ప్రజల ప్రాణాల కంటే.. పంచాయతీ ఎన్నికలు ముఖ్యమా?

 వైయస్‌ఆర్‌సిపి అధికారప్రతినిధి, ఎమ్మెల్యే  అంబటి రాంబాబు  

 చంద్రబాబు జేబులో మనిషిలా... బంటులా, తొత్తులా... బానిసగా నిమ్మగడ్డ వ్యవహరిస్తున్నాడు
 
వ్యాక్సినేషన్ తర్వాత ఒకటి, రెండు నెలల్లో ఎన్నికలు నిర్వహిస్తే.. చంద్రబాబుకు, నిమ్మగడ్డకు కలిగే నష్టం ఏమిటి..?

తిరుపతి ఉప ఎన్నికల్లో ఘోర ఓటమి తప్పదనే భయంతో చంద్రబాబు వున్నాడు 

 చీకట్లో విగ్రహాల విధ్వంసం చేసినట్టే.. చీకట్లో గ్రామ స్వరాజ్యాన్ని ధ్వంసం చేయాలనుకుంటున్నారా..? 

  కోవిడ్ వల్ల ఉద్యోగులు ఎవరైనా మరణిస్తే నిమ్మగడ్డ బాధ్యత వహిస్తారా?
 

వాక్సినేషన్ కోసం దేశమంతా సిద్దంగా వుంటే... నిమ్మగడ్డకు కనిపించడం లేదా? 

తాడేప‌ల్లి:  పంచాయ‌తీ ఎన్నిక‌ల‌పై ఏక‌ప‌క్ష నిర్ణ‌యం తీసుకున్న‌ రాష్ట్ర ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్ నిమ్మ‌గ‌డ్డ ర‌మేష్ కుమార్ తీరును వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్ర‌తినిధి, ఎమ్మెల్యే అంబ‌టి రాంబాబు తీవ్రంగా త‌ప్పుప‌ట్టారు. రాష్ట్రంలో ప్ర‌జ‌ల ప్రాణాల కంటే పంచాయ‌తీ ఎన్నిక‌లు ముఖ్య‌మా అని ఆయ‌న ప్ర‌శ్నించారు. చంద్ర‌బాబు చెప్పిన‌ట్లుగా ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్ వ్య‌వ‌హ‌రించ‌డం ఏంట‌ని నిల‌దీశారు. చంద్ర‌బాబుకు మేలు చేసేందుకు కోవిడ్ స‌మ‌యంలోనూ పంచాయ‌తీ ఎన్నిక‌లు పెట్టాల‌ని ర‌మేష్‌కుమార్ నిర్ణ‌యం తీసుకున్నార‌ని పేర్కొన్నారు. ఎన్నిక‌ల స‌మ‌యంలో ప్రాణ‌న‌ష్టం జ‌రిగితే నిమ్మ‌గ‌డ్డ బాధ్య‌త వ‌హిస్తారా అని నిల‌దీశారు. తాడేప‌ల్లిలోని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాల‌యంలో అంబ‌టి రాంబాబు మీడియాతో మాట్లాడారు.

ప్రజాస్వామ్యంలో అన్యాయమైన పోకడ..
రాష్ట్రంలో ప్రత్యేక పరిస్థితులు వున్న నేపథ్యంలో... రాష్ట్ర ప్రభుత్వం తన సంసిద్ధతను వ్యక్తం చేయని పరిస్థితిలో, రీజనబుల్ కాజ్ లను చెప్పినా కూడా పట్టుదలగా, మొండిగా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్‌ కుమార్ పంచాయ‌తీ ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించడం ప్రజాస్వామ్యంలో అన్యాయమైన పోకడ అని వైయస్‌ఆర్‌సిపి అధికార ప్రతినిధి, ఎమ్మెల్యే  అంబటి రాంబాబు మండిపడ్డారు. ప్రతిపక్ష నేత చంద్రబాబుకు తొత్తులా... బంటులా.. బానిసలా... జేబులో మనిషిలా మారి, చంద్రబాబు ప్రయోజనాల కోసమే నిమ్మగడ్డ రమేష్‌ కుమార్ పనిచేస్తున్నాడని మండిపడ్డారు. 

