తాడేపల్లి: రాష్ట్రంలో పేద విద్యార్థులు, నిరుద్యోగులు తరఫున కూటమి ప్రభుత్వంపై పోరుకి వైయస్ఆర్‌సీపీ సిద్ధమైంది. రేపు(బుధవారం) ‘‘యువత పోరు’’ పేరుతో ధర్నా కార్యక్రమం నిర్వహించాలని వైయస్ఆర్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపునిచ్చారు. ప్రధాన ప్రతిపక్షంగా వైయస్ఆర్‌సీపీ .. యువతకు, విద్యార్ధులకు అండగా నిలిచి ప్రభుత్వం విధానాలపై పోరాడేందుకు సిద్ధమైంది. ఇందుకోసం తలపెట్టిన యువత పోరులో కలిసి వచ్చే అన్ని విద్యార్థిసంఘాలు, యువజన సంఘాలతో వైయస్ఆర్‌సీపీ నేతృత్వంలో శాంతియుతంగా నిరసన కార్యక్రమాలను నిర్వహించనుంది. అన్ని జిల్లా కలెక్టరేట్ల ఎదుట విద్యార్థులు, నిరుద్యోగులు, యవతతో కలిసి వైయస్ఆర్‌సీపీ శ్రేణులు ప్రదర్శన, ధర్నా కార్యక్రమం చేపడుతారు. అనంతరం కలెక్టర్లకు సమస్యలపై విజ్ఞాపన పత్రాలు అందజేస్తారు. రేపే పార్టీ ఆవిర్భావ వేడుకలు.. వైయస్ఆర్‌సీపీ ఆవిర్భావ దినోత్సవం ఈ నెల 12వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నిర్వహించనున్నారు వాడవాడలా పార్టీ ఆవిర్భావ వేడుకలను ఉత్సాహంగా జరుపుకోనున్నారు. ప్రతి పల్లెలోనూ పార్టీ జెండాలను ఎగురవేసేందుకు పార్టీ శ్రేణులు సిద్ధమయ్యారు. పార్టీ పట్ల సానుభూతితో ఉన్న శ్రేణులను ఆవిర్భావ వేడుకల్లో భాగస్వాములను చేయనున్నారు. ప్రజల్లో పార్టీకి ఉన్న ఆదరణను నిలబెట్టుకుంటూ, రానున్న రోజుల్లో వారికి అండగా ఉంటామనే భరోసాను కల్పిస్తారు.