హైదరాబాద్: ‘‘వైయస్ వివేకానందరెడ్డి హత్య కేసును అప్రూవర్ కట్టుకథ ఆధారంగా సీబీఐ విచారణ చేస్తోంది. పర్సన్ టార్గెట్‌గా కేసును ముందుకు తీసుకెళ్తున్నారు. తప్పుడు సాక్ష్యాలతో అమాయకులను ఈ కేసులోకి లాగాలని చూస్తున్నారు. ఇన్నాళ్లూ నాపై ఎన్ని ఆరోపణలు చేసినా కేవలం వివేకం సార్ చనిపోయారు, సునీతమ్మ ఆయన కూతురు అని మౌనంగా ఉన్నా.. నేను ఎలాంటి తప్పు చేయలేదు.. ఈ కేసులో ఎంతదూరమైన న్యాయపోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నానని గట్టిగా హామీ ఇస్తున్నాను’’ అని వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ వైయస్ అవినాష్‌రెడ్డి అన్నారు. సీబీఐ విచారణ ముగిసిన అనంతరం ఎంపీ వైయస్ అవినాష్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు.
‘‘సీబీఐ విచారణకు మూడోసారి రమ్మన్నారు. 10.45కి ఇక్కడకు చేరుకున్నాను. 11 నుంచి 1 గంట వరకు విచారణ చేశారు. 1గంట తరువాత హైకోర్టు నుంచి పిలుపు వచ్చిందని ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ వెళ్లారు. లోపలే కూర్చోమన్నారు. 3.30 గంటలకు ఇప్పుడు మీరు వెళ్లండి.. పిలిచినప్పుడు మళ్లీ రావాలని చెప్పారు’’.
‘‘మొదటిసారి వచ్చినప్పుడు ఆడియో, వీడియో రికార్డింగ్‌తో విచారణ జరగాలని విచారణ అధికారిని అడిగాం. రెండోసారి సీబీఐ డైరెక్టర్‌ని ఆడియో, వీడియో రికార్డింగ్‌తో విచారణ జరగాలని అడిగాం. రెండుసార్లు ఎలాంటి స్పష్టత ఇవ్వకపోవడంతో ఒక సామాన్యుడి హక్కుగానే మూడోసారి హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. రెండు సార్లు అడిగినా పట్టించుకోలేదు. మూడోసారి అందరి మాదిరిగానే హైకోర్టును ఆశ్రయించాను. సీబీఐ విచారణలో ఉన్నందు వల్ల కోర్టులో వాదనలు ఏం జరిగాయో నాకు తెలియదు.. తెలుసుకుంటాను’’.
‘‘విచారణ తప్పుదోవపడుతోందని ఇంతకు ముందు కూడా నేను స్పష్టంగా చెప్పాను. గూగుల్ టేకౌట్ కాదు.. అది టీడీపీ టేకౌట్. ఇలాంటి తప్పుడు ఆధారాలతో అమాయకులను అన్యాయంగా ఈ కేసులోకి లాగడం తప్పు. విచారణలో చాలా కీలకమైన అంశాలను వదిలేసి.. చిన్న చిన్న అంశాలను తెచ్చి రుద్దుతున్నారు. మా జిల్లాలో ఎంపీ టికెట్ మోటివ్ అంటే నవ్వుతారు’’.
‘‘వైయస్ వివేకానందరెడ్డి చనిపోయే రోజు కూడా మైదుకూరు నియోజకవర్గం చాపాడు మండలంలో 300 ఇళ్లకు డోర్ టు డోర్ ప్రచారం చేశారు. ఎమ్మెల్యే అభ్యర్థిగా రఘురామిరెడ్డికి, ఎంపీ అభ్యర్థిగా అవినాష్‌రెడ్డికి ఓటు వేయండి అని ప్రచారం నిర్వహించారు. కావాలంటే సీబీఐ వాళ్లు ఆ ఇళ్లకు తిరిగి అడగవచ్చు.. ఎమ్మెల్యే అభ్యర్థి రఘురామిరెడ్డిని పిలిచి స్టేట్‌మెంట్ తీసుకోవచ్చు. కానీ సీబీఐ అలా చేయడం లేదు. కేవలం కుట్రలకు ఉపయోగపడే స్టేట్‌మెంట్స్ మాత్రమే తీసుకుంటారు తప్ప.. నిజాలు వెల్లడయ్యే స్టేట్‌మెంట్స్ తీసుకోరని స్పష్టంగా అర్థం అవుతుంది’’.