టీడీపీకి డిపాజిట్లు కూడా ద‌క్క‌ని ప‌రిస్థితి క‌నిపిస్తోంది..

రానున్న తిరుపతి ఉప ఎన్నికల్లో వైయస్‌ఆర్‌సిపి అఖండ మెజారిటీతో గెలుస్తుందని అందరూ భావిస్తున్నారు. ఈ ఎన్నికల్లో తెలుగుదేశం ఏ స్థానంలో వుంటుందో కూడా అర్థంకాని స్థితిలో చంద్రబాబు వున్నాడు. కనీసం టిడిపికి డిపాజిట్లు కూడా దక్కని పరిస్థితి కనిపిస్తోంది. తిరుపతి ఉప ఎన్నికల్లో ఘోర పరాజయం ఎదురైతే, తరువాత జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో మరింత ఎక్కువ ఓటమిని ఎదుర్కోవాల్సి వస్తుందని చంద్రబాబు భయపడుతున్నాడు. అందుకే కోవిడ్ రెండోదశ ఆందోళనలు వున్నా కూడా మొండి పట్టుతో, మూర్ఖంగా చంద్రబాబు కోసమే నిమ్మగడ్డ రమేష్‌ ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించాడు. 

హఠాత్తుగా ఎన్నికల షెడ్యూల్ ఎలా ప్రకటిస్తారు?
 పంచాయతీ ఎన్నికల కన్నా... ప్రజల ప్రాణాలు ముఖ్యం కాదా? దేశ వ్యాప్తంగా కోవిడ్ వాక్సినేషన్ కోసం ప్రభుత్వాలు, ప్రభుత్వ యంత్రాంగం అంతా సిద్దమవుతున్న నేపథ్యంలో నిమ్మగడ్డ హఠాత్తుగా ఎన్నికల షెడ్యూల్ ఎలా ప్రకటిస్తారు. కనీసం వ్యాక్సినేషన్ తరువాత ఎన్నికలు జరపాలంటూ సీఎస్, ఇతర ప్రభుత్వ ఉన్నతాధికారులు పరిస్థితిని వివరించినా నిమ్మగడ్డ రమేష్‌ దుర్మార్గంగా తిరస్కరించడం ఎంత వరకు సమంజసం? చంద్రబాబుకు మేలు చేయాలని, ప్రజల ప్రాణాలను ప్రమాదంలో పెడతారా? గత ఎన్నికల్లో తనకు దారుణమైన ఓటమిని ఇచ్చిన ప్రజలపై చంద్రబాబుకు కోపం, కక్ష వుంటే వుండవచ్చు... కానీ రాజ్యాంగబద్దంగా నడిచే ఎన్నికల కమిషన్‌కు ఆ కోపాలు, కక్షలు వుండకూడదు.

ఎవరైనా మరణిస్తే..?

 వ్యాక్సినేషన్ కోసం అందరూ ఎదురుచూస్తున్నారు. ఉద్యోగులు కూడా కోవిడ్ నుంచి రక్షణ కోరుకుంటున్నారు. వాక్సిన్ ఇవ్వకుండానే వారిని విధులకు వెళ్లమంటే.. తరువాత వారు కోవిడ్ బారిన పడితే.. ఎవరైనా మరణిస్తే... నిమ్మగడ్డ రమేష్ కుమార్ దానికి బాధ్యత వహిస్తారా? 

అప్పుడెందుకు నిర్వ‌హించ‌లేదు..

