విశాఖ: విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా వ్యతిరేకిస్తుందని, ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని కేంద్రాన్ని విజ్ఞప్తి చేస్తున్నామని, ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఎంతవరకైనా పోరాడేందుకు వైయస్‌ఆర్ సీపీ సిద్ధంగా ఉందని రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి అన్నారు. స్టీల్ ప్లాంట్‌పై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సమాధానం రాష్ట్ర ప్రజలను, కార్మికులను తీవ్ర నిరాశ, ఆందోళనకు గురిచేసిందన్నారు. దశాబ్ద కాలం పోరాటం సాగించి.. విశాఖ స్టీల్ ప్లాంట్ సాధించుకున్నామని, ప్లాంట్ సెంటిమెంట్‌ను వివరించేందుకు సీఎం వైయస్ జగన్ ప్రధాని అపాయింట్ కూడా కోరారన్నారు. సొంత గనులు, రుణాలను ఈక్విటీగా మార్చితే సంస్థ లాభాలబాట పడుతుందని చెప్పారు. విశాఖపట్నంలోని వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో ఎంపీ విజయసాయిరెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ఏం మాట్లాడారంటే.. ఫిబ్రవరి 6వ తేదీన సీఎం వైయస్ జగన్ విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి ప్రధానికి వ్యూహాత్మాక నూరు శాతం పెట్టుబడుల ఉపసంహరణ, కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని పునరాలోచించాలని లేఖ రాయడం జరిగింది. అదే సమయంలో కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రికి తెలియజేయడం జరిగింది. నిన్న ఆర్‌ఐఎన్‌ఎల్ నూరుశాతం పెట్టుబడుల ఉపసంహరణ గురించి శ్రీమతి నిర్మలాసీతారామన్ లోక్‌సభలో లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు. ఆ సమాధానంతో రాష్ట్ర ప్రజలను, వివిధ కార్మిక సంఘాల నాయకులను, స్టీల్ ప్లాంట్ ఉద్యోగులను, కార్మికులను తీవ్ర నిరాశ, ఆందోళనకు గురిచేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ దీర్ఘకాలం పోరాటం తరువాత సాధించుకున్న గొప్ప సంస్థ, విశాఖ ఉక్కు – ఆంధ్రుల హక్కు అని దశాబ్దం పాటు సాగిన పోరాటంలో 32 మంది మరణించారు. 20 వేల మందికి ప్రత్యేకంగా, పరోక్షంగా ఉపాధి కల్పిస్తుంది. ప్రభుత్వరంగ సంస్థగా అభివృద్ధి చెందింది. 2002 నుంచి 2017 వరకు విశాఖ ఉక్కు కర్మాగారం అత్యుత్తమ తీరు ప్రదర్శించి లాభాల బాటలో నడిచి దేశానికి ట్యాక్సులు, ఇతరత్ర రూపాల్లో ప్రయోజనం చేకూర్చింది. స్టీల్ ప్లాంట్‌కు 19,700 ఎకరాల భూమి ఉంది. మార్కెట్ విలువ ప్లాంట్‌తో సహా సుమారు రూ. లక్ష కోట్లకు పైగా ఉంటుందని అందరికీ తెలుసు. విశాఖ ఉక్కు సంస్థ సామర్థ్యం 7.3 మిలియన్ టన్నులుగా నమోదవుతుంది. ఉత్పత్తి సామర్థ్యం పెంచడానికి సంస్థ వివిధ చర్యలు తీసుకుందని అందరికీ తెలుసు. ఆర్థిక మాంద్యం వల్ల విశాఖ ఉక్కు 2014–15 నుంచి క్రమంగా నష్టాల బాటపట్టింది. దీనికి ప్రధానంగా సొంత గనులు లేకపోవడం, విస్తరణకు ఎక్కువగా అప్పులు తీసుకురావడంతో రుణభారం పడడం నష్టాలకు కారణమైంది. విశాఖ ఉక్కు కర్మాగారం సంస్థకు కాస్త అండగా నిలిచి చేయూతనిస్తే.. తప్పనిసరిగా నష్టాల నుంచి లాభాలబాట పడుతుందని మా ప్రభుత్వం బలంగా నమ్ముతుంది. సీఎం రెండు ప్రత్యామ్నాయాలు సూచించారు. సొంత గనులు కేటాయించడం, రుణభారాన్ని