ఎల్లో దుష్ప్రచారం జనం నమ్మరంటే నమ్మరు 

వైయ‌స్ఆర్‌సీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి విజ‌య‌సాయిరెడ్డి

విశాఖ‌: ఎన్నికలు దగ్గరపడేకొద్దీ తెలుగుదేశం నేతలు ప్రతి అంశాన్నీ రాజకీయం చేస్తున్నార‌ని వైయ‌స్ఆర్‌సీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి విజ‌య‌సాయిరెడ్డి మండిప‌డ్డారు. చంద్ర‌బాబు, ఆయ‌న కంపెనీ చేస్తున్న దుష్ప్ర‌చారం జ‌నం న‌మ్మ‌రంటే న‌మ్మ‌ర‌ని తెలిపారు. ఏ విషయంలోనైనా పొంతన లేని ‘వాస్తవాలు’ వెలికితీసి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వంపైనా, పాలకపక్షమైన వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్ పార్టీపైన బురదజల్లుతున్నారు. గుంటూరు టీడీపీ ఎంపీ కుటుంబ యాజమాన్యంలోని అమరరాజా బ్యాటరీస్‌ తన విస్తరణ ప్రాజెక్టుకు తెలంగాణ ప్రాంతాన్ని ఎంపికచేసుకుంటే దానికి కారణం ఏపీ ప్రభుత్వమేనని టీడీపీ నేత నారా చంద్రబాబు నాయుడు, ఆయన అనుకూల పత్రికలు చేస్తున్న అబద్ధాల ప్రచారం నాటి గోబెల్స్‌ ప్రాపగాండాను మించిపోయింది. కార్పొరేట్‌ కంపెనీలు తమ ఫ్యాక్టరీలను ఏ ప్రాంతంలో పెట్టాలనే విషయాన్ని నిర్ణయించడానికి వ్యాపార కారణాలనే మొదట, చివరా పరిగణనలోకి తీసుకుంటాయి. ఒక్కోసారి ఒక రాష్ట్ర ప్రభుత్వ ఎన్ని రాయితీలు కల్పిస్తున్నా ఆ రాష్ట్రంలో ఒక పరిశ్రమ స్థాపనకు అన్ని వ్యాపార అంశాలూ అనుకూలంగా లేకుంటే ఏ కంపెనీ అయినా ఆ పని చేయదు. చెన్నై, బెంగళూరు, పుణె సమీపంలో ఆటోమొబైల్‌ కంపెనీలు తమ తయారీ యూనిట్లు పెట్టడానికి పూర్తిగా వ్యాపార పరిస్థితులే కారణం. ఈ రెండు నగరాలకు ఉన్న మౌలిక సదుపాయాలే వాటి సమీప ప్రాంతాలకు కోరని వరాలుగా మారాయి. అంతేగాని, తమకు ఇష్టమైన రాజకీయపక్షం అధికారంలో ఉన్న రాష్ట్రాల్లోనే ఏ కంపెనీ కూడా తన యూనిట్లను పెట్టదు. ఈ విషయాలేమీ తెలియవన్నట్టు తెలుగుదేశం నేతలు, వారి అనుకూల మీడియా యజమానులు ఇప్పుడు ఈ బ్యాటరీల కంపెనీ విస్తరణ ప్రాజెక్టు వ్యవహారంలో మాట్లాడుతున్నారు. అసత్యాలతో కూడిన కథనాలు ప్రచారంలో పెడుతున్నారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి గారి నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వంపై బురదజల్లడానికి తమ ఎంపీ కంపెనీ ఉత్పత్తి చేసే బ్యాటరీలను చక్కగా వాడుకుంటున్నారు. 

మహారాష్ట్ర, గుజరాత్‌ రాష్ట్రాల్లో జరిగే పరిణామాలు కనపడవా? 
ఇటీవల రెండు బడా అంతర్జాతీయ కంపెనీలు తమ ఇండియా ప్రాజెక్టులను మొదట మహారాష్ట్రలో పెడదామనుకున్నాయి. తర్వాత తమ ఉత్పత్తి అవసరాలకు గుజరాత్‌ రాష్ట్రంలో మెరుగైన సౌకర్యాలున్నాయని అవి గ్రహించాయి. కొన్ని రోజులు ఆలోచించి ఆ కంపెనీలు చివరికి గుజరాత్‌లోనే పెట్టుబడులు పెట్టి తమ ప్రాజెక్టులు ప్రారంభించాలని నిర్ణయించాయి. వాస్తవానికి పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన ఈ రెండు పశ్చిమ రాష్ట్రాల్లోనూ ప్రభుత్వాలను కీలకంగా నడుపుతున్నది ఒకే రాజకీయపక్షం. ఇక ఆంధ్రా బ్యాటరీల కంపెనీ విషయానికి వస్తే తెలంగాణలో తమ విస్తరణ ప్రాజెక్టు పెట్టాలన్నది దాని యాజమాన్యం సొంత నిర్ణయం. అంతేగాని ఏపీలో ఈ కంపెనీ విస్తరణ యూనిట్‌ పెట్టకుండా అక్కడి ప్రభుత్వం అడ్డుకున్నదేమీ లేదు. ఒకవేళ సర్కారు అడ్డంకులు సృష్టిస్తే–తెలుగుదేశం ఎంపీ కూడా అయిన ఈ కంపెనీ అధినేత స్వయంగా ఆ విషయం చెప్పేవారే కదా. ఈ ఎంపీ గారు ఇతర ప్రయోజనాలు ఆశించి ఈ నిర్ణయం తీసుకుంటే దానికి ఏపీ సర్కారు కారణం కాదు. ఇకనైనా కంపెనీల పేరు మీద చంద్రబాబు అండ్‌ కంపెనీ వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వంపై ఇలాంటి దుష్ప్రచారం మానుకుంటే మంచిది. ఎందుకంటే టీడీపీ, దాని అనుకూల మీడియా చేసే దుర్మార్గ ప్రచారాన్ని గుడ్డిగా నమ్మడానికి ఆంధ్రా ప్రజలు చంద్రబాబు గారు అనుకున్నంత అమాయకులు కాదు. వారు చైతన్యవంతులు. ఏ కంపెనీని ఏ సర్కారూ రాకుండా అడ్డుకోదు. అలాగే, బలవంతంగా ఏ కంపెనీని ఏ ప్రభుత్వమూ రప్పించలేదు.

Back to Top