పంచాయ‌తీ ఎన్నికల నిర్వహణ 2018లోనే రాజ్యాంగం ప్రకారం జరగాల్సి ఉంది. ఎందుకంటే 2013లో పంచాయితీ ఎన్నికలు జరిగాయి కాబట్టి 5 ఏళ్ళ లోపు పంచాయితీ ఎన్నికలు నిర్వహించాలి. 2019లో సార్వత్రిక ఎన్నికలు వస్తుండటంతో, స్థానిక ఎన్నికలు జరిపితే తెలుగుదేశం ఓటమిపాలవుతుందని తెలిసి, దాని ప్రభావం సార్వత్రిక ఎన్నికలపై వుంటుందని చంద్రబాబు ఆరోజు ఎన్నికలకు వెళ్ళలేదు. ఆరోజు కూడా ఎన్నికల కమిషనర్ గా ఉన్న ఇదే నిమ్మగడ్డ రమేష్‌కుమార్ స్థానిక ఎన్నికలపై ఎందుకు మాట్లాడలేదు? చంద్రబాబుకు నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఒక బంటు మాదిరి, ఒక బానిసగా మారిపోయాడు.  చంద్రబాబు జేబులో మనిషి మాదిరిగా ఆరోజున ఎన్నికల వాయిదాకు జీ హుజూర్ అంటూ సహకరించాడు. 

కోవిడ్ కేసులు లేని స‌మ‌యంలో వాయిదా వేసి..

నిమ్మగడ్డ రమేష్ కోవిడ్ కేసులు 30 కూడా లేని సమయంలో స్థానిక సంస్థల ఎన్నికలను హఠాత్తుగా  వాయిదా వేస్తున్నట్లు ప్రకటించాడు. కనీసం రాష్ట్రప్రభుత్వంతో ఎటువంటి సంప్రదింపులు చేయకుండానే ఎన్నికలను వాయిదా వేస్తూ ఏకపక్ష నిర్ణయం తీసుకున్నాడు. ఇప్పుడ కోవిడ్ రెండోదశ ప్రపంచ దేశాల్లో  విజృంభిస్తోంది. చాలా దేశాల్లో లాక్‌డౌన్ అమలు జరుగుతోంది. మన దేశంలోనూ రెండోదశ ప్రమాదం పొంచివుందనే భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టవచ్చు అన్న ఒకే ఒక్క దుర్బుద్ధితో నిమ్మగడ్డ రమేష్ ఎన్నికల నిర్వహణకు సిద్దమయ్యాడు. అందుకోసం కోర్టుకు వెళ్ళాడు. కోర్టు మూడు రోజులు గడువు అనగానే హడావుడిగా మూడోరోజే చీఫ్ సెక్రటరీ, పంచాయితీరాజ్ సెక్రటరీ ఈ ఇద్దరూ వద్దంటున్నా ఎన్నికలు నిర్వహించాల్సిందేనంటూ నోటిఫికేషన్ విడుదల చేశాడు. 

 ప్ర‌ధాని చ‌ర్య‌ల‌ను కూడా అడ్డుకుంటారా?..

ఈ నోటిఫికేషన్ విడుదల ద్వారా నిమ్మగడ్డ రమేష్ అటు ప్రధానమంత్రి తీసుకుంటున్న చర్యలను కూడా అడ్డుకునేలా ప్రవర్తించాడు. కోవిడ్ వ్యాక్సిన్ డ్రై రన్ ప్రారంభమైన రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ఒకటి. కోవిడ్ డ్రై రన్ ముగిసి ఇక వ్యాక్సిన్ ఇవ్వబోతున్నామని ప్రధాని ప్రకటన చేయబోతున్న విషయం ఇప్పటికే అందరికీ తెలుసు. ప్రధాని చేసే ఆ ప్రకటనకు ముందే స్థానిక సంస్థల ఎన్నికల్ని నిర్వహించినట్టైతే, చంద్రబాబుకు అంతోఇంతో పరువు దక్కుతుందన్నది నిమ్మగడ్డ వ్యూహంలా ఉంది. 

