ప్రజా సమస్యలను పట్టించుకోకుండా కూట‌మి నేత‌లు డైవర్ట్ పాలిటిక్స్ 

అనంత‌పురం మేయర్ మ‌హ‌మ్మ‌ద్ వ‌సీమ్ ఫైర్‌

అనంత‌పురం:  నగరంలో ప్రజా సమస్యలను పరిష్కరించకుండా కూటమి నేతలు డైవర్ట్ పాలిటిక్స్ చేస్తున్నారని నగర మేయర్ మ‌హ‌మ్మ‌ద్ వసీమ్ మండిప‌డ్డారు. నగరపాలక సంస్థ కార్యాలయంలోని తన ఛాంబర్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. ఎన్నికల సమయంలో సూపర్ సిక్స్ హామీల పేరిట ప్రజలను మభ్యపెట్టి అపోహలు సృష్టించి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం, దాదాపు రెండేళ్లు గడుస్తున్నా ఇప్పటివరకు ఒక్క హామీని కూడా అమలు చేయలేదని ఆరోపించారు. ప్రజల సమస్యలను పరిష్కరించకుండా అంబటి రాంబాబు, జోగి రమేష్ ఇళ్లపై దాడి, తిరుమల లడ్డూ వ్యవహారం వంటి అంశాలపై అసత్య ప్రచారాలు చేస్తూ రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు.

నగర పాలక సంస్థ పాలన కూటమి ప్రభుత్వంలో పూర్తిగా గాడి తప్పిందని మేయర్ ఆరోపించారు. గత ఏడాది నుంచి తమ దృష్టికి వచ్చిన సమస్యలను కలెక్టర్, కమిషనర్ దృష్టికి తీసుకెళ్లినా స్పందన లేదన్నారు. నగరంలో పారిశుధ్య పరిస్థితి దారుణంగా మారిందని, చెత్త ట్రాక్టర్లు సక్రమంగా తిరగడం లేదని, సిబ్బందికి సరైన డీజిల్ సరఫరా చేయడం లేదని తెలిపారు.

డ్రైనేజీ కాలువల శుభ్రత, ప్రధాన రోడ్ల ఊడ్చే కార్యక్రమాలు కూడా సరిగా జరగడం లేదని విమర్శించారు. గతంలో వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ  హయాంలో క్లాప్ వాహనాల ద్వారా ఇంటింటి చెత్త సేకరణ జరిగేదని గుర్తు చేశారు. నగర పాలక సంస్థలో కనీసం ఎంహెచ్‌ఓను నియమించలేని పరిస్థితి నెలకొందని, టౌన్ ప్లానింగ్ విభాగాన్ని అవినీతి మయం చేశారని ఆరోపించారు. అనుమతులు లేకుండా నిర్మాణాలు జరుగుతున్నా అధికారులు చర్యలు తీసుకోవడం లేదన్నారు. నిర్మాణ అనుమతులు కూటమి నేతల సూచనలతోనే జారీ అవుతున్నాయని తీవ్ర విమర్శలు చేశారు.

రాష్ట్రంలోని ఇతర మున్సిపాలిటీల్లో బీపీఎస్ దరఖాస్తులు వేగంగా పరిష్కరిస్తుండగా, ఇక్కడ మాత్రం బేరసారాల కారణంగా ప్రక్రియ ముందుకు సాగడం లేదని ఆరోపించారు. అనధికార నిర్మాణాలు పెరిగిపోతున్నాయని, కలెక్టరేట్‌కు ఫిర్యాదులు చేసినా స్పందన లేదన్నారు. నగర పాలక సంస్థ నిధులతో చేపట్టే పనులకు ఎమ్మెల్యే ఫోటోలు వేసుకోవడాన్ని తాము వ్యాఖ్యానించబోమని, ప్రజలే తగిన సమాధానం చెబుతారని అన్నారు. సీ బిల్లు పేరిట అధికార పార్టీ నేతలు, అధికారులు కలిసి ప్రజా సొమ్మును దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు.

నగర సమస్యలు, అవినీతి ఆరోపణలపై జిల్లా కలెక్టర్ వెంటనే దృష్టి సారించాలని మేయర్ కోరారు. ప్రజా సమస్యలపై, కూటమి నేతల అవినీతిపై ప్రజల పక్షాన వైయ‌స్ఆర్‌సీపీ ఆధ్వర్యంలో పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. సమావేశంలో కార్పొరేటర్లు సైఫుల్లా బేగ్, మల్లెమీద నరసింహులు, అనిల్ కుమార్ రెడ్డి, రహంతుల్లా, టీవీ చంద్రమోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
 

Back to Top