‘‘ఎమ్మెల్సీ ఎన్నికల్లో వివేకం సార్‌కు సరిగ్గా మద్దతు ఇవ్వలేదని నాపై అభియోగం వేశారు. దాదాపు 800 పైచిలుకు ఎమ్మెల్సీ ఓటర్లు (ఎంపీటీసీ, జెడ్పీటీసీ, కౌన్సిలర్లు) ఉన్నారు. వారిని పిలిచి అడగండి. ఏ ఒక్కరైనా నాపై నెగిటివ్‌గా చెబుతారేమో కనుక్కోండి అంటే అదీ చేయడం లేదు. కేవలం అప్రూవర్ థియరీ, కట్టుకథను అడ్డంపెట్టుకొని ఈ రకంగా విచారణను పర్సన్ టార్గెటెడ్‌గా ముందుకు తీసుకెళ్తున్నారు. ఇది చాలా తప్పు’’.
‘‘ఇప్పటి వరకు ఎన్ని విమర్శలు వచ్చినా, మీడియా ఎన్ని విమర్శలు చేసినా, మా సోదరి సునీతమ్మ సుప్రీం కోర్టులో, హైకోర్టులో ఎన్ని ఆరోపణలు చేసినా నేను మౌనంగానే ఉన్నాను. ఎందుకంటే వివేకం సార్ చనిపోయారు.. ఆయన కూతురు అనే కారణం, విచారణ జరుగుతుంది అని మాత్రమే. నేను మౌనంగా ఉండటం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా వైయస్‌ఆర్ సీపీ కార్యకర్తలు చాలా అయోమయంగా ఉన్నారు. గట్టిగా మీ అందరికీ నమ్మకం ఇస్తున్నాం. నేను ఎలాంటి తప్పు చేయలేదు. ఎంతదూరమైన న్యాయ పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నానని గట్టిగా హామీ ఇస్తున్నాను’’.
‘‘సీబీఐ వాళ్లే మా సోదరికి సమాచారం ఇస్తున్నారు. కోర్టులను కూడా తప్పుదోవ పట్టిస్తున్నారు. నేను లంచ్‌మోషన్ వేసిన వెంటనే సునీతమ్మకు సీబీఐ సమాచారం ఇచ్చింది. దీని వెనుక పెద్ద కుట్రలున్నాయి. సీబీఐ ఈ రకంగా కుమ్మకై విచారణ చేస్తే ఎలా.. ఈ రాజకీయ కుట్రలను కచ్చితంగా ఛేదిస్తాం. న్యాయపోరాటం చేస్తాం..’’
‘‘వివేకం సార్‌కు 2006 నుంచి ఒక మహిళతో సంబంధం ఉంది. 2011లో బహుశా పెళ్లి చేసుకున్నారు. ఆ పెళ్లి కోసం ఇస్లాం లా ప్రకారం షేక్ మహ్మద్ అక్బర్ అని పేరు కూడా మార్చుకొని పెళ్లి చేసుకున్నారు. పెళ్లి తరువాత షేక్ షెహన్‌షా అనే కుమారుడు పుట్టాడు. వివేకం సార్ పూర్తిగా ఆ అబ్బాయిని భవిష్యత్తులో రాజకీయ వారసుడిగా డిక్లేర్ చేయాలనే ఆలోచన, తపన ఆయనలో ఉంది’’.
‘‘విచారణ ఎంత తప్పుదోవ పడుతుందంటే.. అప్రూవర్ స్టేట్‌మెంట్‌లో కూడా ఇళ్లంతా డాక్యుమెంట్స్ కోసం వెతుకుతారని ఉంది. హత్య తరువాత మూడు నాలుగు సెట్ల డాక్యుమెంట్స్ రౌండ్ సీల్స్ దాని మీద ఉన్నాయని స్పష్టంగా చెప్పారు. ఇదంతా రికార్డులో ఉండేదే నేను మాట్లాడుతున్నాను. నా అభిప్రాయం ఏంటంటే.. తప్పకుండా అవి నోటరైజ్డ్ సీల్స్, డాక్యుమెంట్స్, విల్లు.. రెండో భార్య పేరుతోనో, ఆ అబ్బాయి పేరుతోనో వివేకం సార్‌కు సంబంధించిన ఆస్తి.. ఇవ్వాలనుకోవడం, దాన్ని ఎవరు అడ్డుకోవాలనుకున్నారో, ఎవరికి ఇంట్రస్ట్ ఉందో.. ఏదో ఆశించే ఈ హత్య చేసి ఉంటారనేది నా గట్టి నమ్మకం. అందులో భాగంగానే వివేకానందరెడ్డిని ఈ రకంగా వారు హత్య చేసి ఉంటారని భావిస్తున్నా. తప్పకుండా నేను రాబోయే రోజుల్లో న్యాయపోరాటం చేస్తా. నాకు తెలిసిన ప్రతి వాస్తవాన్ని కోర్టు ముందు, మీడియా ముందు పెడతా’’.
