కుప్పంలో పోటీచేసేందుకు బాబు భయపడుతున్నాడు

అందరం సమష్టిగా పనిచేసి 175 స్థానాలు సాధించుకుందాం

ప్రతి సచివాలయ పరిధిలో పార్టీ తరఫున ముగ్గురు కన్వీనర్లను నియమిస్తాం

కల్యాణదుర్గం విస్తృతస్థాయి సమావేశంలో పార్టీ రీజనల్‌ కోఆర్డినేటర్, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

అనంతపురం : అందరం సమష్టిగా పనిచేస్తే 175 స్థానాలకు 175 గెలవడం ఖాయమని వైయస్‌ఆర్‌ సీపీ రీజనల్‌ కోఆర్డినేటర్, విద్యుత్‌ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. ప్రభుత్వం చేస్తున్న మంచిని ప్రతీ గడపకూ వివరించాలని సూచించారు. అనంతపురం జిల్లా కల్యాణదుర్గం నియోజకవర్గ వైయస్‌ఆర్‌ సీపీ విస్తృతస్థాయి సమావేశానికి పార్టీ రీజనల్‌ కోఆర్డినేటర్, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి, స్థానిక ఎమ్మెల్యే ఉషాశ్రీచరణ్‌ హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి పెద్దిరెడ్డి మాట్లాడుతూ.. 
 
గ్రామ, వార్డు సచివాలయాలతో పరిపాలనకు ప్రజల దగ్గరకు తీసుకెళ్లామన్నారు. పార్టీ తరఫున ప్రతీ సచివాలయ పరిధిలో ముగ్గురు కన్వీనర్లను (ఒక మహిళ, ఇద్దరు పురుషులు) నియామకం చేపడుతున్నామని చెప్పారు. కుప్పం నుంచి పోటీ చేయడానికి చంద్రబాబు భయపడుతున్నాడని, కుప్పం వదిలేసి, కల్యాణదుర్గం, కృష్ణా జిల్లా మైలవరం నుంచి పోటీ చేసేందుకు బాబు ఆలోచన చేస్తున్నట్టుగా ప్రచారం జరుగుతుందని తెలిపారు. కుప్పంలో బాబుకు ఎదురైన పరిస్థితులే.. కల్యాణదుర్గంలోనూ ఎదురవ్వాలని, ఎక్కడికక్కడ చంద్రబాబును నిలదీయాలని సూచించారు. ముఖ్యమంత్రి పెట్టిన టార్గెట్‌ను సాధించేందుకు పార్టీ నాయకులు, కార్యకర్తలందరం సమష్టిగా పనిచేద్దామని సూచించారు. 

బీసీల గురించి మాట్లాడే అర్హత బాబుకు లేదు..
అనంతరం మంత్రి ఉషాశ్రీ చరణ్‌ మాట్లాడుతూ.. బీసీ వర్గాలపై పేటెంట్‌ రైట్స్‌ సీఎం వైయస్‌ జగన్‌కు, వైయస్‌ఆర్‌ సీపీకి మాత్రమే ఉన్నాయన్నారు. బీసీలకు సీఎం వైయస్‌ జగన్‌ అత్యున్నత పదవులు ఇచ్చారన్నారు. లాస్ట్‌ ఛాన్స్‌ అంటున్న చంద్రబాబుకు, ఫస్ట్‌ ఛాన్స్‌ అంటున్న పవన్‌కు బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు. బీసీల గురించి మాట్లాడే అర్హత చంద్రబాబుకు అసలే లేదన్నారు. 
 

Back to Top