చూసుకుంటానని చెబుతున్నాడు. పక్కాగా రెక్కీ నిర్వహించి మరీ శ్రీనివాసరావును చంపాలని చూశారు. మేం దాడులు చేయం.. హింసను ప్రోత్సహించమని చంద్రబాబు చెబుతున్నారు. కానీ, టీడీపీ నేతలు, శ్రేణులు దాడులు చేస్తూ రెచ్చిపోతున్నారు. ప్రభుత్వం తక్షణమే దాడులను నిలువరించాలి. దాడులకు పాల్పడిన వారిపై పీడీ యాక్ట్ నమోదు చేయాలి. వీరయ్య హత్య కేసులో సీబీసీఐడీ కేసు నుంచి సాక్షులను తొలగించారు. పోలీసులే ఛార్జిషీట్ వేసి కేసును దర్యాప్తు చేయాలి. నిందితులను ప్రభుత్వం కఠినంగా శిక్షించాలి. చంద్రబాబుకు చిత్తశుద్ధి ఉంటే దాడులను ఆపాలి. నిందితులను శిక్షించాలి. రాష్ట్రంలో ఎక్కడ దాడి జరిగినా స్టేషన్ బెయిల్ ఇచ్చి వదిలేస్తున్నారు. చాలా ఘటనల్లో కనీసం ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయడం లేదు. పోలీసులను అడిగితే ఎఫ్ఐఆర్ నమోదు చేస్తాం.. చూస్తామంటున్నారు. గతరాత్రి ఘటనలో అరెస్ట్ చేసిన వారిని కేసు తేలేవరకూ విడిచిపెట్టొద్దు’ అని డిమాండ్ చేశారు.