‘‘అప్రూవర్ థియరీ కట్టుకథ. ఆ స్టేట్‌మెంట్లో రూ.8 కోట్ల డబ్బు రావాల్సిందో.. వచ్చిందో.. దాని గురించి ఘర్షణ మొదలైందని చెబుతున్నారు. ఆ షేర్ల పంపకంతో గొడవ మొదలైనట్టుగా, ఆ రకంగానే వివేకానందరెడ్డిపై దాడిచేస్తారని అప్రూవర్ స్టేట్‌మెంట్‌లో ఉంది. ఇది అందరికీ తెలుసు. ఇదే సీబీఐ విచారణలో బెంగళూరు సెటిల్‌మెంట్ ఫెయిల్ అయ్యింది.. ఒక్క రూపాయి డబ్బు వచ్చే అవకాశం లేదు.. ఆ డాక్యుమెంట్స్ అన్నీ ఫేక్ అని 8 మంది సాక్షులు చాలా స్పష్టంగా చెప్పారు. రాని డబ్బుకోసం, వచ్చే అవకాశమే లేని డబ్బు కోసం ఎవరైనా ఘర్షణ పెట్టుకొని చంపుకుంటారా..? ఇది చాలదా కట్టుకథ అని చెప్పడానికి.. ఇదంతా రికార్డులోనే ఉంది’’.
‘‘ఆ లెటర్ దాచిపెట్టడం పెద్ద తప్పు కాదా.. నేను వెళ్లేలోపు ఘటన స్థలంలో లెటర్ ఉంది. ఆ లెటర్‌ను సునీతమ్మ భర్త రాజశేఖర్ దాచిపెట్టాడు. పీఏ కృష్ణారెడ్డికి చెప్పి ఆ లెటర్‌ను, ఆ లెటర్‌లోని అంశాన్ని ఏ ఒక్కరికీ చెప్పొద్దు అని రాజశేఖర్ చెప్పారు. నిజంగా లెటర్‌ను, సెల్‌ఫోన్‌ను దాచిపెట్టడం తప్పు కాదా..? దాచిపెట్టిన వాటి గురించి పోలీసులకైనా చెప్పాలి కదా..? వాళ్లు ఎక్కడ బాధ్యతగా ప్రవర్తించారు. వాళ్లు చెబితేనే నేను ఘటన స్థలానికి వెళ్లాను. నాకైనా లెటర్ గురించి చెప్పాలి కదా..? ఏమీ చెప్పకుండా నన్ను ఎందుకు వెళ్లమన్నారు..? తప్పకుండా ఆ లెటర్ అనేది వివేకానందరెడ్డి హత్యను నిర్ధారించే సాక్ష్యం. దాన్ని బయట పెట్టకపోవడం చాలా పెద్ద తప్పు. ఆ విషయంపై కూడా తప్పకుండా విచారణ జరగాలని కోరాం’’
‘‘గుండెపోటుతో చనిపోయారని ఏ ఒక్కరికీ నేను చెప్పలేదు. అప్పట్లో అధికారంలో ఉన్న తెలుగుదేశం ప్రభుత్వం నేను చెప్పినట్టుగా చిత్రీకరించింది. కావాలంటే నేను మాట్లాడిన మాటలు ఒకసారి చూసుకోండి. నేను చాలా బాధ్యతగా ప్రవర్తించాను. ఫ్యామిలీ మెంబర్స్ సమాచారం ఇచ్చిన తరువాతే ఘటనా స్థలానికి వెళ్లాను. వెళ్లిన తరువాత మృతదేహాన్ని చూసి బయటకు వచ్చి పోలీసులకు, దగ్గర బంధువులకు, ముఖ్యమైన నాయకులకు ఫోన్ చేసి సమాచారం ఇచ్చాను. ఇవన్నీ చేయకపోతే తప్పు అంటారు కానీ, చేస్తే తప్పు అంటారని నేను ఊహించలేదు’’.
‘‘తప్పకుండా న్యాయపరంగా అన్ని రకాలుగా పోరాటం చేస్తాం. సీబీఐ రికార్డు పరిధిలోని అంశాలనే తీసి కోర్టుల దృష్టికి, మీడియా దృష్టికి తీసుకువస్తాం. తప్పకుండా న్యాయం గెలుస్తుంది.. వాస్తవం బయటకు వస్తుంది’’ అని ఎంపీ వైయస్ అవినాష్‌రెడ్డి చెప్పారు.