 తండ్రీ కొడుకుల‌కు కోవిడ్ ప్రాణ భయం ఏమాత్రం తగ్గలేదు

ఆంధ్రప్రదేశ్ లో ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు వయసు 71. కొడుకు వయసు 38.. వీరిద్దరూ మూతికి గుడ్డలు బిగించుకుని కోవిడ్ పేరుతో హైదరాబాద్ లో గడప దాటడానికే వణికిపోతూ సాధ్యమైనంతవరకు జూమ్ కాన్ఫరెన్స్ లకే ఈరోజుకు పరిమితమయ్యారు.  అంటే చంద్రబాబుకు, ఆయన కొడుక్కి ఈరోజుకీ కోవిడ్ ప్రాణ భయం ఏమాత్రం తగ్గలేదు. మరి అలాంటప్పుడు 90 ఏళ్ళ  ముదుసలి కూడా ఉత్సాహంగా వచ్చి తమ ఓటు హక్కు వినియోగించుకోవాల్సిన పంచాయ‌తీ ఎన్నికల ప్రక్రియలో వ్యాక్సినేషన్ తర్వాత ఒకటి, రెండు నెలల్లో ఎన్నికలు నిర్వహిస్తే.. చంద్రబాబుకు, నిమ్మగడ్డ రమేష్ కు కలిగే నష్టం ఏమిటి..?  మరి ఈరోజే పంచాయితీ ఎన్నికల షెడ్యూల్ ఎందుకు విడుదల చేశాడు?

 కుట్ర‌పూరిత బుద్ధితో నోటిఫికేష‌న్‌..

  రాత్రి బాగా పొద్దుపోయిన తర్వాత చీకట్లో విగ్రహాల విధ్వంసం చేసినట్టే.. చీకట్లో గ్రామ స్వరాజ్యాన్ని ధ్వంసం చేయాలనుకుంటున్నారా..? అన్నది ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. 18 నెలల  వైయస్ జగన్  పరిపాలనలో గ్రామ సెక్రటేరియేట్, గ్రామ వాలంటీర్లు వచ్చిన తర్వాత 1వ తారీఖు, ఇంకా సూర్యోదయం కాకముందే అందుతున్న పెన్షన్లు, చేతికి వస్తున్న 31 లక్షల ఇళ్ళ పట్టాలు, 45 లక్షల మంది బడికి పిల్లల్ని పంపే తల్లులకు అందబోతున్న రెండో విడత అమ్మ ఒడి, వీటితో పాటు ఆసరా, చేయూత, విద్యా దీవెన, విద్యా కానుక, గోరు ముద్ద వంటి పథకాల వల్ల ప్రజలకు కలుగుతున్న లబ్ధిని చూసి ఓర్వలేక... ఇక ఎలాగూ ఏపీలో తమకు స్థానం  లేదన్న ఆలోచనతో మళ్ళీ కోవిడ్ ను ఒక్కసారిగా పెంచాలన్న కుట్రపూరిత బుద్ధితో నిమ్మగడ్డ రమేష్ ద్వారా ఈ ఎన్నికల నోటిఫికేషన్ ఇప్పించాడా... అన్న అనుమానం కలుగుతుంది. 

 ఈ ఎన్నికల నోటిఫికేషన్ ను ఈయన కంటే పెద్ద స్థాయిలోనే ఉద్యోగం చేస్తోన్న చీఫ్ సెక్రటరీ, పంచాయ‌తీరాజ్ ప్రిన్పిపల్ సెక్రటరీ వంటి బాధ్యత కలిగిన ఉద్యోగులు వద్దంటుంటే, వ్యాక్సిన్ వచ్చే వరకూ ఆగండి అంటుంటే.. కాదు, ఇప్పుడే ఎన్నికలు పెడతానని చెప్పడం ఒక వ్యక్తికి సంబంధించిన కుట్ర మాత్రమే కాదు, దీన్ని ఆరు కోట్ల ప్రజల ప్రాణాలకు సంబంధించిన పరమ కిరాతకమైన కుట్రగా భావించాల్సి ఉంటుందని అంబ‌టి రాంబాబు వ్యాఖ్యానించారు. 

Back to Top