ఈక్విటీగా కన్వర్ట్ చేస్తే.. సంస్థ చెల్లిస్తున్న 14 శాతం వడ్డీ భారం తగ్గుతుంది. తద్వారా నష్టాల నుంచి లాభాల్లోకి వస్తుంది. సొంత గనులు కేటాయించడం వల్ల ఇంచుమించుగా ఒక టన్నుకు రూ.5వేలు ఆదా జరుగుతుంది. తప్పకుండా నష్టాల నుంచి లాభాల్లోకి తీసుకొచ్చే అవకాశం ఉంది. రుణాలను ఈక్విటీగా మార్చితే.. వడ్డీ భారం తగ్గి.. స్టాక్ ఎక్ఛెంజ్‌లో కూడా లిస్టు చేసుకోవచ్చు.. ఈ ప్రక్రియతో స్టాక్ మార్కెట్ ద్వారా ప్రజల నుంచి నిధులు సేకరించవచ్చు. స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటీకరణ చేయడం కంటే.. లాభాల బాటలోకి తీసుకువచ్చి.. అవసరం అనుకుంటే 25 – 30 శాతం స్టాక్ ఎక్ఛెంజ్‌లో లిస్టు చేసి.. దాన్ని ప్రజలే కొనుగోలు చేస్తారు. సొంత గనులు కేటాయించనప్పటికీ, రుణాన్ని ఈక్విటీగా కన్వెర్ట్ చేయనప్పటికీ స్టీల్ ప్లాంట్ గతేడాది డిసెంబర్ నుంచి 6.3 గరిష్ట స్థాయిలో పనిచేస్తూ.. ప్రతి నెలా సుమారు రూ.200 కోట్ల లాభాన్ని అర్జిస్తుంది. నష్టాల్లో కూరుకుపోయిన సంస్థ అనే అభిప్రాయాన్ని కేంద్రం తెలియజేస్తుంది. కానీ, ఇది కరెక్ట్ కాదు. ఇసుప ఖనిజం విశాఖ స్టీల్ ప్లాంట్ ఉత్పత్తి కోసం ప్రస్తుతం ఎన్‌ఎండీసీకి చెందిన బైలెడిలాడ్ గనుల నుంచి మార్కెట్ ధరకు ఒక టన్నుకు రూ.5,260కు ఖనిజం కొనుగోలు చేస్తుంది. సొంత గనులు ఉంటే సంస్థ లాభాలబాట పడుతుంది. దేశంలోని అన్ని స్టీల్ ప్లాంట్లకు సొంత గనులు ఉన్నాయి.. ఒక్క విశాఖ ప్లాంట్‌కు తప్ప. మిగతా అన్ని స్టీల్ ప్లాంట్లు కూడా 60 శాతం ముడి సరుకు సొంత గనుల నుంచి, 40 శాతం బయట నుంచి తీసుకుంటుంటే.. విశాఖ ప్లాంట్ మాత్రం 100 శాతం ముడిసరుకు ఎన్‌ఎండీసీ దగ్గర నుంచి కొనుగోలు చేస్తుంది. విశాఖ స్టీల్ ప్లాంట్‌కు అవసరమైన ఖనిజాన్ని పూర్తిగా ఎన్‌ఎండీసీ గనుల మీద ఆధారపడటం వల్ల విశాఖ ఉక్కుకు రూ.3472 కోట్లకు పైగా భారం పడుతుంది. సొంత గనులు ఉంటే.. ఆ డబ్బంతా మిగులుతుంది. విశాఖ ఉక్కును ఎలా లాభాలబాట పట్టించాలనే విషయాలను స్వయంగా ప్రధానికి వివరించేందుకు సీఎం వైయస్ జగన్ అపాయింట్‌మెంట్ కోరారు. ప్రధాని వద్దకు అఖిలపక్ష బృందంతో పాటు, కార్మిక సంఘాల నేతలను కూడా వెంట తీసుకెళ్తారు. విశాఖ స్టీల్ ప్లాంట్‌కు సంబంధించి రాష్ట్ర ప్రజల ఆకాంక్ష, సంస్థతో ముడిపడి ఉన్న సెంటిమెంట్‌ను స్వయంగా ప్రధానికి సీఎం వైయస్ జగన్ వివరిస్తారు. అందువల్ల వీలైనంత త్వరగా అపాయింట్‌మెంట్ ఇవ్వాలని కోరారు. విశాఖ స్టీల్ ప్లాంట్ రివైవల్ కోసం రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తుంది. లక్ష్య సాధన కోసం సమర్థవంతమైన నాయకులు అందరితో కలిసి అడుగులు వేస్తామని తెలియజేస్తున్నాను. ప్రధానిని కలిసి వివరించడమే కాకుండా.. రాష్ట్ర శాసనసభలో ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తాం. ప్రైవేటీకరణ విషయంలో కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా వ్యతిరేకిస్తుంది. ప్రజల ఆకాంక్షల మేరకు ప్రైవేటీకరణ సాధ్యం కాదు అని తెలియజేస్తుంది. నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని కేంద్రాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఎంతవరకైనా పోరాడేందుకు అంతా సిద్ధంగా ఉన్నాం’ అని తెలియజేస్తున్నాను.