తాడేపల్లి: వైయస్ వివేకానందరెడ్డి ఇంటి వాచ్‌మెన్ రంగయ్య అనారోగ్యంతో మృతి చెందితే ఆ మరణాన్ని వైయస్ఆర్‌సీపీకి ఆపాదించేందుకు రాష్ట్రమంత్రివర్గంలో కుట్ర పన్నారని వైయస్ఆర్‌సీపీ అధికార ప్రతినిధి కారుమూరి వెంకటరెడ్డి మండిపడ్డారు. చంద్రబాబు అధ్యక్షతన ఈరోజు(07.03.2025) జరిగిన మంత్రివర్గ సమావేశంలో వైయస్ వివేకానందరెడ్డి ఇంటికి వాచ్‌మెన్ గా పనిచేసిన రంగయ్య(70) మృతిపై గంట సేపటికిపైగా చర్చ జరిగింది. రంగయ్య మృతిని వైయస్ఆర్‌సీపీ మీదకు ఎలా నెట్టాలి అనేదానిపై చంద్రబాబు మంత్రివర్గ సహచరులతో గంటకుపైగా చర్చించి దాన్ని ప్రజల్లో ఏవిధంగా తీసుకెళ్లాలని మంత్రులకు శిక్షణ ఇచ్చారు. మంత్రివర్గ సమావేశం తీరును వైయస్ఆర్‌సీపీ తీవ్రంగా ఖండించింది. ఈ సందర్భంగా పార్టీ అధికార ప్రతినిధి కారుమూరి వెంకటరెడ్డి మీడియాతో మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే.. - అసలు వైయస్ వివేకానందరెడ్డి హత్య జరిగినప్పుడు మార్చి 15, 2019న చంద్రబాబే సీఎంగా ఉన్నారు. ఆ హత్యకు సంబంధించి సుప్రీంకోర్టు డైరెక్షన్‌లో సీబీఐ విచారణ జరుపుతోంది. ఇలాంటి నేపథ్యంలో రాష్ట్రంలో ఏ సమస్యలూ లేనట్టు రంగయ్య మృతిపై కేబినెట్ సమావేశం ఏర్పాటు చేసి మరీ నిస్సిగ్గుగా మాట్లాడుతున్నారు. అనారోగ్యంతో రంగయ్య(70) చనిపోతే దాన్ని వైయస్ఆర్‌సీపీకి ఎలా ఆపాదించాలో కేబినెట్‌లో చర్చించడం ఏంటి? - కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక జూన్ నుంచి జనవరి వరకు 8 నెలల కాలంలో 16,809 మంది మహిళల మీద జరిగిన అఘాయిత్యాలపై కేసులు నమోదైతే దానిపై మాట్లాడొచ్చు కదా. ప్రతి గంటకు ముగ్గురు మహిళల మీద అఘాయిత్యాలు జరిగితే ఆ అంశంపై చర్చ జరగదు. - 9 నెలల్లో ఒక్క ఉద్యోగం ఇచ్చిన పాపాన పోలేదు. దానిపై చర్చ లేదు - రాష్ట్రంలో అమలు చేయాల్సిన సంక్షేమ, అభివృద్ది కార్యక్రమాలపై చర్చ జరగడం లేదు. - ఎంతసేపటికీ డైవర్షన్ పాలిటిక్స్ చేయడమే సరిపోయింది. ప్రస్తుతం రంగయ్య మృతిని హత్యకేసుగా మార్చి వైయస్ఆర్‌సీపీ మీదకు నెట్టి డైవర్షన్ పాలిటిక్స్ చేయాలని చూస్తున్నారు. - ఎందుకంటే, రాష్ట్ర అప్పులపై ప్రజలకు ఈరోజు అసలు నిజం తెలిసింది. అది కూడా రాష్ట్ర అప్పులు మొత్తం రూ. 6,46,531 కోట్లని అందులోనూ వైయస్ జగన్ హయాంలో కేవలం రూ. 3.39 లక్షల కోట్ల అప్పులే ఉన్నాయని ఆర్థికమంత్రి పయ్యావుల కేశవ్ ఇచ్చిన సమాధానంతో కూటమి పార్టీలన్నీ కకావికలం అవుతున్నాయి. - ప్రభుత్వ అప్పులు రూ. 2,34,224 కోట్లు, కార్పొరేషన్ల ద్వారా తెచ్చిన రుణాలు రూ.1,05,324 అని ఆయన లిఖిత పూర్వకంగా సమాధానం ఇచ్చారు. - ఈ సమాధానంతో మొన్నటి దాకా వైయస్ జగన్ రూ.14 లక్షల కోట్లు అప్పులు చేశాడని ప్రచారం చేస్తే ఇప్పుడది కేవలం రూ. 3.39 లక్షల కోట్లేనని తేలడంతో ప్రజలకు ముఖం చూపించలేక ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. - ఈ అంశం నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు రంగయ్య మృతిని కూడా వైయస్ఆర్‌సీపీకి ఆపాదించేందుకు కుట్రలు చేస్తున్నారు. దానికోసం మంత్రివర్గ సమావేశంలో గంటకుపైగా చర్చించడం కన్నా దౌర్భాగ్యమైన అంశం ఇంకోటి ఉండదు.